కలల కెరియర్‌ కుప్పకూలుతోంది! 1400 మంది జీవితాలు.. | SpiceJet to lay off 1400 employees to save costs | Sakshi
Sakshi News home page

కలల కెరియర్‌ కుప్పకూలుతోంది! 1400 మంది జీవితాలు..

Published Mon, Feb 12 2024 11:14 AM | Last Updated on Mon, Feb 12 2024 11:43 AM

SpiceJet to lay off 1400 employees to save costs - Sakshi

SpiceJet layoff : ఎయిర్‌లైన్స్‌లో పనిచేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. ఎయిర్‌ క్రాఫ్ట్‌లలో పైలట్లుగా, ఇతర సిబ్బందిగా పనిచేయడం ఎంతో మందికి డ్రీమ్‌ కెరియర్‌. ఆకర్షణీయమైన వేతనాలతో పాటు దీన్నో ఉత్తమ ప్రొఫెషన్‌గా చూస్తారు. అలాంటి కలల కెరియర్‌ కుప్పకూలిపోతోంది.. 1400 మంది జీవితాలు రోడ్డు మీదకు వస్తున్నాయి.

15 శాతం మంది లేఆఫ్‌
చౌక ధరల్లో విమాన ప్రయాణాన్ని అందించే ఎయిర్‌లైన్‌గా పేరొందిన స్పైస్‌జెట్ తీవ్రమైన నగదు కొరతతో సతమతమవుతోంది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడానికి  తమ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 15 శాతం మంది అంటే సుమారు 1400 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఈ చర్య ద్వారా పెట్టుబడిదారుల ఆసక్తిని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. 

ఉద్యోగుల తొలగింపు విషయాన్ని స్పైస్‌జెట్ ధ్రువీకరించినట్లు ఎకనామిక్ టైమ్స్‌ పేర్కొంది. ఆపరేషనల్ అవసరాల కోసం కంపెనీలో అన్ని రకాల ఖర్చులను సర్దుబాటు చేసుకోవడంలో భాగంగా లేఆఫ్‌లు అమలు చేస్తున్నట్లు స్పైస్‌జెట్ ప్రతినిధిని ఉటంకిస్తూ పేర్కొంది.

తొలగింపులు అనివార్యం
స్పైస్‌జెట్‌లో ఉద్యోగుల జీతాల బిల్లు రూ. 60 కోట్లు ఉంది. ఈ కారణంగానే ఉద్యోగుల తొలగింపులు అనివార్యమైనట్లు కంపెనీ అంతర్గత పరిణామాలు తెలిసినవారు చెబుతున్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు కంపెనీ ఇప్పటికే సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కాగా స్పెస్‌జెట్‌ కొన్ని నెలలుగా జీతాల చెల్లింపులో జాప్యం చేస్తోంది. చాలా మందికి జనవరి నెల జీతం ఇప్పటికీ అందలేదు. ప్రస్తుతం స్పైస్‌జెట్‌లో  9,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ సంస్థ 30 విమానాలను నడుపుతోంది. 2019లో స్పైస్‌జెట్‌లో గరిష్ట స్థాయిలో 16,000 మంది ఉద్యోగులు ఉండేవారు. 118 విమానాలను ఈ సంస్థ నడిపేది.

రూ. 2,200 కోట్ల నిధులు పొందే ప్రక్రియలో ఉన్నామని, అయితే కొంత మంది ఇన్వెస్టర్లలో విశ్వాసం కొరవడిందని స్పైస్‌జెట్ చెబుతోంది. “ఫండింగ్ జాప్యాలు ఏవీ లేవు. మా ఫండ్ ఇన్ఫ్యూషన్‌తో బాగా పురోగమిస్తున్నాం. తదనుగుణంగా ఇప్పటికే  బహిరంగ ప్రకటనలు  చేశాం. తదుపరి పురోగతిని త్వరలో తెలియజేస్తాం. చాలా మంది ఇన్వెస్టర్లు మాతో చేరుతున్నారు” అని స్పైస్‌జెట్ ప్రతినిధి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement