న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో నష్టాలను వీడి లాభాల్లోకి ప్రవేశించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 205 కోట్ల నికర లాభం ఆర్జించింది. దేశీయంగా విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరగడం ఇందుకు సహకరించింది.
గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 789 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం నిర్వహణ ఆదాయం మాత్రం రూ. 2,457 కోట్ల నుంచి రూ. 2,002 కోట్లకు నీరసించింది. నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,072 కోట్ల నుంచి రూ. 1,291 కోట్లకు భారీగా తగ్గాయి. పలు సవాళ్ల నేపథ్యంలోనూ లాభాలు ఆర్జించగలిగినట్లు కంపెనీ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాము చేపట్టిన రూ. 500 కోట్ల పెట్టుబడులు కంపెనీ వృద్ధికి తోడ్పాటునిచ్చినట్లు తెలియజేశారు. ఈ కాలంలో లాజిస్టిక్స్ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్ అండ్ లాజిస్టిక్స్ ప్రయివేట్ లిమిటెడ్‌ను విడదీయడంతో స్పైస్‌జెట్ నెట్‌వర్త్ మెరుగుపడినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు బీఎస్‌ఈలో 7% జంప్‌చేసి దాదాపు రూ. 34 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment