
State Bank of India Clarifies on Reports of Unpaid Refund: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బిఐ) డిజిటల్ చెల్లింపుల అదనపు ఛార్జీల విషయంపై క్లారిటీ ఇచ్చింది. 2017 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2019 మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపుల సమయంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పిఎంజెడివై) ఖాతాదారుల నుంచి వసూలు చేసిన రుసుములో భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత ఇంకా తిరిగి ఇవ్వాల్సి ఉందని మీడియాలో వస్తున్న వార్తలపై ఎస్‌బిఐ వివరణ ఇచ్చింది. డిజిటల్ లావాదేవీల కోసం తన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్‌బీడీ) ఖాతాదారుల నుంచి ఎటువంటి లావాదేవీ రుసుమును వసూలు చేయమని ఎస్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.
"ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా ఎస్‌బిఐ బీఎస్‌బీడీ ఖాతాదారుల నుంచి రుసుముల రూపంలో వసూలు చేసిన రూ.254 కోట్లలో కేవలం 90 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చింది. ఇంకా రూ.164 కోట్లను ఎస్‌బీఐ చెల్లించాల్సి ఉంది" అని ఐఐటీ-ముంబై తయారు చేసిన నివేదిక గత వారం తెలిపింది. ఈ కాలంలో ఒక్కో ఖాతా నుంచి బ్యాంకు రూ.17.70 వసూలు చేసినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ నివేదికపై ఎస్‌బిఐ స్పందిస్తూ.. “యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యుపీఐ), రూపే డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే లావాదేవీలతో సహా ఇతర డిజిటల్ లావాదేవీలకు బీఎస్‌బీడీ ఖాతాదారులు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేసింది. ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా బీఎస్‌బీడీ ఖాతాదారుల మొదటి నాలుగు విత్ డ్రాలకు ఎటువంటి ఛార్జీలు ఉండవని ఎస్‌బిఐ స్పష్టం చేసింది.
(చదవండి: దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాల బ్యాన్..! నితిన్ గడ్కరీ క్లారిటీ!)