బెంగళూరు: బంగారు ఆభరణాలపై రుణాలందించే స్టార్టప్ రుపీక్ ను చెంతకు చేర్చుకోవాలని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎస్బీఐ యాప్ లో రుపీక్ కు చోటు కల్పించాలని చూస్తున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. బెంగళూరు కేంద్రంగా 2015లో ప్రారంభమైన గోల్డ్ లోన్స్ స్టార్టప్ రుపీక్.. కస్టమర్ల ఇంటి వద్ద రుణ సౌకర్యాలను కల్పిస్తోంది. ప్రస్తుతం నెలకు రూ. 350- 375 కోట్లవరకూ రుణాలందిస్తోంది. ఏడాదిన్నర క్రితం ఇవి రూ. 20 కోట్లేకాగా.. ఇప్పటికే కరూర్ వైశ్యా, ఫెడరల్ బ్యాంక్ లతో జత కట్టింది. ఇటీవల కాథోలిక్ సిరియన్, యాక్సిస్ బ్యాంకులతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
లోన్స్ కు డిమాండ్
కోవిడ్ -19 నేపథ్యంలో కొద్ది రోజులుగా గోల్డ్ లోన్స్ కు డిమాండ్ పెరిగినట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు కావడంతో ఎస్బీఐ నుంచి గోల్డ్ లోన్స్ కు మరింత డిమాండ్ కనిపిస్తున్నట్లు తెలియజేశాయి. నిజానికి బ్యాంకుకున్న నెట్వర్క్ సామర్థ్యం రీత్యా రోజుకి రూ. 150 కోట్లవరకూ రుణాలు విడుదల చేయవచ్చని చెబుతున్నాయి. అయితే డిమాండుకు అనుగుణంగా ప్రస్తుతం సర్వీసులను అందించలేకపోతున్నట్లు వివరించాయి. దీంతో గోల్డ్ లోన్ మార్కెట్లో 30 శాతం వాటాకు బదులు 15 శాతాన్నే కైవసం చేసుకున్నట్లు అభిప్రాయపడ్డాయి. అయితే రుపీక్ తో భాగస్వామ్యం ఏర్పాటు చేయడం ద్వారా స్టేట్ బ్యాంక్ గోల్డ్ లోన్స్ ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలగనున్నట్లు తెలియజేశాయి.
రూ. 1200 కోట్లు
రుపీక్ తో స్టేట్ బ్యాంక్ జట్టు కడితే.. 2021 మార్చికల్లా రూ. 1,200 కోట్లమేర గోల్డ్ లోన్స్ ను పంపిణీ చేసే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల కారణంగా ఎన్బీఎఫ్సీ తదితర ఫిన్ టెక్ సంస్థలు మార్కెట్లో విస్తరించేందుకు వీలు చిక్కడంలేదని ఫైనాన్షియల్ నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి గోల్డ్ లోన్స్.. భద్రత కలిగినవి కావడంతో డిఫాల్ట్ సమస్యలు తక్కువేనని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment