దివంగత యాపిల్ సహ వ్యవస్థాపకుడు 'స్టీవ్ జాబ్' భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025కు హాజరయ్యారు. అయితే.. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి 'కైలాసనంద గిరి మహారాజ్' వెల్లడించారు.
లారెన్ పావెల్ జాబ్స్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని, ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని కైలాసనంద గిరి మహారాజ్ చెప్పారు. ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదు. అంతే కాకుండా లారెన్ చాలా సాదాసీదాగా ఉంది, పూజా సమయంలో కూడా మాతో పాటు ఉండేవారని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు లారెన్ పావెల్ జాబ్స్ హాజరై.. ఆమె పేరును 'కమల'గా మార్చుకున్నట్లు కైలాసనంద గిరి మహారాజ్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆమె భారతదేశానికి రావడం ఇది రెండోసారి, ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి మన దేశానికి వచ్చినట్లు చెబుతున్నారు.
లారెన్ పావెల్ జాబ్స్ జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.
మంగళవారం జరిగే మొదటి అమృత స్నాన్ లేదా పవిత్ర స్నానానికి కనీసం 3-4 కోట్ల మంది ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తారు. సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒక్కొక్కరుగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.
మహా కుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన సమ్మేళనాలలో ఒకటి. ఇది ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. దీనికి సుమారు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కుంభమేళా ప్రారంభమైన మొదటిరోజే.. 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు.
రూ.2 లక్షల కోట్ల ఆదాయం
ఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.
2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలో 24 కోట్లమంది కుంభమేళా సందర్శించారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమ సంస్కృతుల సంగమం అని.. భిన్నత్వంలో ఏకత్వ సందేశంగా అభివర్ణించారు.
Comments
Please login to add a commentAdd a comment