ముంబై: కార్పొరేట్ దివాలా ప్రక్రియ ప్రారంభమైన కంపెనీల విషయంలో ఇన్వెస్టర్లకు స్పష్టతను ఇచ్చేందుకు వీలుగా దిగ్గజ స్టాక్ ఎక్సే్ంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ మార్గదర్శకాలు రూపొందించాయి. తద్వారా ఇలాంటి కంపెనీల లిస్టింగ్ అంశాలకు సంబంధించి సరైన సమాచారాన్ని అందించేందుకు నడుం బిగించాయి. ఇటీవల రుణ పరిష్కార ప్రణాళికల్లో భాగంగా పలు కంపెనీలు వాటాదారులకు ఎలాంటి చెల్లింపులనూ చేపట్టకుండానే తమ ఈక్విటీల డీలిస్టింగ్ లేదా రైటాఫ్, రద్దు వంటివి చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే దివాలా ప్రక్రియలో భాగంగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) రుణ పరిష్కార ప్రణాళికలను ఆమోదించడంలో తొలి ఆదేశాలు, తదుపరి రాతపూర్వక ఆదేశాలకు మధ్య గడువుకు ఆస్కారం ఉంటోంది. దీంతో ఎన్‌సీఎల్‌టీకి చేరిన కంపెనీలు ఈ అంశాలపై తగిన విధంగా సమాచారాన్ని అందించడంలేదని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తెలియజేశాయి. ఎన్‌సీఎల్‌టీ నుంచి రాతపూర్వక ఆదేశాలు వచ్చేవరకూ స్టాక్ ఎక్సే్ంజీలకు వివరాలను దాఖలు చేయడంలేదని వివరించాయి. ఇలాంటి సమాచారం ఎంపిక చేసిన కొంతమందికి మాత్రమే అందుతున్నదని, ఇది అస్పష్టతకు తావిస్తున్నదని తెలియజేశాయి. వెరసి మార్కెట్లలో ఈ కంపెనీల లిస్టింగ్ సమాచారంపై గందరగోళం నెలకొంటున్నట్లు పేర్కొన్నాయి.
పూర్తి వివరాలు
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ తాజాగా రూపొందించిన నిబంధనలలో భాగంగా కార్పొరేట్ రుణ పరిష్కార ప్రక్రియకు చేరిన కంపెనీలకు పూర్తిస్థాయి మార్గదర్శకాలను జారీ చేయనున్నాయి. సెబీ ఎల్‌వోడీఆర్ నియంత్రణల ప్రకారం ఈ ఆదేశాలు జారీకానున్నాయి. వీటిని స్టాక్ ఎక్సే్ంజీల వెబ్‌సైట్లలో పొందుపరచరు. ఆయా కంపెనీల ఈమెయిల్స్‌కు పంపిస్తాయి. ఎల్‌వోడీఆర్ నిబంధనలను రిజల్యూషన్ ప్రొఫెషనల్ అమలు చేయవలసి ఉంటుంది. రుణ పరిష్కార ప్రణాళికపై నిర్ణయాలను 30 నిముషాల్లోగా దాఖలు చేయవలసి ఉంటుంది. దీంతోపాటు లిస్టెడ్ సెక్యూరిటీల వాటాదారులపై ఈ ప్రభావానికి సంబంధించి తగిన సమాచారాన్ని అందించవలసి ఉంటుంది. ఇదే సమయంలో ఆయా కంపెనీలు, రుణపరిష్కార నిపుణులు.. రిజల్యూషన్ ప్రణాళికకు చెందిన రహస్య అంశాలపట్ల ఎక్సే్ంజీలకు దాఖలు చేసేటంత వరకూ గోప్యతను పాటించవలసి ఉంటుంది. ఏదైనా కంపెనీ ఎన్‌సీఎల్‌టీకి చేరిన వెంటనే ఎక్సే్ంజీలు టాగ్ చేస్తాయి. ఇలాంటి కంపెనీల జాబితాను సైతం పొందుపరుస్తాయి. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాలు ఏవైనా ఉంటే అలర్ట్‌ను ప్రకటిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment