ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయం(నేటి రాత్రి), కీలక కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. సెన్సెక్స్ ఉదయం 146 పాయింట్ల లాభంతో 66,531 వద్ద మొదలైంది.
ట్రేడింగ్‌లో 381 పాయింట్ల పరిధిలో 66,178 వద్ద కనిష్టాన్ని, 66,559 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29 పాయింట్ల స్వల్ప లాభంతో 66,356 వద్ద నిలిచింది. నిఫ్టీ 57 పాయింట్లు పెరిగి 19,729 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 19,616 – 19,729 శ్రేణిలో ట్రేడైంది. ఆఖరికి ఎనిమిది పాయింట్ల స్వల్ప నష్టంతో 19,681 వద్ద నిలిచింది. బ్యాంకులు, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో రియల్టీ షేర్లలో అమ్మకాలు తలెత్తాయి.
మెటల్, ఇంధన, ఆటో, ఫార్మా, మీడియా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు 0.39%, 0.31 శాతం చొప్పున రాణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,089 కోట్ల షేర్లను కొన్నారు.., దేశీ ఇన్వెస్టర్లు రూ.334 కోట్ల షేర్లను అమ్మేశారు. ఆర్థిక వేత్తలు అంచనాలకు తగ్గట్లే ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంచొచ్చనే ఆశలతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
♦ చైనాలో కోవిడ్ అనంతరం నెలకొన్న ఆర్థిక సవాళ్లను అధిగమించేందుకు అక్కడి ప్రభుత్వం భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించవచ్చనే వార్తలతో దేశీయ మెటల్ షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్‌ఈ మెటల్ ఇండెక్స్ మూడుశాతం ర్యాలీ చేసింది. జిందాల్ స్టీల్, హిందుస్థాన్ కాపర్, హిందాల్కో షేర్లు 5.50 – 4% ర్యాలీ చేశాయి.
జేఎస్‌డబ్ల్యూ, ఏపీఎల్ అపోలో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, నాల్కో షేర్లు 3% లాభపడ్డాయి. సెయిల్, వేదాంత, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్ జింక్ షేర్లు రెండు శాతం ర్యాలీ చేశాయి.
♦ దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అదానీ గ్రూప్ షేర్లు లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 10%, అదానీ పవర్ 9.3% ర్యాలీ చేశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ 8%, అదానీ విల్మార్ 5%, అదానీ టోటల్ గ్యాస్, ఎన్‌డీటీవీ షేర్లు పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి.
ఈ గ్రూప్ చెందిన అంబుజా సిమెంట్స్ 4%, ఏసీసీ 5%, లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్ 2% పెరిగాయి. పది కంపెనీల షేర్ల ర్యాలీతో గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ ఒక్క రోజులోనే రూ.50,501 కోట్లకు పెరిగి రూ.10.60 లక్షల కోట్లకు చేరింది.
♦ టాటా స్టీల్ షేరు ఆరంభ నష్టాల నుంచి కోలుకొని లాభాల్లోకి వచ్చింది. చివరికి 3% లాభపడి రూ.119 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment