
ముంబై: స్టాక్ మార్కెట్ దూకుడు ఆగడం లేదు. సూచీలు నాలుగోరోజూ సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. ఫార్మా, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించి రికార్డుల ర్యాలీకి అండగా నిలిచాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 272 పాయింట్లు ఎగసి 55,855 వద్ద, నిఫ్టీ 66 పాయింట్లు పెరిగి 16,629 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదుచేశాయి. జూన్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించడంతో ఐటీ రంగ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. కొన్ని రోజులుగా అమ్మకాల ఒత్తిడికి లోనైన స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
బ్యాంకింగ్, మెటల్, ఆటో, రియల్టీ షేర్లు నష్టాలను చవిచూశాయి. మెటల్ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఆస్తుల నాణ్యత బాగా క్షీణించినట్లు పలు సర్వేలు తెలపడంతో ప్రైవేట్ రంగ బ్యాంక్ షేర్లు పతనాన్ని చవిచూశాయి. చివరికి సెన్సెక్స్ 210 పాయింట్ల లాభంతో 55,792 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 52 పాయింట్లను ఆర్జించి 16,615 వద్ద ముగిసింది. ఈ స్థాయిలు ఇరు సూచీలకు కొత్త ముగింపు స్థాయిలు. నిఫ్టీకిది ఏడోరోజూ, సెన్సెక్స్‌కు నాలుగురోజూ లాభాల ముగింపు. విదేశీ ఇన్వెస్టర్లు రూ.345 కోట్ల షేర్లను అమ్మగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.266 కోట్ల షేర్లను విక్రయించారు. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి విలువ 11 పైసలు బలహీనపడి 74.35 వద్ద ముగిసింది.
ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్ ...
దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం స్వల్ప నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 17 పాయింట్ల నష్టంతో 55,566, నిఫ్టీ 18 పాయింట్ల పతనంతో 16,545 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో తొలి సెషన్‌లో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 197 పాయింట్లు కోల్పోయి 55,386 వద్ద, నిఫ్టీ 68 పాయింట్లు క్షీణించి 16,495 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరి అరగంటలో కొనుగోళ్ల జోరుతో సూచీలు రికార్డు స్థాయిల వద్ద ముగిశాయి.
టీసీఎస్ రూ.13 లక్షల కోట్లు
ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ మార్కెట్‌క్యాప్ తొలిసారి రూ.13 లక్షల కోట్లకు అధిగమించింది. తద్వారా రిలయన్స్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో దేశీయ అతిపెద్ద కార్పొరేట్‌గా రికార్డు సృష్టించింది. ఐటీ షేర్ల ర్యాలీలో భాగంగా ఈ షేరు 2.5% ఎగసి రూ.3561 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 2% లాభంతో రూ.3553 వద్ద స్థిరపడింది. ఈక్రమంలో కంపెనీ మార్కెట్ విలువ రూ.13.14 లక్షల కోట్లుగా నమోదైంది. టీసీఎస్ షేరు ఈ ఏడాది(2021)లో ఇప్పటికి వరకు 23.76 శాతం లాభపడింది. రిలయన్స్ రూ.13.70 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►హైదరాబాద్ ఆధారిత కిమ్స్ హాస్పిటల్స్ షేరు 13 శాతం లాభపడి రూ.1,377 వద్ద ముగిసింది. జూన్ త్రైమాసికంలో ఉత్తమ ప్రదర్శన కనబరించడంతో పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించడం ర్యాలీకి కారణమైంది.
►డివిడెండ్ చెల్లింపును వాయిదా వేయడంతో హిందుస్తాన్ జింక్ 4% పతనమై రూ.318 వద్ద ముగిసింది.
►వివాదాస్పద ట్యూటికోరిన్ అంశంలో మద్రాసు హైకోర్టు వేదాంతకు నోటీసు లు జారీ చేయడంతో షేరు పదిశాతం పతనమై రూ.303 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment