అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం | Sudha Murthy Nominates Rajya Sabha With President Of India | Sakshi
Sakshi News home page

అమృత‘మూర్తి’కి అరుదైన గౌరవం

Published Fri, Mar 8 2024 2:26 PM | Last Updated on Fri, Mar 8 2024 3:14 PM

Sudha Murthy Nominates Rajya Sabha With President Of India  - Sakshi

రాజ్యసభకు నామినేట్‌ అయిన సుధామూర్తి

ఇన్ఫోసిస్ ఛైర్‌పర్సన్, సంస్థ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్‌ చేసినట్లు ప్రధాని నరేంద్రమోదీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున ఈ నిర్ణయం వెలువడడం విశేషం.

సుధామూర్తి సంఘ సేవకురాలిగా అందరికీ సుపరిచితం. ఈమె గొప్ప రచయిత్రి. కంప్యూటర్ ఇంజినీర్‌గా జీవితాన్ని ప్రారంభించి ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుధామూర్తి పలు అనాధాశ్రమాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్దికి సహకరిస్తున్నారు. కర్ణాటకలోని దాదాపు అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్ విద్యను చేరేలా తోడ్పడుతున్నారు. ఆమె గతంలో కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆమెను రాజ్యసభకు నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించినట్లు తెలిసింది.

ఆమె నవలే సీరియల్‌గా..

సుధామూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ‘ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ ప్రారంభించారు. ఆమె కాల్పనిక రచనలు కూడా రాస్తారు. ఆమె రచించిన కన్నడ నవల ‘డాలర్ సొసే’ ఇంగ్లిష్‌లో డాలర్ బహుగా ట్రాన్స్‌లేట్‌ చేశారు. తర్వాత ఆ నవల 2001లో ‘జీ టీవీ’లో సీరియల్‌్‌గా ప్రసారం చేశారు.

భూరి విరాళాలు..

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా సుధామూర్తి ఐఐటీ కాన్పూర్‌లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉండే హెచ్.ఆర్.కాదిం దివాన్ బిల్డింగ్ హౌసింగ్‌ ఏర్పాటుకు, నారాయణరావ్ మెల్గిరి స్మారక న్యాయ కళాశాలకు భూరి విరాళాలను అందజేశారు. కర్ణాటకలోని బి.వి.బి.టెక్నికల్‌ కాలేజీలో ఎలక్టికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌(ఐఐఎస్‌) నుంచి కంప్యూటర్ సైన్స్‌ విభాగంలో గోల్డ్‌మెడల్‌ సాధించారు.

పోరాడితే దక్కిన ఉద్యోగం..

విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆటో పరిశ్రమలో పేరొందిన టెల్కో కంపెనీలో మహిళా ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. అంతా ఈజీగా ఈ ఉద్యోగం రాలేదు. అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకే స్థానం కల్పించేవారు. దాన్ని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి పోస్టుకార్డు రాశారు. దానికి స్పందించిన ఆయన తనకు ఇంటర్వ్యూ నిర్వహించారు. అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించారు. ఆ సంస్థకు పుణె బ్రాంచిలో పనిచేస్తున్నపుడే ఆవిడకు నారాయణ మూర్తితో పరిచయం ఏర్పడి తర్వాత వివాహం చేసుకున్నారు. 

అందుకున్న పురస్కారాలు..

మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతగా పలు సేవలు అందిస్తున్నారు. అలాగే ఇన్ఫోసిస్‌కు క్యాపిటలిస్ట్‌గా ఉన్న కెటారామన్ వెంచర్స్ సంస్థలకు పెట్టుబడిదారుగా వ్యవహరిస్తున్నారు.

  • 2004 - సామాజిక సేవకుగాను శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం
  • 2006 - భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం. (సామాజిక సేవ, దాతృత్వం, విద్యా రంగం)
  • దేశంలో న్యాయ విద్య , ఉపకారవేతనాల అందజేతకు ప్రముఖ న్యాయవేత్త సంతోష్ హెగ్డేతో కలిసి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. 
  • సాహితీ సేవ, ఆమె రచనలకు ఆర్.కె.నారాయణన్ పురస్కారం అందుకున్నారు.
  • 2011లో కన్నడ సాహిత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అట్ఠిమబ్బే (Attimabbe) అవార్డు అందుకున్నారు.
  • 2023 -పద్మ భూషణ్ అవార్డు
  • 2023 - గ్లోబల్ ఇండియన్ అవార్డు. 

ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’

ప్రముఖ రచనలు

  • మదర్ ఐ నెవెర్ న్యూ 
  • మేజిక్ ఆఫ్ ది లాస్ట్ టెంపుల్
  • హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్‌ స్టోరీస్
  • వైస్ అండ్ అదర్ వైస్
  • మేజిక్ డ్రమ్ అండ్ ఆదర్ ఫేవరేట్ స్టోరీస్
  • 3000 స్టిచెస్: ఆర్డినరీ పీపుల్ ఎక్స్‌ట్రార్డినరీ లైవ్స్ 
  • గ్రాండ్ మాస్ బాగ్ ఆఫ్ స్టోరీస్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement