వినియోగదారులు తమ అసౌకర్యం కోసం విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయరని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రముఖ లగ్జరీ కార్ల తయరీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఉత్పత్తుల్లో తలెత్తిన సమస్యల పరిష్కారంపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు సమర్థించింది. జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం రెండు వేర్వేరు కేసుల అప్పీళ్లను పరిష్కరించింది.
సంస్థ డైరెక్టర్ల కోసం కొనుగోలు చేసిన బెంజ్ కార్ల విషయంలో సమస్యలను ఎదుర్కొన్న రెండు కంపెనీలు వేర్వేరుగా జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ)ను ఆశ్రయించాయి. మొదటి కేసులో కంట్రోల్స్ అండ్ స్విచ్ గేర్ కంపెనీ లిమిటెడ్ దాని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కోసం రెండు మెర్సిడెస్ కార్లను కొనుగోలు చేసింది. బెంజ్ అనేకసార్లు మరమ్మతులు చేసినప్పటికీ కార్లలోని హీటింగ్ సమస్యను తగ్గించలేకపోయింది. దాంతో కంపెనీ ఎన్‌సీడీఆర్‌సీని సంప్రదించింది. వినియోగదారుకు అనుకూలంగా తీర్పు రావడంతో దాన్ని సవాలు చేస్తూ బెంజ్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కారును వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లు కోర్టులో వాదించింది. కానీ అందుకు సరైన ఆధారాలు సమర్పించలేకపోయింది. దాంతో పూర్తి వివరాలు పరిశీలించిన కోర్టు ఎన్‌సీడీఆర్‌సీ తీర్పును సమర్థించింది. కస్టమర్ మెర్సిడెస్ కారుకు బదులుగా వేరే కొత్త కారు ఇవ్వాలని లేదా బెంజ్ కారు కొనుగోలుకు అయిన రూ.1.15 కోట్లలో సగం తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
రెండో కేసులో సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ తన మేనేజింగ్ డైరెక్టర్ కోసం మెర్సిడెస్ ఈ-క్లాస్ కారును 2006లో కొనుగోలు చేసింది. ప్రమాదవశాత్తు ఈ కారు వేరే వాహనంతో ఢీకొట్టింది. అయితే సరైన రీతిలో ఎయిర్‌బ్యాగ్‌లు అమర్చక పోవడంవల్ల డైరెక్టర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంపై బెంజ్ కంపెనీను సంప్రదిస్తే డ్రైవర్ స్థానంలో ఉన్నవారికి సీట్ బెల్ట్ ఉండడంతో ప్రమాద తీవ్రత అంతగా ఉండదని చెప్పింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌ని అమర్చడం అవసరం లేదని బెంజ్ వాదించింది. ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చకపోవడం వల్ల సర్వీస్‌లో లోపం ఉన్నందుకు ఎన్‌సీడీఆర్‌సీ రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని బెంజ్‌ను ఆదేశించింది. దీన్ని సవాలు చేస్తూ మెర్సిడెస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ కేసులోనూ వినియోగదారుకు అనుకూలంగా ఎన్‌సీడీఆర్‌సీ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది.
ఇదీ చదవండి: ఒక వ్యక్తికి రూ.2 లక్షలే అప్పు ఇవ్వాలి: ఎంఫిన్
ఈ కేసులు విచారించిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ..‘ఏదైనా ఉత్పత్తులు కొనేపుడు వినియోగదారులు కంపెనీలు ప్రచురించిన బ్రోచర్లు చూసి ఆకర్షితులవుతారు. సంస్థలు వాటిపై ఉన్న ప్రతి సౌకర్యాలను వినియోగదారులకు అందించాల్సిందే. దానిపై నమ్మకంతోనే కంపెనీ వస్తువులను కొనుగోలు చేస్తారు. కంపెనీలు కూడా ఆ విలాసాలను చూపించే తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. ప్రజలు అసౌకర్యంగా ఉండేందుకు రూ.లక్షలు ఖర్చుపెట్టి అత్యాధునిక విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయరు’ అని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment