ఇష్యూ ధర శ్రేణి రూ. 371 - రూ. 390
న్యూఢిల్లీ: నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ప్రతిపాదిత రూ. 11,300 కోట్ల పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నవంబర్ 6న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇందుకోసం ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ. 371 నుంచి 390 వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇష్యూ నవంబర్ 8న ముగుస్తుందని, యాంకర్ ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ తేదీ నవంబర్ 5గా ఉంటుందని వివరించాయి.
ఐపీవో కింద రూ. 4,500 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో రూ. 6,800 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రారంభ దశలో ఇన్వెస్ట్ చేసిన యాక్సెల్, ఎలివేషన్ క్యాపిటల్, నార్త్‌వెస్ట్ వెంచర్స్ వాటాలను విక్రయించడం ద్వారా తమ పెట్టుబడులపై 35 రెట్లు రాబడులు పొందనున్నట్లు తెలిపాయి.
తాజా ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 137 కోట్ల మొత్తాన్ని అనుబంధ సంస్థ స్కూట్నీ రుణాలను తీర్చేందుకు, రూ. 982 కోట్లను క్విక్ కామర్స్ సెగ్మెంట్‌లో డార్క్ స్టోర్ నెట్‌వర్క్ విస్తరణకు కంపెనీ వినియోగించనుంది. 2014లో ఏర్పాటైన స్విగ్గీ వేల్యుయేషన్ ఈ ఏడాది ఏప్రిల్‌లో 13 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 మార్చి 31 నాటికి వార్షికాదాయం 1.09 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment