న్యూఢిల్లీ: ప్రముఖ ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫుడ్స్ తయారీ సంస్థ ‘హల్దీరామ్స్’లో వాటా కొనుగోలుకు టాటా కన్జ్యూమర్ ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు కొన్ని కథనాలు వెలుగు చూశాయి. హల్దీరామ్స్‌లో కనీసం 51 శాతం వాటా కొనుగోలుకు టాటా కన్జ్యూమర్ సుముఖత చూపుతుండగా.. విలువల వద్దే ఏకాభిప్రాయం కుదరలేనట్టు సమాచారం.
హల్దీరామ్స్ ప్రమోటర్లు 10 బిలియన్ డాలర్ల వ్యాల్యూషన్ (రూ.83,000 కోట్లు) కోరుతున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. కానీ, ఇది చాలా ఎక్కువ అని టాటా కన్జ్యూమర్ ప్రతినిధులు హల్దీరామ్స్‌తో చెప్పినట్టు తెలిపాయి. మొత్తం మీద వ్యాల్యూషన్ విషయంలోనే టాటా సంస్థ సౌకర్యంగా లేదని తెలిసింది.
ఒకవేళ ఏకాభిప్రాయం కుదిరి హల్దీరామ్స్‌లో మెజారిటీ వాటా టాటా కన్జ్యూమర్ చేతికి వస్తే.. అది కంపెనీ చరిత్రలో పెద్ద డీల్ అవుతుంది. టాటా సంస్థ పెప్సీ, ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌తో నేరుగా పోటీపడే అవకాశం లభిస్తుంది. ఈ వార్తల నేపథ్యంలో టాటా కన్జ్యూమర్ షేరు బుధవారం 4 శాతం వరకు లాభపడింది. మరోవైపు హల్దీరామ్స్ బెయిన్ క్యాపిటల్ సహా పలు ప్రైవేటు ఈక్విటీ సంస్థలతో 10 శాతం వాటా విక్రయమై చర్చలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.
భారీ అవకాశం..
హల్దీరామ్స్ ఆదాయం 1.5 బిలియన్ డాలర్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరానికి టాటా కన్జ్యూమర్ ఆదాయం 1.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. టాటా కన్జ్యూమర్ టాటా సంపన్న్ పేరుతో పప్పు ధాన్యాలు, టీ, సోల్‌ఫుల్ పేరుతో ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్టార్‌బక్స్ భాగస్వామ్యంతో కాఫీ రెస్టారెంట్లను నిర్వహిస్తోంది. ‘‘టాటా కన్జ్యూమర్‌కు హల్దీరామ్స్ ఎంతో ఆకర్షణీయమైన అవకాశం. టాటా కన్జ్యూమర్‌ను టీ కంపెనీగా చూస్తారు. హల్దీరామ్స్ అనేది విస్తృతమైన మార్కెట్ వాటా కలిగిన కన్జ్యూమర్ కంపెనీ’’అని ఈ వ్యవహారం తెలిసిన ఓ వ్యక్తి తెలిపారు.
6.2 బిలియన్ డాలర్ల సంఘటిత స్నాక్ మార్కెట్‌లో హల్దీరామ్స్‌కు 13 శాతం వాటా ఉంది. లేస్ బ్రాండ్‌పై స్నాక్స్ విక్రయించే పెప్సీకి సైతం 13 శాతం మార్కెట్ ఉంది. హల్దీరామ్స్ తన ఉత్పత్తులను సింగపూర్, అమెరికా తదితర దేశాల్లోనూ విక్రయిస్తోంది. స్థానిక ఫుడ్, స్వీట్లను విక్రయించే 150 రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ‘‘ఒకేసారి మార్కెట్ పెంచుకోవాలంటే హల్దీరామ్స్‌కు మించిన అవకాశం మరొకటి ఉండదు. ఈ స్థాయిలో ప్యాకేజ్డ్ ఫుడ్, ఫుడ్ సర్వీసెస్ నిర్వహించే సంస్థ వేరొకటి లేదు’’అని కన్సల్టెన్సీ సంస్థ టెక్నోప్యాక్ కన్జ్యూమర్ హెడ్ అంకుర్ బిసేన్ అభిప్రాయపడ్డారు.
చర్చలు నిర్వహించడం లేదు..
ఈ కథనాలపై టాటా కన్జ్యూమర్ స్పందించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు ఓ వివరణ ఇచ్చింది. ‘‘కథనాల్లో పేర్కొన్నట్టుగా మేము చర్చలు నిర్వహించడం లేదు. కంపెనీ వ్యాపారం విస్తరణ, వృద్ధి కోసం వ్యూహాత్మక అవకాశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. అవసరం ఏర్పడినప్పుడు నిబంధనల మేరకు ప్రకటిస్తుంది’’అని పేర్కొంది. మార్కెట్ స్పెక్యులేషన్‌పై స్పందించబోమని టాటా కన్జ్యూమర్ అధికార ప్రతినిధి సైతం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment