ఆటోమోటివ్‌ రంగంలో 4,000 మందికి శిక్షణ! | Tata Motors collaborate with NVS established Automotive Skill Labs at JNV to over 4000 students | Sakshi
Sakshi News home page

ఆటోమోటివ్‌ రంగంలో 4,000 మందికి శిక్షణ!

Published Tue, Jul 16 2024 2:55 PM | Last Updated on Tue, Jul 16 2024 3:03 PM

Tata Motors collaborate with NVS established Automotive Skill Labs at JNV to over 4000 students

ప్రముఖ ఆటోమొబైల్‌ తయారీ సంస్థ టాటా మోటార్స్, నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌)లోని 4,000 మంది విద్యార్థులకు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ‘జాతీయ విద్యా విధానం 2020’కి అనుగుణంగా మెరుగైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరునలను తయారు చేయడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌వీఎస్‌ల్లో 25 ‘ఆటోమోటివ్‌ స్కిల్‌ ల్యాబ్స్‌’ ప్రారంభించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పింది.

టాటా మోటార్స్‌ సీఎస్‌ఆర్‌ హెడ్‌ వినోద్‌ కులకర్ణి మాట్లాడుతూ..‘విద్యార్థులకు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 25 ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వీటిని సిద్ధం చేసి శిక్షణ ఇస్తున్నాం. స్కిల్‌ ల్యాబ్‌ల్లో ఏటా 4,000 మందికి ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు అందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్‌లో దాదాపు 30% మంది బాలికలు ఉండడం విశేషం. ప్రాక్టికల్ ఆటోమోటివ్ స్కిల్స్, ఇండస్ట్రీ ఎక్స్‌పోజర్, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కోసం తగిన విధంగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు’ అని తెలిపారు.

‘ఆటోమోటివ్‌ స్కిల్‌ ల్యాబ్‌లో నైపుణ్యాల పెంపునకు అవసరమైన అన్ని సాధనాలు ఏర్పాటు చేశాం. సెకండరీ, సీనియర్ సెకండరీ విద్యార్థులకు (9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) లోతైన విషయ పరిజ్ఞానానికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. క్లాస్‌రూం ట్రెయినింగ్‌తో పాటు టాటా మోటార్స్ ప్లాంట్‌లను సందర్శించడం, సర్వీస్, డీలర్‌షిప్ నిపుణులతో చర్చించడం, వారి ఉపన్యాసాలు వినడం వల్ల మరింత ఎక్కువ సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న విద్యార్థులకు టాటా మోటార్స్, ఎన్‌వీఎస్‌ నుంచి జాయింట్ సర్టిఫికేట్‌లను అందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్‌లో ప్రతిభ చూపిన వారికి టాటా మోటార్స్ పూర్తి స్టైపెండ్ అందించి ఉద్యోగ శిక్షణతో కూడిన డిప్లొమా ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. డిప్లొమా పూర్తయిన తర్వాత టాటా మోటార్స్‌లో విద్యను కొనసాగించాలనుకునేవారు ఇంజినీరింగ్ సంస్థలతో కలిసి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా బీటెక్‌ పట్టా పొందే వీలుంది. అనంతరం ప్రతిభ ఆధారంగా సంస్థలో ఉద్యోగం కూడా పొందవచ్చు’ అని వివరించారు.

ఇదీ చదవండి: అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?

2023లో ఆటోమోటివ్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఏఎస్‌డీసీ) నిర్వహించిన ‘నేషనల్ ఆటోమొబైల్ ఒలింపియాడ్‌’లో ఈ ప్రోగ్రామ్ నుంచి 1,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 17 మంది పోటీలో రెండో దశ వరకు చేరుకున్నారు. పుణెలోని స్కిల్ ల్యాబ్‌లో విద్యార్థులు ప్రయోగాత్మక శిక్షణలో భాగంగా ఇ-రిక్షాను కూడా ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement