navodaya school
-
ఆటోమోటివ్ రంగంలో 4,000 మందికి శిక్షణ!
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ టాటా మోటార్స్, నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్)లోని 4,000 మంది విద్యార్థులకు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు అందిస్తున్నట్లు పేర్కొంది. ‘జాతీయ విద్యా విధానం 2020’కి అనుగుణంగా మెరుగైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరునలను తయారు చేయడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌వీఎస్‌ల్లో 25 ‘ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్స్’ ప్రారంభించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పింది.టాటా మోటార్స్ సీఎస్ఆర్ హెడ్ వినోద్ కులకర్ణి మాట్లాడుతూ..‘విద్యార్థులకు ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో 25 ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో వీటిని సిద్ధం చేసి శిక్షణ ఇస్తున్నాం. స్కిల్ ల్యాబ్‌ల్లో ఏటా 4,000 మందికి ఆటోమోటివ్ రంగంలో నైపుణ్యాలు అందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్‌లో దాదాపు 30% మంది బాలికలు ఉండడం విశేషం. ప్రాక్టికల్ ఆటోమోటివ్ స్కిల్స్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలకు కోసం తగిన విధంగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు’ అని తెలిపారు.‘ఆటోమోటివ్ స్కిల్ ల్యాబ్‌లో నైపుణ్యాల పెంపునకు అవసరమైన అన్ని సాధనాలు ఏర్పాటు చేశాం. సెకండరీ, సీనియర్ సెకండరీ విద్యార్థులకు (9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) లోతైన విషయ పరిజ్ఞానానికి ఇవి ఎంతో ఉపయోగపడుతాయి. క్లాస్‌రూం ట్రెయినింగ్తో పాటు టాటా మోటార్స్ ప్లాంట్లను సందర్శించడం, సర్వీస్, డీలర్షిప్ నిపుణులతో చర్చించడం, వారి ఉపన్యాసాలు వినడం వల్ల మరింత ఎక్కువ సమాచారం తెలుసుకునే వీలుంటుంది. ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్న విద్యార్థులకు టాటా మోటార్స్, ఎన్వీఎస్ నుంచి జాయింట్ సర్టిఫికేట్లను అందిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్‌లో ప్రతిభ చూపిన వారికి టాటా మోటార్స్ పూర్తి స్టైపెండ్ అందించి ఉద్యోగ శిక్షణతో కూడిన డిప్లొమా ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీని అభ్యసించే అవకాశం కల్పిస్తోంది. డిప్లొమా పూర్తయిన తర్వాత టాటా మోటార్స్‌లో విద్యను కొనసాగించాలనుకునేవారు ఇంజినీరింగ్ సంస్థలతో కలిసి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ద్వారా బీటెక్ పట్టా పొందే వీలుంది. అనంతరం ప్రతిభ ఆధారంగా సంస్థలో ఉద్యోగం కూడా పొందవచ్చు’ అని వివరించారు.ఇదీ చదవండి: అంబానీ ఆస్తులు కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెలుసా..?2023లో ఆటోమోటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఏఎస్‌డీసీ) నిర్వహించిన ‘నేషనల్ ఆటోమొబైల్ ఒలింపియాడ్’లో ఈ ప్రోగ్రామ్ నుంచి 1,600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 17 మంది పోటీలో రెండో దశ వరకు చేరుకున్నారు. పుణెలోని స్కిల్ ల్యాబ్‌లో విద్యార్థులు ప్రయోగాత్మక శిక్షణలో భాగంగా ఇ-రిక్షాను కూడా ఆవిష్కరించారు. -
నవోదయ స్కూళ్లలో 5వేల సీట్ల పెంపు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీట్లను కేంద్రం మరో 5 వేలు పెంచింది. తాజా పెంపుతో నవోదయ విద్యాలయాల్లో అందుబాటులో ఉండే సీట్ల సంఖ్య 46,600 నుంచి 51వేలకు పెరిగింది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. నవోదయ పాఠశాలల్లో ప్రతిభావంతులైన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం గురుకుల తరహా ఉచిత విద్యనందిస్తోంది. దేశంలో ఆరో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహించే విద్యా సంస్థలు నవోదయ విద్యాలయాలే. 2001లో దేశ వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాజరుకాగా 2019లో ప్రవేశ పరీక్షకు నమోదు చేయించుకున్న విద్యార్థుల సంఖ్య 31 లక్షలకు చేరుకుంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లోనూ నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవడేకర్ తెలిపారు. -
స్కూల్లో ఘోరం : బాలికకు 168 చెంపదెబ్బలు
ఝబువా, మధ్యప్రదేశ్ : హోం వర్క్ చేయలేదని పన్నెండేళ్ల బాలికను 168 చెంపదెబ్బలు కొట్టించాడో కసాయి టీచర్. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లా తాండ్లా పట్టణంలోని నవోదయ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ నెల 11 తేదీ నుంచి 16వ తేదీ వరకూ రోజూ 14 మంది తోటి బాలికలతో తన కూతురిని సైన్స్ టీచర్ చెంపదెబ్బలు కొట్టించారంటూ ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెంపదెబ్బలతో తీవ్రంగా భయపడిన బాలిక అనారోగ్యం పాలైందని ఆమె తండ్రి శివ ప్రతాప్ సింగ్ తెలిపారు. నవోదయలో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్న మనోజ్ కుమార్ వర్మ హోం వర్క్ ఇవ్వగా అనారోగ్యం కారణంగా బాలిక చేయలేదని ప్రతాప్ సింగ్ వెల్లడించారు. అయితే, హోం వర్క్ చేయనందుకు శిక్షగా మనోజ్ ఆరు రోజుల పాటు 168 చెంపదెబ్బలు కొట్టించారని చెప్పారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన నవోదయ ప్రిన్సిపాల్ సాగర్... అది కేవలం ఫ్రెండ్లీ పనిష్మెంట్ మాత్రమే అని అన్నారు. బాలికను గాయపర్చాలనే ఉద్దేశంతో టీచర్ అలా చేయలేదని సర్ది చెప్పేందుకు యత్నించారు. బాలిక తల్లిదండ్రులతో ఈ విషయంపై చర్చించి సమస్యను పరిష్కరించుకుంటామని వివరించారు. -
‘నవోదయ’లో చదవడం అదృష్టం
లేపాక్షి : లేపాక్షి నవోదయ విద్యాలయంలో చదివి ఉన్నత స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు, సివిల్స్‌కు ఎంపికైన ఉద్యోగులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం లేపాక్షి నవోదయ విద్యాలయంలో అల్యూమినీ అసోసియేషిన్ అధ్యక్షుడు, పూర్వ విద్యార్థులు డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ స్థాయికి ఎదిగామన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా అలనాటి తీపిగుర్తులతో అనందంతో గడిపారు. ఈ సందర్భంగా బెంగుళూర్లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న లాబూరాం, సోలాపూర్‌లో ఐఆర్పీఎస్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చంద్రమోహీయార్, అలహాబాద్‌లో కంట్రోల్‌మెంట్ బోర్డు నిర్వహణ అధికారిగా దినేష్ కుమార్ రెడ్డి, ఇటీవల సివిల్స్‌కు ఎంపికైన జగదీశ్వర్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. -
నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
లేపాక్షి : లేపాక్షి జవహార్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలైనట్లు ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అర్బన్ ఓపెన్ కేటగిరీ కింద 13 మంది, ఎస్సీ కేటగిరీలో మూడు, పీహెచ్‌సీకి 3, ఎస్టీకి ఒకటి మొత్తం 20 మంది, రూరల్ ఓపెన్ కేటగిరీ కింద 46 మందికి, ఎస్సీ 9 మంది, ఎస్టీ ఐదుగురు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. -
నవోదయ ఫలితాల విడుదల
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 10వ తరగతి సీబీఎస్సీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యాలయంలో 81 మంది పరీక్షలు రాయగా.. 81 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయినట్లు ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ తెలిపారు. వందశాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. అందులో 75 శాతానికి పైగా 79 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా అందులో టాప్–10లో 14 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. -
తొమ్మిదిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వనం
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 2017–2018 విద్యా సంవత్సరానికి 9 వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు 29వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని ఆ విద్యాలయ ప్రిన్సిపాల్ చంద్రశేఖరన్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8 వ తగరతి పూర్తి చేసుకున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జూన్ 24 వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. -
నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 9వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్బన్ పరిధిలో ఒక బాలుడికి, ఇద్దరు బాలికల చొప్పున ఖాళీలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థినీ విద్యార్థులు ఈనెల 15 నుంచి 29వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష జూన్ 24న లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో జరుగుతుందన్నారు. -
ఆదర్శ విద్యార్థులుగా ఎదగాలి
లేపాక్షి : జవహర్ నవోదయ విద్యార్థులు ఆదర్శవంతులుగా ఎదగాలని నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ ఏవై రెడ్డి సూచించారు. శనివారం ఉదయం నిర్వహించిన నవోదయ విద్యాలయం వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, విద్యాలయానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. లేపాక్షి నవోదయ విద్యార్థులు దేశ, రాష్ట్రస్థాయిలో విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించడం హర్షనీయమన్నారు. అనంతరం నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. విద్యాలయంలోని ఎంపీ హాల్, డైనింగ్ హాల్లో చల్లదనం కోసం పాల్ షీట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. బిట్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ చంద్రమోహన్ వివేకానందుడి జీవిత చరిత్రపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన 25 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ మాట్లాడుతూ 2016–17 విద్యా సంవత్సరానికి అన్ని రంగాల్లోనూ శివాలిక్ హౌస్ విద్యార్థులు మొదటి స్థానంలో రాణించారన్నారు. వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థినీవిద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అ‘పూర్వ’సమ్మేళనం
- నవోదయ పూర్వ విద్యార్థుల కలయిక - గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వైనం లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆదివారం ఉదయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా డిసెంబరు 4న అన్ని నవోదయ విద్యాలయాల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. అందులో భాగంగా లేపాక్షి నవోదయ విద్యాలయంలో విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దేశ, విదేశాల్లో వివిధ ఉద్యోగాల్లో పని చేస్తున్న పూర్వ విద్యార్థులు హాజరై వారి నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. సుమారు 28 ఏళ్ల నాటి స్నేహితులు కలిసి వారు విద్యార్థి దశలో చేసిన చేష్టలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ లేపాక్షి జవహర నవోదయ విద్యాలయం అభివృద్ధికి తమ వంతు సాయం అందజేస్తామన్నారు. అనంతరం ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ మాట్లాడుతూ లేపాక్షి విద్యాలయంలో చదవుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. ఎలా బతకవచ్చో నేర్చుకున్నాం – వనజ, శాస్త్రవేత్త, లండన్ ఈ విద్యాలయంలో చదువుతో పాటు ఎలా బతకాలో నేర్చుకున్నాను. ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా బతకవచ్చనే విషయాన్ని గ్రహించాను. 1989 నుంచి 1996 వరకు ఈ విద్యాలయంలో చదివాను. ప్రస్తుతం లండన్‌లో రీసెర్చిగా పని చేస్తున్నా. క్రమశిక్షణకు నిలయం – బాలాజీ, ఎస్డీఈ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి ఈ విద్యాలయం క్రమశిక్షణకు నిలయం. ఏ సమయానికి ఏం చేయాలనే విషయాలు నేర్చుకున్నాం. విద్యాలయంలో 1990 నుంచి 97 వరకు చదువుకున్నాను. అయితే చిన్న వయస్సులోనే క్రమశిక్షణ నేర్చుకోవడంతో ఉన్నత స్థానంలో స్థిరపడ్డాను. ఉన్నత విలువలు నేర్చుకున్నా – కేకే రెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, హైదరాబాద్ నవోదయ విద్యాలయంలో చదువుకుని ఉన్నత విలువలు నేర్చుకున్నాను. ఫలితంగా క్రీడల్లో బాగా రాణించాను. 1991 నుంచి 98 వరకు ఈ విద్యాలయంలో చదివాను. -
‘నవోదయ’ విద్యార్థులు దేశానికే ఆదర్శం కావాలి
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ పాఠశాల విద్యార్థులు దేశానికే ఆదర్శం కావాలని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆకాంక్షించారు. ఆ పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన డార్మెటరీని బుధవారం రాత్రి ఆయన ప్రారంభించారు. నవోదయ పాఠశాల కీర్తిని చాటేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన ఈ పాఠశాలను తమ తండ్రి ఎన్టీఆర్ తన హయాంలో లేపాక్షిలో సుమారు 20 ఎకరాల్లో ఏర్పాటు చేయించారని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో లేపాక్షి విద్యాలయం అన్ని రంగాల్లో జాతీయ అవార్డులు సాధించడంపై ప్రిన్సిపల్, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్, వైస్ ప్రిన్సిపఽల్ మల్లికార్జున, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, మార్కెట్‌యార్డు చైర్మన్ కిష్టప్ప, ఎంపీపీ హనోక్, జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంఈఓ నాగరాజు, సర్పంచ్ జయప్ప, ఎంపీటీసీ సభ్యుడు చిన్నఓబన్న పాల్గొన్నారు. -
నేటి నుంచి నవోదయలో రాష్ట్రస్థాయి పోటీలు
మామునూరు : హన్మకొండ మండలం మామునూరు నవోదయ విద్యాలయంలో గురు, శుక్రవారాల్లో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ పడాల సత్యనారాయణ æబుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థులకు ఫుట్‌బాల్, వాలీబాల్, బాస్కెట్‌బా ల్, హ్యాండ్‌బాల్, హాకీ, షటిల్, బాడ్మింటన్ పోటీలుంటాయని చెప్పారు. అం డర్ 14, 17, 19 వి భాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
నవోదయలో 19 మంది ఎంపిక
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు రెండోవిడతలో 19 మంది విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ శనివారం తెలిపారు. 6వ తరగతిలో 80 సీట్లకు తొలివిడతలో 61 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. మిగిలిన 19 సీట్లను రెండో విడతలో పూర్తి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం ప్రవేశాలు కల్పిస్తామన్నారు. ఎంపికైన విద్యార్థుల నంబర్లు 0027 00176 00380 02413 03005 03137 03224 03395 04310 04751 05325 05382 06150 06310 06402 06406 06921 07410 07497 -
‘గుడ్డి’ నిర్ణయం.. బతుకు అంధకారం !
- స్కూల్ హాల్ టికెట్లో ఓ విద్యార్థి అంధుడిగా నమోదు - నవోదయలో సీటు కోల్పోయిన వైనం.. షాద్‌నగర్ రూరల్: పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యానికి ఓ విద్యార్థి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢంగా ఉండి చదువులో చురుకుగా ఉండే బాలుడిని ఆ పాఠశాల యాజమాన్యం అంధుడి కింద రికార్డులో చూపింది. దీంతో నవోదయలో చేరాల్సిన విద్యార్థి తిరిగి ఇంటి దారి పట్టాడు. తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని అతని తండ్రి అధికారులు, పోలీసులతో మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం తొండపల్లికి చెందిన లక్ష్మికాంత్‌రెడ్డి, రజిత దంపతులు పదేళ్లుగా మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు అభిషేక్‌రెడ్డి నర్సరీ నుంచి పట్టణంలోని మాంటెస్సోరి పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. పాఠశాలలో ఐదవ తరగతి పూర్తి చేసుకున్న అభిషేక్‌రెడ్డి.. 2016-2017 సంవత్సరానికిగాను నవోదయ ప్రవేశ పరీక్షను రాసి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఈ నెల 23న తన తండ్రితో కలసి జిల్లాలోని వట్టెం నవోదయ పాఠశాలకు వెళ్లాడు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. అభిషేక్‌రెడ్డిని చూసిన నవోదయ సిబ్బంది.. బాబు గుడ్డివాడని, హాల్ టికెట్లో అలా నే ఉందని, విద్యార్థిని చూస్తే అంధుడిగా కనిపించడం లేదని తండ్రిని ప్రశ్నించగా అతను ఒక్కసారిగా అవాక్కయ్యారు. బాలుడికి అంధుల కోటాలో పాఠశాలలో సీటు వచ్చిందని, కళ్లు కనిపిస్తుండడంతో ఆ కోటాలో సీటు ఇవ్వలేమని ఇంటికి పంపించారు. ఉన్న చూపును పోగొట్ట లేక, నవోదయ పాఠశాలలో సీటు రాక తండ్రీకొడుకులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అభిషేక్‌రెడ్డి విషయంలో అతను చదువుతున్న మాంటెస్సోరి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కలెక్టర్‌ను కలసిన బాధితుడు: పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే తమ కుమారుడికి నవోదయ పాఠశాలలో సీటు రాలేదని అభిషేక్ రెడ్డి తన తండ్రితో కలసి మంగళవారం కలెక్టర్ టీకే శ్రీదేవిని కలిశారు. కష్టపడి చదివినా యాజమాన్యం తప్పిదంతో చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని మొర పెట్టుకున్నారు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ మేరకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. -
ఆటోలోంచి జారిపడి విద్యార్థిని మృతి
అదిలాబాద్: పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న విద్యార్థిని ఆటోలోంచి జారిపడి మృతిచెందింది. అదిలాబాద్ జిల్లా కేరామేరి మండలంలోని నవోదయ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న హర్షిత ప్రతిరోజు ఆటోలో పాఠశాలకు వెళ్లివస్తోంది. రోజు మాదిరిగానే శుక్రవారం పాఠశాలకు వచ్చి వెళ్తున్న బాలిక ప్రమాదవశాత్తు ఆటోలోంచి జారిపడి మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థిని బంధువులు పాఠశాలలోని సామగ్రికి నిప్పంటించారు. పిల్లలను తీసుకువె ళ్లడానికి స్కూల్‌బస్సు ఏర్పాటు చేస్తామని తమ వద్ద నుంచి డబ్బులు తీసుకున్న పాఠశాల యజమాన్యం ఇప్పుడు పిల్లలను ఆటోలో తీసుకెళ్లడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆటోలో 25 మంది విద్యార్థులు ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యేక్షసాక్షులు చెప్తున్నారు. (కేరామేరి)