ఆదర్శ విద్యార్థులుగా ఎదగాలి
లేపాక్షి : జవహర్ నవోదయ విద్యార్థులు ఆదర్శవంతులుగా ఎదగాలని నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ ఏవై రెడ్డి సూచించారు. శనివారం ఉదయం నిర్వహించిన నవోదయ విద్యాలయం వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, విద్యాలయానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. లేపాక్షి నవోదయ విద్యార్థులు దేశ, రాష్ట్రస్థాయిలో విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించడం హర్షనీయమన్నారు. అనంతరం నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. విద్యాలయంలోని ఎంపీ హాల్, డైనింగ్ హాల్‌లో చల్లదనం కోసం పాల్ షీట్లు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
బిట్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ చంద్రమోహన్ వివేకానందుడి జీవిత చరిత్రపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన 25 మంది విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ మాట్లాడుతూ 2016–17 విద్యా సంవత్సరానికి అన్ని రంగాల్లోనూ శివాలిక్ హౌస్ విద్యార్థులు మొదటి స్థానంలో రాణించారన్నారు. వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థినీవిద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.