అ‘పూర్వ’సమ్మేళనం
- నవోదయ పూర్వ విద్యార్థుల కలయిక
- గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వైనం
లేపాక్షి : లేపాక్షి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆదివారం ఉదయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా డిసెంబరు 4న అన్ని నవోదయ విద్యాలయాల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. అందులో భాగంగా లేపాక్షి నవోదయ విద్యాలయంలో విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దేశ, విదేశాల్లో వివిధ ఉద్యోగాల్లో పని చేస్తున్న పూర్వ విద్యార్థులు హాజరై వారి నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు.
సుమారు 28 ఏళ్ల నాటి స్నేహితులు కలిసి వారు విద్యార్థి దశలో చేసిన చేష్టలు గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ లేపాక్షి జవహర నవోదయ విద్యాలయం అభివృద్ధికి తమ వంతు సాయం అందజేస్తామన్నారు. అనంతరం ప్రిన్సిపల్ భాస్కర్‌కుమార్ మాట్లాడుతూ లేపాక్షి విద్యాలయంలో చదవుకుని ఉన్నత స్థాయికి చేరుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు.
ఎలా బతకవచ్చో నేర్చుకున్నాం – వనజ, శాస్త్రవేత్త, లండన్
ఈ విద్యాలయంలో చదువుతో పాటు ఎలా బతకాలో నేర్చుకున్నాను. ఎలాంటి దుర్భర పరిస్థితులు ఎదురైనా బతకవచ్చనే విషయాన్ని గ్రహించాను. 1989 నుంచి 1996 వరకు ఈ విద్యాలయంలో చదివాను. ప్రస్తుతం లండన్‌లో రీసెర్చిగా పని చేస్తున్నా.
క్రమశిక్షణకు నిలయం – బాలాజీ, ఎస్‌డీఈ, బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి
ఈ విద్యాలయం క్రమశిక్షణకు నిలయం. ఏ సమయానికి ఏం చేయాలనే విషయాలు నేర్చుకున్నాం. విద్యాలయంలో 1990 నుంచి 97 వరకు చదువుకున్నాను. అయితే చిన్న వయస్సులోనే క్రమశిక్షణ నేర్చుకోవడంతో ఉన్నత స్థానంలో స్థిరపడ్డాను.
ఉన్నత విలువలు నేర్చుకున్నా – కేకే రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హైదరాబాద్
నవోదయ విద్యాలయంలో చదువుకుని ఉన్నత విలువలు నేర్చుకున్నాను. ఫలితంగా క్రీడల్లో బాగా రాణించాను. 1991 నుంచి 98 వరకు ఈ విద్యాలయంలో చదివాను.