
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ సణంద్‌లోని ఫోర్డ్ ఇండియా తయారీ ప్లాంటును 2023 జనవరి 10కల్లా పూర్తిగా చేజిక్కించుకోనున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లోనే టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ద్వారా ఫోర్డ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్‌కు చెందిన గుజరాత్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు దాదాపు రూ. 726 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది.
ఈ కొనుగోలులో భాగంగా మొత్తం భవంతులు, మెషీనరీ, భూమితోపాటు, వాహన తయారీ ప్లాంటును సొంతం చేసుకోనుంది. అర్హతగల ఉద్యోగులు సైతం బదిలీకానున్నారు. ప్రభుత్వం, సంబంధిత ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందిన నేపథ్యంలో 2023 జనవరి 10కల్లా లావాదేవీని పూర్తి చేయాలని ఇరు సంస్థలూ నిర్ణయించుకున్నట్లు టాటా మోటార్స్ ఒక ప్రకటనలో వివరించింది.
లక్ష్యంలో 59 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ ముగిసే నాటికి లక్ష్యంలో 59 శాతానికి చేరుకుంది. ఆర్థిక సంవత్సరం (2022 ఏప్రిల్–2023 మార్చి) ముగిసే నాటికి రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు ఉండాలన్నది వార్షిక బడ్జెట్ లక్ష్యం. స్థూల దేశీయోత్పత్తి అంచనాల్లో ఇది 6.4 శాతం. అయితే నవంబర్ ముగిసే నాటికి ఇది 9.78 లక్షల కోట్లకు చేరింది. అంటే వార్షిక బడ్జెట్ లక్ష్యంలో 59 శాతానికి చేరిందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment