
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 321 పాయింట్లు ఎగసి 39,295కు చేరగా.. నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 11,587 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించనున్న అంచనాలు అటు ఫైనాన్షియల్ సర్వీసుల దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ, ఇటు ఆటో రంగ బ్లూచిప్ కంపెనీ టాటా మోటార్స్ కౌంటర్లకు జోష్‌నిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు షేర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
టాటా మోటార్స్
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో బ్రిటిష్ అనుబంధ విభాగం జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) ఆశావహ పనితీరు చూపినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. జేఎల్‌ఆర్ రిటైల్ అమ్మకాలు 53 శాతం ఎగసి 1,13,569 యూనిట్లను తాకినట్లు తెలియజేసింది. అంతకుముందు క్వార్టర్‌లో 74,067 యూనిట్లు మాత్రమే విక్రయించినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా మాత్రమే రిటైల్ స్టోర్లు తెరచినట్లు తెలియజేసింది. పలు ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 144 వద్ద ట్రేడవుతోంది.
హెచ్‌డీఎఫ్‌సీ
ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో వ్యక్తిగత బిజినెస్‌లో పటిష్ట రికవరీని సాధించినట్లు మార్టిగేజ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా పేర్కొంది. వ్యక్తిగత రుణాల జారీ 95 శాతం రికవరీని సాధించినట్లు తెలియజేసింది. ఈ కాలంలో రుణ దరఖాస్తులు 21 శాతం వృద్ధి చెందినట్లు వెల్లడించింది. వీటిలో వ్యక్తిగత రుణ దరఖాస్తులు 31 శాతం పెరిగినట్లు వివరించింది. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 1904 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment