సాక్షి ముంబై: దేశీయ నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ నానో కారును మళ్లీ తీసుకొస్తోందా? ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా కలల కారు, ప్రపంచంలోనే అత్యంత చౌక కారు నానో ఈవీని టాటా గ్రూప్ లాంచ్ చేయనుందని అంచనాలు మార్కెట్లో షికారు చేస్తున్నాయి.
టాటా మోటార్స్ నానో ప్రాజెక్ట్‌ను తిరిగి పునరుజ్జీవింపజేస్తోందని తాజా మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. నానో ఈవీని తీరిగి తీసుకురావాలనే ప్రణాళికలు ఫలవంతమైతే, ఫోర్డ్ మరైమలైనగర్ ప్లాంట్ కొనుగోలుకు సంబంధించి టాటా తమిళనాడు ప్రభుత్వంతో చర్చలను పునః ప్రారంభించవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే అమ్మకాలు లేక 2019 నుంచి నానో కారు తయారీని నిలిపి వేసింది. దేశంలో అందరికీ కారు అనే నినాదంతో 2008లో కేవలం లక్ష రూపాయలకే అందుబాటులోకితీసుకొచ్చిన నానోను ఎలక్ట్రిక్ మోడల్ లాంచింగ్‌కు ప్లాన్ చేస్తోందట టాటా. అయితే ఈవార్తలపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.
కాగా టాటా మోటార్స్ 80శాతానికి పైగా మార్కెట్ వాటాతో ఈ సెగ్మెంట్‌లో మార్కెట్ లీడర్‌గా ఉంది. ప్రస్తుతం టాటా నెక్సాన్, టిగోర్, టియాగో లాంటి ఈవీలను అందిస్తోంది. ఈవీ సెగ్మెంట్‌లో ఆధిక్యాన్ని కొనసాగించడానికి, సమీప భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో పది ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయాలని ప్లాన్. ఇప్పటికే కర్వ్, అవిన్యా లాంటి కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment