దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS)కి మహారాష్ట్ర కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. 200 లేటరల్ రిక్రూట్‌ల ఆన్‌బోర్డింగ్ ఆలస్యం ఫిర్యాదుపై మహారాష్ట్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ టీసీఎస్ కంపెనీకి నోటీసు జారీ చేసినట్లు ‘మనీకంట్రోల్’ నివేదిక తెలిపింది. నవంబర్ 2న పుణె కార్మిక శాఖ కార్యాలయంలో డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశమై చర్చించాలని కార్మిక శాఖ టీసీఎస్ అధికారులకు నోటీసు జారీ చేసింది.
టీసీఎస్ చేపట్టిన 200 మందికి పైగా లేటరల్ రిక్రూట్‌లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో జాప్యం జరిగిందంటూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) గత జులైలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. తర్వాత కేంద్ర కార్మిక శాఖ దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది.
వివిధ అనుభవ స్థాయిలు కలిగిన నిపుణులు ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్నారని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని టీసీఎస్‌కు నిర్దిష్ట ఆదేశాలు జారీ చేయాలని కార్మిక శాఖను కోరింది. 1.8 సంవత్సరాల నుంచి 15 ఏళ్ల వరకు వివిధ స్థాయిల అనుభవమున్న ఉద్యోగులు ఇప్పుడు ఉద్యోగాలు లేకుండా, ఆదాయ వనరులు లేకుండా మిగిలిపోయారని వాపోయింది.
ప్రస్తుతం ఉన్న టాలెంట్ పూల్‌ను వినియోగాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో నియామకాలపై నెమ్మదిగా వెళ్తున్నట్లు టీసీఎస్ ఇటీవల తెలిపింది. ఈ లేటరల్ రిక్రూట్‌లను ఈ సంవత్సరం జనవరి, ఏప్రిల్ మధ్య టీసీఎస్ నియమించుకుంది. జులై 10న చాలా మందికి జాయినింగ్ తేదీలు ఇవ్వగా తాజాగా వాటిని అక్టోబర్‌కు వాయిదా వేస్తున్నట్లు అభ్యర్థులకు ఈమెయిల్స్ వచ్చాయి.
లేటరల్ రిక్రూట్‌మెంట్ అంటే..
ఇప్పటికే మరో కంపెనీలో ఇదే హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియనే లాటరల్ రిక్రూట్‌మెంట్ అంటారు. నిర్దిష్ట నైపుణ్యం లేదా అనుభవం అవసరమయ్యే స్థానాలను భర్తీ చేయడం కష్టసాధ్యం అయినప్పుడు ఈ నియామక ప్రక్రియను అనుసరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment