టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) మిలింద్ లక్కడ్ తెలిపారు. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య 5,000 మంది తగ్గినట్లు టీసీఎస్ తెలిపింది.
2024-25 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఫ్రెషర్లకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని ఓ ఇంటర్వ్యూలో మిలింద్ లక్కడ్ పేర్కొన్నారు. టీసీఎస్ సంస్థలో ఉద్యోగం పొందాలంటే.. కేవలం కోడింగ్ నైపుణ్యాలు ఉంటే సరిపోదు. వారికి తగిన విద్యార్హత కూడా ఉండాలని ఆయన వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోవని స్పష్టం చేశారు.
ఏఐ వల్ల ఉద్యోగుల సామర్థ్యం మెరుగుపడుతుంది. మనిషి ఆలోచనా శక్తికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే క్లయింట్లను నేరుగా సంప్రదించాల్సిన విభాగాలలో.. ఇతర అవసరమైన విభాగాల్లో మానవ వనరుల ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని మిలింద్ లక్కడ్ అన్నారు.
2024-25 ఆర్ధిక సంవత్సరంలో ఉద్యోగుల సంఖ్య తగ్గితే.. కంపెనీ వృద్ధి తగ్గినట్లు కాదు. ఉద్యోగుల నియామక ప్రక్రియ అనేది వార్షిక ప్రణాళికలను అనుసరించి జరుగుతాయి. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపల ఉద్యోగుల భర్తీకి సంబంధించిన బ్యాలెన్స్ జరుగుతుంది. కాబట్టి 2025లో కంపెనీ వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందని లక్కడ్ చెప్పారు.
ఇదీ చదవండి: రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్
టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు E0 నుంచి E3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.
➤E0 (ఎంట్రీ లెవెల్): లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎమ్‌లు), వాటితో ముడిపడిన అప్లికేషన్‌లపై ప్రాథమిక అవగాహన ఉండే వారు ఈ విభాగంలోకి వస్తారు.
➤E1: ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా, ఎల్ఎల్ఎమ్ ఏపీఐలతో పని చేయగల సామర్థ్యం ఉన్న వారు ఈ విభాగంలోకి వస్తారు.
➤E2: TCS GenAI సాధనాలను ఉపయోగించడంలో నైపుణ్యం కలిగిన వారు ఈ విభాగంలో ఉంటారు.
➤E3, దానికంటే పైన: ఏఐలో నైపుణ్యం, అవగాహన కలిగిన వారు, దాని అప్లికేషన్లలను అన్ని విభాగాల్లో ఉపయోగించేవారు ఈ విభాగంలోకి వస్తారు.
టీసీఎస్ లాభం రూ.12,380 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టాటా కన్సల్టెన్సీ సర్విసెస్ నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది.
Comments
Please login to add a commentAdd a comment