సాక్షి, న్యూఢిల్లీ : దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) శుక్రవారం అసెంచర్‌ను అధిగమించి కొద్దిసేపు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఆ సమయంలో (అక్టోబర్ 8, క్లోజింగ్ గణాంకాల ప్రకారం) టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 144.7 బిలియన్ డాలర్లు కాగా, యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 143.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. చదవండి : టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు
ఇక టీసీఎస్ సోమవారం మరో కీలక మైలురాయిని చేరుకుంది. రిలయన్స్ ఇండస్ర్టీస్ తర్వాత రూ 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన రెండో భారతీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. కంపెనీ షేర్ ధర పెరగడంతో టీసీఎస్ మార్కెట్ విలువ ఏకంగా రూ 69,082.25 కోట్లు ఎగిసి ట్రేడ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 10,15,714 కోట్లకు ఎగబాకింది. కాగా దేశంలో రూ 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ర్టీస్ నిలిచిన సంగతి తెలిసిందే. టీసీఎస్ బుధవారం రూ 16,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రణాళికను ప్రకటించింది.
మరోవైపు పలు కంపెనీలు లేఆఫ్‌లు, వేతన కోతలు విధించడంతో పాటు ఏడాది పాటు ప్రమోషన్లు, వేతన పెంపులను నిలిపివేసిన నేపథ్యంలో టీసీఎస్ తమ ఉద్యోగులందరికీ వేతనాలను పెంచనుంది. టీసీఎస్ వేతన పెంపు నిర్ణయం ఐటీ రంగానికి తీపికబురుగా మారింది. ఇక దేశీ ఐటీ దిగ్గజంలో నియామకాల ప్రక్రియా ఊపందుకుంది. భారత్‌లో 7,000 మంది ట్రైనీలను, అమెరికాలో 1000 మందిని ట్రైనీలను నియమించుకోనుంది.
Comments
Please login to add a commentAdd a comment