టెక్ కంపెనీ ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయని తెలుసుకదా. తాజాగా ప్రముఖ సాఫ్ట్‌వేర్ సేవలందించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఈ ఏడాది ‘ప్రైమ్ రిక్రూట్‌మెంట్’ విధానాన్ని అనుసరించబోతున్నట్లు ప్రకటించింది. ఈ కేటగిరీలో నియమించుకుంటున్న అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య వేతనం ఉంటుందని పేర్కొంది.
టీసీఎస్ టాలెంట్ అక్విజిషన్ విభాగం గ్లోబల్ హెడ్ గిరీష్ నందిమఠ్ మాట్లాడుతూ..‘ఈ ఏడాది సంస్థ రిక్రూట్‌మెంట్ విధానంలో కొత్త పద్ధతిని తీసుకురాబోతున్నాం. ‘ప్రైమ్’ కేటగిరీలో నియామకం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.9 లక్షల నుంచి రూ.11 లక్షలు వేతనం అందిస్తాం. కంపెనీ అవసరాలకు తగిన ప్రతిభ ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశాలున్నాయి. కొంతమంది అభ్యర్థులు ‘డ్రీమ్ కేటగిరీ’(ఇష్టమైన జాజ్) ఉద్యోగాలు వస్తే టీసీఎస్ నుంచి సదరు కొలువును ఎంచుకుంటున్నారు. దాంతో కంపెనీకి టాలెంట్ ఉన్న ఇంజినీర్ల కొరత ఎదురవుతుంది. దాన్ని తగ్గించేందుకే ఈ ‘ప్రైమ్’ కేటగిరీను ప్రవేశపెట్టాం. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఈ కేటగిరీ కింద ఉద్యోగం పొందిన విద్యార్థులు మరొక కంపెనీ నియామక ప్రక్రియకు వెళ్లకుండా కళాశాలలు నిర్ధారిస్తాయి. ప్రోగ్రామింగ్, కోడింగ్ సామర్థ్యంపై అధిక నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కొత్త సాంకేతికతలపై యువత నైపుణ్యం పెంచుకోవాలి. టీసీఎస్‌లో ఐటీ సేవల రంగాన్ని మార్చే వేగవంతమైన సాంకేతిక పురోగతి ఉంది. వ్యూహాత్మక వృద్ధి వ్యాపారాలు, పరిశోధనా విభాగాలున్నాయి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ సమన్లు
జూన్ 30, 2024 నాటికి టీసీఎస్‌లో మొత్తం 6,06,998 మంది ఉద్యోగులున్నారు. 2024-25లో టీసీఎస్ క్యాంపస్‌ల నుంచి 40,000 మంది ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లను నియమించుకోవాలని యోచిస్తున్నారు. డిజిటల్ కేటగిరీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఏటా రూ.3.6 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వేతనం ఆఫర్ చేస్తున్నారు. డిజిటల్, ప్రైమ్ కేటగిరీలో రిక్రూట్ అయిన వారికి శిక్షణ తక్కువగా అవసరం అవుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment