![Tel Aviv is Most Expensive City in The World - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/1/Tel-Aviv-City.jpeg.webp?itok=k0eH-eFK)
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏమిటి అనగానే చాలా మంది ప్యారిస్ లేదా సింగపూర్ అని చెబుతారు. కానీ, అవి ఏవి కావు. ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ నగరం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయు) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ఇజ్రాయిల్ నగరం టెల్ అవీవ్ తొలిసారిగా అగ్రస్థానంలో నిలవడం విశేషం.
ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల్లో నిత్యావసర సరుకుల ధరలు, అద్దె, రవాణా వంటి ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకొని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ "వరల్డ్ వైడ్ సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్" పేరుతో ఒక జాబితాను రూపొందించింది. రవాణా, కిరాణా సరుకుల ధరలు పెరగడం వల్ల ఈ జాబితాలో టెల్ అవీవ్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, ఈ జాబితాలో పారిస్, సింగపూర్ నగరాలు ఉమ్మడిగా రెండవ స్థానంలో ఉన్నాయి.
(చదవండి: దూసుకెళ్తున్న జీఎస్‌టీ వసూళ్లు!)
తర్వాత స్థానాల్లో జ్యూరిచ్, హాంగ్ కాంగ్ ఉన్నాయి. న్యూయార్క్ 6వ స్థానంలో, జెనీవా 7వ స్థానంలో, కోపెన్ హాగన్ 8వ స్థానంలో, లాస్ ఏంజిల్స్ 9వ స్థానంలో, ఒసాకా 10వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది సర్వే జరిపిన ఈ జాబితాలో పారిస్, జ్యూరిచ్, హాంగ్ కాంగ్లు ఉమ్మడిగా ప్రథమ స్థానంలో ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలలో నమోదైన ద్రవ్యోల్బణ రేటు, కరోనావైరస్ మహమ్మారి వల్ల కొన్ని దేశాలలో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆయా దేశాలలో జీవన వ్యయం కూడా అదే స్థాయిలో పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment