న్యూఢిల్లీ:ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతంగా నిల్చే లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరులో గుజరాత్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన 2021 సూచీలో వరుసగా మూడోసారి టాప్‌లో నిల్చింది. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఈ జాబితాలో 21 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో గుజరాత్ తర్వాత స్థానాల్లో హర్యానా (2), పంజాబ్ (3), తమిళనాడు (4), మహారాష్ట్ర (5) నిల్చాయి. టాప్ 10లో ఉత్తర్ ప్రదేశ్ (6), ఒరిస్సా (7), కర్ణాటక (8), ఆంధ్రప్రదేశ్ (9), తెలంగాణ (10) రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ వ్యవస్థ, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు సూచనలు మొదలైన వాటితో 2021 నివేదిక రూపొందింది. దీన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ ఆవిష్కరించారు.
సూచీకి సంబంధించి మొత్తం 21 అంశాల్లో వివిధ రాష్ట్రాల పనితీరును కేంద్రం మదింపు చేసింది. ఈ ఏడాది మే–ఆగస్టు మధ్య కాలంలో ఇందుకోసం సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1,405 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంది. వచ్చే అయిదేళ్లలో లాజిస్టిక్స్ వ్యయాలను అయిదు శాతం మేర తగ్గించుకునేందుకు ఆయా వర్గాల అభిప్రాయాలు దోహదపడగలవి గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 13–14 శాతం స్థాయిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment