న్యూఢిల్లీ: నిముషంలోపు వీడియోలతో ప్రపంచ ప్రసిద్ధమైన టిక్‌టాక్ ప్రస్తుతం 3 నిముషాల నిడివిగల వీడియోలపై పరిశీలనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా 10 నిముషాలలోపు వీడియోలకు వీలు కల్పిస్తున్న యూట్యూబ్ బాటలో నడవనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. షార్ట్ వీడియో మేకింగ్ ప్లాట్‌ఫామ్.. టిక్‌టాక్ తాజా పరిశీలనలపై సోషల్ మీడియా కన్సల్టెంట్ మ్యాట్ నవరా వెల్లడించింది. 3 నిముషాల వీడియోల ఫీచర్ ప్రాథమిక దశలో ఉన్నట్లు స్క్రీన్ షాట్‌తో ట్విటర్ ద్వారా మ్యాట్ తొలిసారి తెలియజేసింది. ప్రస్తుతం టిక్‌టాక్ నిముషం వ్యవధిగల వీడియోలను అప్‌లోడ్ చేసేందుకే వీలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
మినియేచర్
10 నిముషాల నిడివి వరకూ వీడియోలకు వీలున్న యూట్యూబ్‌కు మినియేచర్ ఫీచర్‌గా టిక్‌టాక్ తాజా ప్రణాళికలు ఉన్నట్లు టెక్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రత్యర్ధి సంస్థ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ సైతం వీడియోల అప్‌లోడ్ సమయాన్ని 15 సెకన్ల నుంచి 30 సెకన్లకు పెంచింది. ఇక యూట్యూబ్ షార్ట్స్ ద్వారా యూజర్లు 15 సెకన్లలోపు వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేందుకు వీలుంటుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు. చదవండి: (టిక్‌టాక్ విక్రయానికి గడువు పెంపు)
నిషేధం
భద్రతా ప్రమాణాల రీత్యా టిక్‌టాక్ యాప్ వినియోగాన్ని ఇటీవల భారత్, యూఎస్ ప్రభుత్వాలు నిషేధించాయి. అయితే టిక్‌టాక్ యూఎస్ యూనిట్‌ను విక్రయించేందుకు చైనీస్ ప్రమోటర్ కంపెనీ బైట్‌డ్యాన్స్‌కు ట్రంప్ ప్రభుత్వం ఈ నెల 4 వరకూ గడువిచ్చిన విషయం విదితమే. కాగా.. యూఎస్ యూనిట్ నిర్వహణకు యూఎస్ దిగ్గజాలతో బైట్‌డ్యాన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా టిక్‌టాక్ యూఎస్ బిజినెస్ విక్రయంపై ట్రంప్ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను పంపింది. దీనిలో భాగంగా యూఎస్ దిగ్గజాలు ఒరాకిల్, వాల్‌మార్ట్ ఆధ్వర్యంలో టిక్‌టాక్‌ను కొత్త సంస్థగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. అంతేకాకుండా టిక్‌టాక్‌లో ప్రస్తుత ఇన్వెస్టర్లు కొనసాగుతారని తెలియజేసింది. అయితే టిక్‌టాక్ యూఎస్ వినియోగదారుల డేటా, కంటెంట్ ఆధునీకరించడం తదితర కార్యకలాపాలను యూఎస్ కంపెనీలు చేపడతాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment