
పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం సందర్శకుల వీసా వ్యవధిని పొడిగించింది. పర్యాటకులు, విద్యార్థులు, రిమోట్ వర్కర్లకు సంబంధించి వీసా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.
ఈ సందర్భంగా థాయ్‌లాండ్ ప్రభుత్వ ప్రతినిధి చాయ్ వాచరోంకే మాట్లాడుతూ..‘పర్యాటక రంగాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా టూరిస్ట్ వీసా గడువు పెంచాం. దాంతోపాటు ఇతర దేశాలనుంచి వచ్చే విద్యార్థులు, రిమోట్ వర్కర్లు, పదవీవిరమణ పొందిన వారికి సంబంధించి వీసాలో మార్పులు చేశాం. జూన్ నుంచి ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి. గతంలో థాయ్‌లాంట్ వచ్చే పర్యాటక దేశాల సంఖ్యను 57 నుంచి 93కు పెంచాం. ఈ అవకాశాన్ని ఆయా దేశాల పర్యాటకులు వినియోగించుకోవాలి. ఆన్-అరైవల్ వీసా పరిమితిని 30 రోజుల నుంచి 60 రోజులకు పొడిగించాం. దేశంలో ఉండాలనుకునే పదవీ విరమణ పొందిన వారికి బీమా అవసరాలను సడలించాం. గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఒక సంవత్సరం అదనంగా ఉండవచ్చు. రిమోట్ వర్కర్ల కోసం ప్రత్యేకవీసాలు ఐదేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: మోదీ ప్రధాని అయినా, అవ్వకపోయినా అందులో మార్పులేదు
ఈ సంవత్సరం జనవరి నుంచి మే 26 వరకు 14.3 మిలియన్ల మంది పర్యాటకులు థాయ్‌లాండ్‌ను సందర్శించినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024 పూర్తి ఏడాదికిగాను రికార్డు స్థాయిలో 40 మిలియన్ల విదేశీ రాకపోకలను లక్ష్యంగా చేసుకుంది. దాంతో 3.5 ట్రిలియన్ భాట్లు (రూ.7.9లక్షల కోట్లు) దేశఖజానాకు చేరుతుందని అంచనా. 2019లో కరోనాకు ముందు రికార్డు స్థాయిలో థాయ్‌లాండ్‌కు 39.9 మిలియన్ల మంది రాకపోకలు సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment