రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నరేంద్రమోదీ మూడోసారి ప్రధాని అయినా, అవ్వకపోయినా దేశ ఆర్థిక విధాన పథం కొనసాగుతుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఫైనాన్స్ ప్రొఫెసర్ పనిచేస్తున్న ఆయన హాంకాంగ్‌లో జరుగుతున్న యూబీఎస్ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.
ఈ సందర్భంగా బ్లూమ్‌బెర్గ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడుతూ..‘భారతీయ ఆర్థిక విధాన పథం కొనసాగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీ మరోసారి ప్రధాని అయినా, అవ్వకపోయినా ఆర్థిక వృద్ధిలో ఎలాంటి మార్పులుండవు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బడ్జెట్‌ను ప్రకటిస్తుంది. ఆ ప్రభుత్వం అందరికీ ఉపయోగపడే విధానాలను కొనసాగిస్తుంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వం భారత్‌లో మౌలిక సదుపాయాల నాణ్యతపై దృష్టి పెట్టాలి. పెట్టుబడి కేవలం ప్రధాన పారిశ్రామిక సంస్థలకు ప్రయోజనం చేకూర్చకుండా చూడాలి’ అని తెలిపారు.
ఇదీ చదవండి: నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్
దేశంలో ఆరు వారాల పాటు జరిగే ఎన్నికలు జూన్ 1న ముగుస్తాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలకానున్నాయి. మోదీ సారథ్యంలోని భాజపా మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనాలున్నాయి. అయినప్పటికీ ఆశించిన మెజారిటీని సంపాదించగలదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో కొందరు పెట్టుబడిదారులు ప్రభుత్వ విధానాలపై ఆధారపడే ఆర్థిక సంస్కరణల నుంచి తప్పుకునే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆర్థిక విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని, భారత్ తన ఆర్థిక పథాన్ని కొనసాగిస్తుందని రాజన్ చెప్పడం పట్ల కొంత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ అంచనా ప్రకారం భారత్ 2024-2026 మధ్యకాలంలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.44.4 ట్రిలియన్లు ఖర్చు చేస్తుంది. ఇది 2030 నాటికి ఆర్థిక వృద్ధిని 9శాతానికి పెంచేందుకు సహకరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment