పండుగ సీజన్ సమీపిస్తుండటం, ఎన్నికల తర్వాత కార్యకలాపాలు పుంజుకోవడంతో ఆగస్టులో రవాణాకు డిమాండ్ పెరిగినట్లు శ్రీరామ్ ఫైనాన్స్ రూపొందించిన మొబిలిటీ బులెటిన్ వెల్లడించింది. దీంతో వరుసగా రెండో నెల కూడా ట్రక్కుల అద్దెలు పెరిగినట్లు సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కోల్‌కతా–గౌహతి మార్గంలో ట్రక్కుల అద్దెలు అత్యధికంగా 3 శాతం, ఢిల్లీ–హైదరాబాద్ రూట్‌లో 2.3 శాతం పెరిగాయి. శ్రీనగర్ ప్రాంతంలో యాపిల్స్, ఎన్నికల సీజన్ కారణంగా సరుకు రవాణా ధరలు దాదాపు 10 శాతం అధికమయ్యాయి. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కుల వినియోగం గణనీయంగా వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వాహన విక్రయాలు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బైటపడి, పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని చెప్పారు.
ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..
గతంలో అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగి 115 డాలర్లకు చేరింది. దాంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 72 డాలర్లకు లభిస్తోంది. కానీ అందుకు తగ్గట్టుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. దాంతో చేసేదేమిలేక ట్రక్కు యజమానులు అద్దెలు పెంచారు. ఇటీవల ప్రభుత్వ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అందులో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే ప్రతిపాదనలున్నట్లు కొందరు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం వీటి ధరలను తగ్గిస్తే ట్రక్కు అద్దెలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే కొందరు యాజమానులు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా అద్దెలు తగ్గించడానికి సుముఖంగా ఉండడంలేదు. ప్రభుత్వం స్పందించి వాటి ధరలు తగ్గేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment