rents
-
హడలెత్తిస్తున్న ఇంటి అద్దె!.. నెలకు ఇన్ని లక్షలా..
భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగా పుంజుకుంటోంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో భూములు, అపార్ట్మెంట్ల ధరలు భారీగా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ అద్దెలు కూడా ఈ నగరాల్లో అమాంతం పెరిగిపోతున్నాయి. ఇటీవల దీనికి సంబందించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జైపూర్‌కు చెందిన ఉత్కర్ష్ గుప్తా.. తన ఎక్స్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ ముంబైలో మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఇందులో 2 బీహెచ్‌కే హౌస్ అద్దె నెలకు రూ.1.35 లక్షలు. దీనికోసం రూ.400000 డిపాజిట్ చేయాలి అని ఉండటం చూడవచ్చు. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏమిటంటే.. వాషింగ్ మెషీన్ టాయిలెట్ గదిలోనే ఉండటం చూడవచ్చు.ఇదీ చదవండి: దేశంలోనే పెద్ద కరెన్సీ నోటు.. ఎందుకు రద్దు చేశారంటే?ప్రస్తుతం ఈ పోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు ఇది బ్రిలియంట్ ఐడియా అని చెబుతుంటే.. మరొకరు ఇది బాత్రూమేనా అని అంటున్నారు. మరికొందరు దాని అద్దె కూడా చాలా ఎక్కువని చెబుతున్నారు. మొత్తానికి దీన్ని చూస్తే ముంబైలో అద్దెలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.Only in Mumbai, you can front load your washing machine while top loading your commode.At an affordable price of 1.35L per month! pic.twitter.com/texU5hUwMC— Utkarsh Gupta (@PaneerMakkhani) September 22, 2024 -
పెరిగిన ట్రక్ అద్దెలు
పండుగ సీజన్ సమీపిస్తుండటం, ఎన్నికల తర్వాత కార్యకలాపాలు పుంజుకోవడంతో ఆగస్టులో రవాణాకు డిమాండ్ పెరిగినట్లు శ్రీరామ్ ఫైనాన్స్ రూపొందించిన మొబిలిటీ బులెటిన్ వెల్లడించింది. దీంతో వరుసగా రెండో నెల కూడా ట్రక్కుల అద్దెలు పెరిగినట్లు సంస్థ ఎండీ వైఎస్ చక్రవర్తి తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘కోల్‌కతా–గౌహతి మార్గంలో ట్రక్కుల అద్దెలు అత్యధికంగా 3 శాతం, ఢిల్లీ–హైదరాబాద్ రూట్లో 2.3 శాతం పెరిగాయి. శ్రీనగర్ ప్రాంతంలో యాపిల్స్, ఎన్నికల సీజన్ కారణంగా సరుకు రవాణా ధరలు దాదాపు 10 శాతం అధికమయ్యాయి. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ట్రక్కుల వినియోగం గణనీయంగా వృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వర్షాల కారణంగా వాహన విక్రయాలు నెమ్మదించాయి. తెలుగు రాష్ట్రాలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బైటపడి, పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి’ అని చెప్పారు.ఇదీ చదవండి: ఆరోగ్య బీమా తిరస్కరించకూడదంటే..గతంలో అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితుల వల్ల బ్యారెల్ క్రూడాయిల్ ధర పెరిగి 115 డాలర్లకు చేరింది. దాంతో కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ధర 72 డాలర్లకు లభిస్తోంది. కానీ అందుకు తగ్గట్టుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. దాంతో చేసేదేమిలేక ట్రక్కు యజమానులు అద్దెలు పెంచారు. ఇటీవల ప్రభుత్వ అధికారులతో కేంద్రం సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. అందులో సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలనే ప్రతిపాదనలున్నట్లు కొందరు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం వీటి ధరలను తగ్గిస్తే ట్రక్కు అద్దెలు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. అయితే కొందరు యాజమానులు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా అద్దెలు తగ్గించడానికి సుముఖంగా ఉండడంలేదు. ప్రభుత్వం స్పందించి వాటి ధరలు తగ్గేలా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. -
మలైకా అరోరా అపార్ట్మెంట్ అద్దెకు.. రెంట్ ఎంతంటే?
ప్రముఖ నటి 'మలైకా అరోరా' ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని తన అపార్ట్‌మెంట్‌ను కాస్ట్యూమ్ డిజైనర్ కాశిష్ హన్స్‌కి మూడు సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. ఈ అపార్ట్మెంట్ నెలవారీ రెంట్ రూ. 1.57 లక్షలు. అయితే ఓ ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా అద్దె 5 శాతం పెరుగుతుంది.అద్దెదారు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 1.5 లక్షలు, రెండవ సంవత్సరంలో నెలకు రూ. 1.57 లక్షలు, మూడవ సంవత్సరంలో నెలకు రూ. 1.65 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే అద్దెదారు కాశిష్ హన్స్ 4.5 లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించిన తర్వాత అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఈ ఒప్పందం ఏప్రిల్ 29న జరిగినట్లు తెలుస్తోంది.మలైకా అరోరా తన అపార్ట్మెంట్లను అద్దెకు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఈమె తన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను ది జెఫ్ గోల్డెన్‌బర్గ్ స్టూడియో యజమాని జెఫ్రీ గోల్డెన్బర్గ్కు నెలకు రూ.1.2 లక్షలకు అద్దెకు ఇచ్చింది. ఇప్పుడు మరోమారు తన అపార్ట్‌మెంట్‌ను అద్దెకు ఇచ్చింది. -
హైదరాబాద్‌లో రెంట్లు ఎంత పెరిగాయో తెలుసా..
హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. రోజు రోజుకు రెంట్లు పెంచేస్తుండడంతో అద్దెకట్టేవారికి ఆర్థికభారం పెరుగుతోంది. ప్రస్తుతం చాలా కంపెనీలు Work from Home వర్క్ ఫ్రం హోం తొలగించి ఉద్యోగస్థులను ఆఫీసులకు రమ్మంటున్నాయి. దాంతో అద్దె ఇళ్లకు గిరాకీ పెరుగుతోంది. అదే అదనుగా ఇంటి యజమానులు రెంట్ పెంచుతున్నారు. కొవిడ్ పూర్వం అద్దెలకు ప్రస్తుతం ఉన్న అద్దెలకు భారీ వ్యత్యాసం ఉంది. 2019తో పోలిస్తే ఇంటి రెంట్లు ఎంత పెరిగాయనేదానిపై ప్రముఖ రియల్టీ సంస్థ హౌసింగ్.కామ్ కీలక నివేదిక విడుదల చేసింది. ఆ విషయాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికలోని వివరాల ప్రకారం.. 2019 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు దాదాపు 25-30 శాతం మేర పెరిగాయి. అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీల రెంట్లు 15-20 శాతం మేర అధిమయ్యాయి. అద్దెలు పెరిగిన క్రమంలో రెంటల్ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించినట్లు నివేదిక పేర్కొంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా న్యూయార్క్, లండన్, దుబాయ్, సింగపూర్ వంటి గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లతో పోలిస్తే దేశంలో చాలానే గ్యాప్ ఉన్నట్లు తెలిపింది. దేశంలోని టాప్ నగరాల్లో ప్రాపర్టీల ధరలు 2019 ధరలతో పోలిస్తే ప్రస్తుతం 15 నుంచి 20 శాతం మేర పెరిగినట్లు హౌసింగ్.కామ్ నివేదిక వెల్లడించింది. ప్రాపర్టీలు, అద్దె ఇళ్ల కోసం ఆన్లైన్లో సర్చ్ చేస్తున్న వారి సంఖ్య సైతం భారీగానే పెరిగినట్లు తెలిపింది. కొనుగోలు ఇండెక్స్‌తో పోలిస్తే ఐఆర్ఐఎస్ ఇండెక్స్ 23 పాయింట్లు అధికంగా ఉందని పేర్కొంది. ఇదీ చదవండి: ఓవెన్ సైకిళ్లు వచ్చేశాయ్.. ఓ లుక్కేయండి.. 'కరోనా మహమ్మారి తర్వాత హౌసింగ్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రాపర్టీల కొనుగోలు, అద్దెల డిమాండ్ అధికమైంది. దాదాపు దశాబ్ద కాలం పాటు స్తబ్దుగా కొనసాగిన హౌసింగ్ మార్కెట్ ధరల పెరుగుదల గత రెండేళ్లలో మాత్రం గణనీయంగా పెరిగింది. నగరాలను బట్టి ఈ ధరల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే ప్రధాన నగరాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రాపర్టీల ధరలు భారీగా పెరిగాయి.' అని హౌసింగ్.కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
గృహాల అద్దెలు పెరిగాయి!
సాక్షి, హైదరాబాద్: నగరంలో గృహాల అద్దెలు పెరిగాయి. ప్రీమియం ఇళ్లకు డిమాండ్, ఆఫీసు కేంద్రాలకు చేరువలో ఉండటం వంటి కారణంగా ప్రధాన నగరాలలో ఇళ్ల అద్దెలు వృద్ధి చెందుతున్నాయి. క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది జూలై–సెపె్టంబర్లో 4.6 శాతం, ఏడాదితో పోలిస్తే 22.4 శాతం మేర అద్దెలు పెరిగాయని మ్యాజిక్‌బ్రిక్స్.కామ్ నివేదిక వెల్లడించింది. అత్యధికంగా థానేలో 57.3 శాతం, గుర్గావ్లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం, హైదరాబాద్‌లో 24.2 శాతం మేర వృద్ధి చెందాయి. దేశంలోని 13 నగరాలో 67 శాతంగా ఉన్న 18–34 ఏళ్ల వయసు ఉన్న మిల్లీనియల్స్ వల్లే గృహాల అద్దెలు పెరిగాయి. సెమీ ఫరి్నష్ గృహాలను రెంట్‌కు తీసుకునేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ తరహా అద్దెలకు 52.7 శాతం డిమాండ్ ఉండగా.. సప్లయి 48.7 శాతం మాత్రమే ఉందని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈఓ సు«దీర్ పాయ్ తెలిపారు. నెలకు రూ.10–30 వేలు మధ్య అద్దె ఉన్న మధ్యస్థాయి గృహాలకు 41 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలకు రెక్కలు
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇళ్ల అద్దెలు 24 శాతం పెరిగాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా 13 పట్టణాల్లో సగటున 22.4 శాతం మేర అద్దెలు పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు) మ్యాజిక్‌బ్రిక్స్ రెంటల్ ఇండెక్స్ ప్రకటించింది. అదే క్రితం త్రైమాసికంతో పోలిస్తే ఈ పెరుగుదల 4.6 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెప్టెంబర్) గణాంకాలను మ్యాజిక్‌బ్రిక్స్ విడుదల చేసింది. మ్యాజిక్‌బ్రిక్స్ ప్లాట్‌ఫామ్‌పై 2 కోట్లకు పైగా కస్టమర్ల ప్రాధాన్యతల ఆధారంగా ఈ నివేదికను సంస్థ రూపొందించింది. వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు థానేలో ఇళ్ల ధరలు 57.3 శాతం, గురుగ్రామ్‌లో 41.4 శాతం, గ్రేటర్ నోయిడాలో 28.7 శాతం, నోయిడాలో 25.2 శాతం చొప్పున పెరిగాయి. ఈ పట్టణాల్లో అద్దెల డిమాండ్‌లో యువత (18.34 ఏళ్లు) పాత్ర 67 శాతంగా ఉంది. 41 శాతం మంది కిరాయిదారులు రూ.10,000–30,000 మధ్య అద్దెల ఇళ్లకు మొగ్గు చూపిస్తున్నారు. అద్దె ఇళ్లల్లో 52.7 శాతం సెమీ ఫర్నిష్డ్ ఇళ్లకే డిమాండ్ ఉంటోంది. కానీ, వీటి సరఫరా 48.7 శాతంగా ఉంది. ఆర్థిక వృద్ధి, పెరుగుతున్న పట్టణీకరణ, తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితులు అద్దెలు పెరగడానికి కారణాలుగా మ్యాజిక్‌బ్రిక్స్ సీఈవో సుధీర్‌పాయ్ పేర్కొన్నారు. ఒకవైపు అద్దె ఇళ్లకు అధిక డిమాండ్, మరోవైపు సరఫరా తగినంత లేకపోవడం ధరలను పెంచుతున్నట్టు చెప్పారు. -
దేశంలోని ఈ నగరాల్లో చుక్కలు చూపిస్తున్న అద్దె ఇళ్లు.. మరి హైదరాబాద్‌లో
దేశంలో అద్దె ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో నెల సంపాదనలో సగం అద్దింటికే చెల్లించాల్సి వస్తుందని చిరుద్యోగులు వాపోతున్నారు. పైగా పెరిగిపోతున్న అద్దె ఇళ్ల ధరలు సంపాదనలో కొంత మొత్తాన్ని దాచి పెట్టుకోవాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. తాజాగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కంపెనీ అనరాక్ ఓ నివేదికను విడుదల చేసింది. అందులో దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన బెంగళూరు,హైదరాబాద్, పూణేతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అద్దె ఇళ్ల ధరలు పెరిగినట్లు తెలిపింది. 🏘️వెయ్యి చదరపు అడుగులో డబుల్ బెడ్రూం ఇల్లు సగటున నెలవారీ అద్దె గత ఏడాది రూ.24,600 ఉండగా.. ఇప్పుడు అదే రెంట్ 2023 సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి రూ28,500కి చేరింది. 🏘️ముఖ్యంగా బెంగళూరులోని ప్రముఖ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ రెంట్లు దాదాపూ 30 శాతం పెరగ్గా.. వైట్ ఫీల్డ్ ఏరియాలో 31శాతం పెరిగాయి. ఆ తర్వాతి స్థానంలో సర్జాపూర్ రోడ్డు ప్రాంతంలోని అద్దె ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు అనరాక్ తన నివేదికలో వెల్లడించింది. 🏘️సర్జాపూర్ రోడ్లో నెలవారీ సగటు అద్దె ఇల్లు ధర 2022 ఏడాది ముగిసే సమయానికి రూ.24,000 ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి అదే రెంట్ ధర రూ.30,500కి చేరింది. 🏘️ఇక 9 నెలల కాలంలో హైదరాబాద్‌లో రెంట్ ధరలు 24 శాతం పెరగ్గా.. పూణేలో 17 శాతం పెరిగాయి. హైదరాబాద్ గచ్చీబౌలి ప్రాంతంలో అద్దె ఇల్లు ధరలు 2022 ముగిసే సమయానికి రూ.23,400 ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి రూ.29,000కి చేరింది. 🏘️ అదే పూణేలో 2022 ముగిసే సమయానికి రూ.21,000 ఉన్న అద్దె ఇల్లు ధర ఈ ఏడాది సెప్టెంబర్ నెల ముగిసే సమయానికి రూ.24,500కి చేరింది. 🏘️బళ్లారిలో 2బీహెచ్‌కే అద్దె రూ.24,600 నుంచి రూ.28,500కు పెరిగింది. 🏘️వైట్ ఫీల్డ్ ప్రాంతంలో వెయ్యి చదరపు చదరపు అడుగుల్లో ఉన్న 2 బీహెచ్‌కే ఇంటి సగటు నెలవారీ అద్దె 2022 ఏడాది చివరి నాటికి రూ.24,600 ఉండగా 2023, సెప్టెంబర్ నెల ముగిసే సయానికి రూ.28,500కి పెరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతాలో అద్దె ఇల్లు ధర 9 శాతంనుంచి 14 శాతానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా ‘ప్రస్తుత త్రైమాసికంలో చాలా నగరాల్లో అద్దె ఇంటి ధరలు స్థిరంగా ఉండొచ్చు. ఎందుకంటే? అద్దె సాధారణంగా సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తక్కువగా ఉంటాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో నియామకాలు పెరిగిన నేపథ్యంలో భారతీయులు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. కాబట్టే జనవరి-మార్చి కాలంలో అద్దెలు మళ్లీ పెరుగుతాయి' అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి అన్నారు. -
Fact Check: టీటీడీ వసతి గదులకు సంబంధించిన వాస్తవాలు ఇవి
సాక్షి, తిరుమల: తిరుమలలో అద్దె గదుల ధరలు పెంచారన్న విమర్శలు సరికాదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. రాజకీయంగా దీనిపై చర్చ చేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండానే మాట్లాడటం బాధాకరమన్నారు. భక్తులకు నిజాలు తెలియాలి అనే ఉద్ధేశ్యంతోనే వివరాలు తెలియజేస్తున్నామన్నారు. తిరుమలలో శ్రీవారి భక్తుల సౌకర్యార్థం మొత్తం 7500 గదులు ఉన్నాయి. అందులో 5000 గదులు 50 రూపాయలు, 100 రూపాయలు టారిఫ్ తో భక్తులకు టీటీడీ వారు అందిస్తున్నారు. అంటే 75% సామాన్య భక్తులకు అందుబాటులోనే టీటీడీ వారు సౌకర్యవంతమైన వసతులను అందిస్తున్నారు. ఈ 5000 రూములను ప్రస్తుత ప్రభుత్వం మరియు ప్రస్తుత టీటీడీ ట్రస్ట్ బోర్డు 120 కోట్ల రూపాయలు వెచ్చించి ఆధునీకరణ పనులను చేపట్టి, దిగ్విజయంగా పూర్తి చేసి, ఒక రూపాయి కూడా అదనంగా అద్దెను పెంచలేదు. అదేవిధంగా 1250 గదులు ₹1000 టారిఫ్ తో ఉండేటివి ఎవరైతే ఆన్లైన్ ద్వారా 300 రూపాయల ఎస్.ఈ.డి దర్శనాలు బుక్ చేసుకుంటారో వారికి అడ్వాన్స్ ఆన్లైన్ అకామిడేషన్ ఆప్షన్ ద్వారా బుక్ చేసుకునేందుకు గాను ఈ 1250 గదులను అందుబాటులో ఉంటాయి. మిగతా 1250 గదులు తిరుమలలోని పద్మావతి ఏరియాలో వివిఐపిల కేటాయింపుల కోసం ఉంచబడినవి. వివిఐపిలకు కేటాయించబడిన ఈ 1250 గదులలో 170 గదులకు మాత్రమే ఏర్ కండిషన్ (ఏసి) లాంటి వసతులు లేకపోవడం, వాటిని ఆధునికరించడంలో భాగంగా ఏసీలు, గీజర్లు, వుడెన్ కబోర్డ్స్, కాట్స్ లాంటివి సుమారు 8 లక్షలు ఒక్కొక్క గదికి వెచ్చించి పద్మావతి ఏరియాలో మిగతా రూముల్లో ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో అదేవిధంగా ఉండేలా ఈ 170 గదులని కూడా ఆధునీకరించడం జరిగినది. అదేవిధంగా పద్మావతి ఏరియాలో వివిఐపిలకు కేటాయించే మిగతా రూములకు ఏ విధంగా ధరలు ఉన్నాయో అదేవిధంగా ఈ ఆధునికరించిన 170 గదులకు కూడా ధరలు నిర్ణయించడం జరిగినది. ఈ ఆధునికరించిన 170 గదులు ఆల్రెడీ వివిఐపీలకు కేటాయిస్తున్న రూములే తప్ప సామాన్యులకు కేటాయించే గదులు కావు. దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎటువంటి ఆదాయం కూడా ఉండదు. పై వాటితో పాటు 15,000 మంది సామాన్య భక్తులు ఉచితంగా ఉండేందుకు, వారికి లాకర్లతో పాటు తిరుమలలో యాత్రికుల సౌకర్యాల సముదాయం (పి.ఎ.సి) నాలుగు ఉన్నాయి. గత బోర్డులో ఇంకా 5000 మంది సామాన్య భక్తుల వసతి సౌకర్యం కల్పించడం కొరకు ఇంకో పి.ఏసి.ని నిర్మించుటకు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి, నిర్మాణం కూడా మొదలుపెట్టింది టీటీడీ యాజమాన్యం. ఏదైతే సామాన్య భక్తుల కొరకు కేటాయించే 50 రూపాయలు, 100 రూపాయలు అద్దెలతో ఉన్న వసతి సముదాయాలనుకు ఎటువంటి అద్దెలు పెంచకపోగా 120 కోట్లు వెచ్చించి అధునీకరించారు. ఇంకో 100 కోట్లు అదనంగా వెచ్చించి సామాన్య భక్తులకు ఉచితంగా వసతిని అందించేందుకు గాను మరో పీఏసీ ని కూడా నిర్మిస్తున్న టిటిడి యాజమాన్యం. ప్రస్తుతం అద్దెలు పెంచింది పద్మావతి ఏరియాలో వివిఐపిలకు కేటాయించే 170 ఆధునికరించిన గదులకు మాత్రమే పెంచారు తప్ప, సామాన్య భక్తులకు కేటాయించే గదులకు సంబంధించిన అద్దెలులో ఒక రూపాయి కూడా పెంచలేదు. దీనిని కొందరు రాజకీయ దురుద్దేశంతో వక్రీకరించి విష ప్రచారం చేస్తున్నారు. దయచేసి తిరుమల శ్రీవారి భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము. చదవండి: (సికింద్రాబాద్ టు విశాఖ.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలివే..) -
అంగన్వాడీలకు ‘అద్దె’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు పెరిగిపోతున్నాయి. ఏడాదిన్నరగా ప్రభు త్వం అద్దె నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. బకాయి లు చెల్లించాలంటూ యజమానుల నుంచి ఒత్తిడి రావడంతో స్థానిక అంగన్వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 12,400 కేంద్రాలు అద్దె భవనాల్లోనే.. 11,181 కేంద్రాలు శాశ్వత భవనాల్లో.. 12,119 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో కొన సాగుతున్నాయి. అద్దె భవనాలను రెండు రకాలుగా వర్గీకరించిన ప్రభుత్వం ఆ మేరకు అద్దె నిధులు చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో రూ.వెయ్యి చొప్పున, పట్టణ ప్రాంతంలో గరిష్టంగా రూ.3 వేల చొప్పున సీలింగ్ విధించి నిధులు విడుదల చేస్తోంది. అంగన్వాడీ కేంద్రాలకు అద్దె కింద నెలకు సగటున రూ.2.5 కోట్లు సగటున చెల్లిస్తోంది. గత ఏడాదిన్నరగా అద్దె నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. గతేడాది డిసెంబర్ నాటికి రూ.30 కోట్ల మేర అద్దె బకాయిలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. టీచర్లపై ఒత్తిడి... అంగన్వాడీ కేంద్రం కోసం అద్దె భవనాన్ని పరిశీలించి, ఖరారు చేయడం, నెలవారీగా అద్దె మొత్తాన్ని చెల్లించే ప్రక్రియంతా టీచర్ల పరిధిలోనే కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు టీచర్లపై ఒత్తిడి చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుంటే ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అద్దె రూపంలో ఇచ్చే మొత్తం నామమాత్రమే అయినా సకాలంలో ఇవ్వకపోవడం వారికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో ప్రత్యామ్నాయ భవనాల కోసం ప్రయత్నాలు చేయాల్సి వస్తోందని కొందరు టీచర్లు వాపోతున్నారు. -
అద్దె మాఫీ.. వారికి ఉపశమనం..
సాక్షి, అమరావతి బ్యూరో: బస్స్టేషన్లలో ఉన్న షాపులకు అద్దెల భారం నుంచి ఉపశమనం కలిగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో బస్స్టేషన్లలో షాపులను మూసివేశారు. దీంతో నిర్వాహకులు ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ అమలులోకి వచ్చిన మార్చి 23 నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తిరిగి మే 21 నుంచి పాక్షికంగా తిరుగుతున్నాయి. బస్సులు తిరగకపోవడంతో బస్ స్టేషన్లకు వచ్చే వారే లేకుండా పోయారు. ఫలితంగా అక్కడ ఉండే షాపులను తెరవలేదు. వ్యాపారం సాగకపోవడంతో అద్దె బకాయిలను రద్దు చేయాలని సంబంధిత షాపుల నిర్వాహకులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏప్రిల్, మే, జూన్లకు వారు చెల్లించాల్సిన షాపుల అద్దెలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. రీజియన్‌లో పరిస్థితి.. ♦ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో 14 డిపోలున్నాయి. వీటిలో 414 అద్దె స్టాళ్లు(షాపులు) ఉండగా, 320 వరకు నడుస్తున్నాయి. ♦అందులో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్)లో 141 షాపులకు గాను దాదాపు వంద స్టాళ్లు రన్నింగ్‌లో ఉన్నాయి. ♦ఒక్కో షాపునకు నెలకు కనీసం రూ.11 వేల నుంచి 4 లక్షల వరకు అద్దె♦ చెల్లిస్తున్నారు. ♦బస్స్టేషన్లలో బ్యాంకు ఏటీఎంలకు మాత్రమే అత్యల్పంగా రూ.11 వేల అద్దె ఉంది. ♦మిగిలిన షాపులకు అద్దె రూ.20 వేల నుంచి లక్షల్లో ఉంది. ఇలా భారీ మొత్తంలో అద్దె చెల్లిస్తున్న వాటిలో డారి్మటరీలు, హోటళ్లు వంటివి ఉన్నాయి. ♦ఈ రీజియన్‌లోని బస్స్టేషన్లలో నడుస్తున్న అద్దె షాపుల నుంచి నెలకు రూ.1.62 కోట్ల అద్దె వస్తోంది. ♦ఈ లెక్కన ఆర్టీసీ యాజమాన్యం తాజా నిర్ణయం ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకు దాదాపు రూ.5 కోట్ల వరకు అద్దె మాఫీ కానుంది. ఖాళీ షాపులకు త్వరలో టెండర్లు.. వివిధ బస్స్టేషన్లలో ఖాళీగా ఉన్న షాపులకు త్వరలో టెండర్లు పిలవడానికి ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. వీటికి టెండర్లు ఖరారు చేస్తే ఈ షాపుల నుంచి కూడా ఆర్టీసీకి అద్దెల రూపంలో మరింత ఆదాయం సమకూరనుంది. -
పట్టాలెక్కిన రియల్టీ!
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2018 క్యూ1లో ప్రారంభమైన గృహాల్లో 74 శాతం అందుబాటు గృహాలే. 24,600 గృహాలు రూ.80 లక్షల లోపు ధరవేనని అన్‌రాక్ ప్రాపర్టీస్ కన్సల్టింగ్ నివేదిక తెలిపింది. వేగవంతమైన అనుమతులు, విధానపరమైన నిర్ణయాలతో రియల్టీ మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొందని అన్‌రాక్ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. కొత్త విధానాలతో పారదర్శకత, ఆర్థిక క్రమశిక్షణ పెరిగిందని చెప్పారు. విక్రయించబడకుండా ఉన్న ఇన్వెంటరీ గణాంకాల్లోనూ 2 శాతం తగ్గుదల నమోదైంది. 2017 క్యూ4లో 7.11 లక్షల ఇన్వెంటరీ ఉండగా.. 2018 క్యూ1 నాటికవి 7.27 లక్షల యూనిట్లకు తగ్గాయి. ముంబై మినహా ఇతర నగరాల్లో వృద్ధి.. కొత్త యూనిట్ల ప్రారంభాల్లో ముంబై మినహా మిగిలిన అన్ని నగరాల్లోనూ వృద్ధి నమోదైంది. ముంబైలో క్యూ4లో 11,500 యూనిట్లు ప్రారంభమైతే.. క్యూ1 నాటికవి 25 శాతం తగ్గుదలతో 8,600లకు పడిపోయాయి. కోల్‌కతాలో క్యూ4లో 1,600 యూనిట్లు ప్రారంభం కాగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 306 శాతం వృద్ధితో 6,500 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో 3,500 యూనిట్లు అందుబాటు గృహాలే. బెంగళూరులో 3,000 యూనిట్ల నుంచి 127 శాతం వృద్ధితో 6,800 యూనిట్లకు పెరిగాయి. చెన్నైలో 1,000 యూనిట్ల నుంచి 110 శాతం వృద్ధితో 2,100 యూనిట్లు, ఎన్సీఆర్లో 3,800 యూనిట్ల నుంచి 14 శాతం వృద్ధితో 4,500 యూనిట్లుకు, పుణెలో 1,700 యూనిట్ల నుంచి 7 శాతం వృద్ధితో 2,200 యూనిట్లకు పెరిగాయి. చెన్నై మినహా ఇతర నగరాల్లో వృద్ధి.. 2018 క్యూ1 అమ్మకాల్లో చెన్నై మినహా అన్ని నగరాల్లోనూ వృద్ధి కనిపించింది. ఇక్కడ క్యూ4లో 2,600 యూనిట్లు విక్రయం కాగా.. క్యూ1లో 2,300లకు తగ్గాయి. కోల్‌కతాలో క్యూ4లో 2,400 యూనిట్లు అమ్ముడుపోగా.. క్యూ1 నాటికి 42 శాతం వృద్ధితో 3,400లకు పెరిగింది. బెంగళూరులో 10 వేల యూనిట్ల నుంచి 15% వృద్ధితో 11,500లకు, ఎన్సీఆర్లో 8,200 యూనిట్ల నుంచి 11 శాతం వృద్ధితో 9,100లకు, ముంబైలో 11 వేల నుంచి 12 శాతం వృద్ధితో 12,300లకు, పుణెలో 5,900ల నుంచి 15 శాతం వృద్ధితో 6,800ల యూనిట్లకు పెరిగాయి. నగరంలో 30% తగ్గిన ప్రారంభాలు.. దేశంలో ఏడు ప్రధాన నగరాల్లో 2018 క్యూ1లో 33,300 యూనిట్లు ప్రారంభమయ్యాయి. ఇందులో 66 శాతం యూనిట్లు కేవలం ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. హైదరాబాద్‌లో కొత్త నివాసాల ప్రారంభాల్లో 30 శాతం తగ్గుదల నమోదైంది. 2017 క్యూ4లో నగరంలో 3,700 గృహాలు ప్రారంభం కాగా.. 2018 క్యూ1 నాటికి 30 శాతం తగ్గుదలతో 2,600 యూనిట్లే ప్రారంభమయ్యాయి. నగరంలో 3% పెరిగిన విక్రయాలు.. 2018 క్యూ1లో 49,200 యూనిట్లు అమ్ముడుపోగా.. ఇందులో 80 శాతం యూనిట్లు కేవలం ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లోనే జరిగాయి. హైదరాబాద్‌లో అమ్మకాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది క్యూ4లో నగరంలో 3,700 అమ్మడుపోగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 3,800లకు పెరిగింది. -
అగచాట్లవాడి
అనంతపురం సెంట్రల్: అంగన్వాడీ సిబ్బంది సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటిలోనూ భాగస్వామ్యం చేసి ఊడిగం చేయించే ప్రభుత్వం.. వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం లేదు. కనీసం అద్దెలు కూడా ఇవ్వకపోవడంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారింది. జిల్లాకు చెందిన పరిటాల సునీతనే మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నా... తమ బతుకులు మారడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పెర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 9 నెలలుగా అందని అద్దె జిల్లాలో 5,126 అంగన్వాడీ సెంటర్లు ఉండగా... అందులో దాదాపు 1,600 పైచిలుకు కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో రూ.3 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.750 చొప్పున భవనాలకు అద్దె చెల్లిస్తున్నారు. కానీ దాదాపు తొమ్మిది నెలలుగా అద్దె బిల్లులు మంజూరు కాలేదు. ఇంటి యజమానులు ఖాళీ చేయాలని గొడవ చేస్తున్నారు. ఈ క్రమంలో దిక్కుతోచని స్థితిలో ఇటీవల అనంతపురం అర్బన్ సీడీపీఓ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. అయినప్పటికీ పరిస్థితి మార్పు రాలేదు. మరోవైపు రూరల్ మండల కేంద్రాల్లోకూడా భవనానికి రూ. 750 మాత్రమే అద్దె చెల్లిస్తున్నారు. ఈ మొత్తానికి భవనాలు దొరకగా ఇరుకు సందుల్లోనూ, కొట్టాల్లోనూ అంగన్వాడీ కేంద్రాలను నడిపిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి అంగన్వాడీ సిబ్బందికి కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రెండు, మూడు నెలలకోసారి జీతాలు మంజూరు చేస్తున్నారు. అయితే ఇటీవల ఆన్‌లైన్‌పేరుతో జిలాల్లో చాలా మంది అంగన్వాడీ సిబ్బందికి జీతాలు మంజూరు చేయడం లేదు. గతేడాది జూన్ నుంచి జీతాలు తీసుకోని వారు జిల్లాలో వందల మంది ఉన్నారు. జీతాలివ్వండి అంటూ కార్యకర్తలు కార్యాలయ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. ఇక అంగన్వాడీ కార్యకర్తలను, ఆయాలను నెలలో రెండు, మూడు సార్లు సమావేశాలకు పిలుస్తున్నా... టీఏ, డీఏలు ఇవ్వడం లేదు. 2016 నుంచి టీఏ, డీఏలు ఇవ్వలేదని సమాచారం. పొరుగున తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్యకర్తలకు రూ. 13వేలు చెల్లిస్తున్నా..మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు. అంగన్వాడీలను రెగ్యులరైజేషన్ చేస్తామనీ, నెలకు రూ.15 వేలు చెల్లిస్తామంటూ ఎన్నికలకుముందు చంద్రబాబు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా అంగన్వాడీ సిబ్బంది సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోని మంత్రి పరిటాల శిశు, సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత తన సొంత జిల్లాలోని అంగన్వాడీల సమస్య కూడా పట్టించుకోవడం లేదు. నెలల తరబడి అద్దెలు రాకున్నా, సంవత్సరాల తరబడి బిల్లులు పేరుకుపోయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, రెండు సార్లు తప్ప మహిళా, శిశు సంక్షేమశాఖపై పెద్దగా సమీక్షలు కూడా లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ప్రధాన నగరాల్లో పెరిగిన ఇంటి అద్దెలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గృహాల ధరలు 2 శాతం పెరిగాయి. అలాగే ప్రధాన నగరాల్లో అద్దెలు 5 శాతం పెరిగాయని తాజా అధ్యయనం తేల్చింది. ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అద్దెలు 5 శాతానికి పెరిగాయని రియాల్టీ పోర్టల్ 99 ఏకర్స్. కామ్ నివేదించింది. రియల్టీ సెక్టార్లో కొత్తగా తీసుకొచ్చిన రెరా చట్టం వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచిందని.. దీంతో ఈ ఫెస్టివ్ సీజన్లో అమ్మకాలు బావున్నాయని తెలిపింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ క్యాపిటల్ విలువ 2 శాతం పెరగగా, అద్దెలు 5 శాతం పెరిగింది. రిపోర్టు ప్రకారం హౌసింగ్ ధర బెంగళూరులో 1 శాతం తగ్గింది. అయితే అద్దెలు 3 శాతం పెరిగాయి. ఢిల్లీ-ఎన్‌సిఆర్ మార్కెట్లో హౌసింగ్ ధరలు, అద్దెలు (సమీక్ష సమయంలో) స్థిరంగా ఉన్నాయని తెలిపింది. అటు ముంబైలో గృహాల ధరలు స్థిరంగా ఉన్నాయి కానీ అద్దెలు మాత్రం 2 శాతం పెరిగాయి. చెన్నైలో గృహాల ధరలు ఒక శాతం, అద్దెలు 2 శాతం పెరిగాయి. కోల్‌కతాలో గృహాల ధరలు, అద్దెలు వరుసగా 1 శాతం, 2 శాతం పెరిగాయి. పూణెలో అద్దెలు మాత్రం2 శాతం పెరిగింది. భారతదేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో నివాస మార్కెట్లో మూలధన విలువ , అద్దె ధరల ధోరణులపై సంస్థ త్రైమాసిక నివేదిక 'ఇన్సైట్’ను 99 ఏకర్స్ .కాంవిడుదల చేసింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో బలహీనత ..పేలవమైన విక్రయాలకు దారితీసిందని నివేదించింది. అలాగే గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తిచేయడంలో గణనీయమైన జాప్యంకారణంగా ధరలు కూడా పడిపోవడం లేదా స్థిరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ పండుగ సీజన్లో కొనుగోళ్లు పుంజుకునే అవకాశం ఉందని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నరసింహ జయకుమార్ అన్నారు. అంతేకాకుండా, ఇంతకుముందెన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు వినియోగదారులకి అనుకూలంగా ఉన్నాయనీ, ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. కాగా రియల్ ఎస్టేట్ సొల్యూషన్స్ కోసం నెలకు 99 లక్షల మందికి 99 ఏకర్స్ సైట్‌ను సందర్శిస్తుండగా..దాదాపు 8 లక్షలకు పైగా కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఇక్కడ లిస్ట్ అయి ఉన్నాయి. -
ఖజానాకు గండి
20 ఏళ్లుగా అవే అద్దెలు మూడేళ్లకోసారి పెంచాలన్న నిబంధనలు బుట్టదాఖలు పట్టించుకోని పాలకవర్గం, అధికార యంత్రాంగం రూ.లక్షల్లో పేరుకుపోయిన బకాయిలు వికారాబాద్ మున్సిపాలిటీలో మారని తీరు ప్రైవేట్ భవనాలను అద్దెకిచ్చినప్పుడు సదరు యజమాని ఏటా ఎంతో కొంత అద్దెను పెంచడం షరా మామూలే. ప్రభుత్వ భవనాల విషయానికి వస్తే మాత్రం ఏళ్ల తరబడి పాత అద్దెలతోనే కొనసాగుతున్నాయి. అడిగేవారు లేకపోవడం, ప్రభుత్వ ఆస్తి కదా అన్న నిర్లిప్త వైఖరితో మున్సిపల్ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ ఖజానాకు కోట్లలో రావాల్సి ఉండగా లక్షల్లో కూడా రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాలను విడతల వారిగా 1996లో అప్పుడు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఇప్పటి ఎమ్మెల్యే సంజీవరావు హయాంలో నిర్మించారు. పురపాలక సంఘానికి సంబంధించి పట్టణంలో మొత్తం 103 దుకాణాల వరకు ఉన్నాయి. డీసీఎంఎస్ ఎదురుగా బస్టాండ్‌కు వెళ్లే దారిలో 44 ఉండగా కూరగాయల మార్కెట్ స్థలంలో మిగతా దుకాణాలున్నాయి. వీటి అద్దెలను అప్పట్లో రూ.600 నుంచి రూ.2,848 వరకు నిర్ణయించారు. మున్సిపల్ అధికారులు కొన్ని దుకాణాలకు మాత్రమే రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు అడ్వాన్స్ గా తీసుకున్నారు. మున్సిపల్ గెజిట్‌లో ప్రతి మూడేళ్లకోసారి అద్దెలను పెంచాలన్న నిబంధన ఉన్నా యంత్రాంగం అమలు చేసిన దాఖలాలు లేవు. అప్పట్లో నిర్ణయించిన అద్దెలనే నేటికీ కొనసాగిస్తున్నారు. పెండింగ్‌లో అద్దెలు.. పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయానికి సంబంధించిన దుకాణాల అద్దెలు ఒక్కో దానికి రూ.10 వేల నుంచి రూ.23 వేల వరకు ఉంటే మున్సిపల్‌కు చెందిన దుకణాల అద్దెలు మాత్రం రూ.3వేలు మించడం లేదు. ఈ అద్దెను సైతం మున్సిపల్ అధికారులు నెలనెలా సక్రమంగా వసూలు చేయకపోవడంతో సుమారు రూ.18 లక్షల వరకు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన అద్దెలు పెండింగ్‌లో పడిపోయాయి. ఈ విషయంలో ఇటు పాలకపక్షం కాని, అటు అధికారయంత్రాంగం కానీ స్పందించకపోవడంపై స్థానికంగా విమర్శలు ఉన్నాయి. ఒక్కో దుకాణానికి కనీసం రూ.6 వేలు అద్దె నిర్ణయించినా 103 దుకాణాలకు సంబంధించి నెలకు సుమారు రూ.6లక్షలకు పైగా మున్సిపల్‌కు రాబడి వచ్చేది. ఏడాదికి రూ.74లక్షల పైచిలుకు ఖజానాకు చేరేదని అంటున్నారు. మంజీరా వాటర్, కరెంట్ బిల్లులు చెల్లించడానికే నానా అవస్థలు పడుతున్న పాలకపక్షం, అధికారయంత్రాంగం ఈ విషయంలో ఎందుకు దృష్టి సారించడం లేదోనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి వెంటనే ప్రభుత్వ దుకాణాల అద్దెను నిర్ణయించి బహిరంగ వేలం (ఓపెన్ యాక్షన్) ద్వారా కేటాయించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం: ఎంకేఐ అలీ, మున్సిపల్ కమిషనర్ కొంతమంది దుకాణాల నిర్వాహకులు కొన్నేళ్లుగా అద్దె చెల్లించడం లేదనే విషయం మా దృష్టికి కూడా వచ్చింది. సాధ్యమైనంత త్వరగా పాత అద్దెలను రద్దు చేసి బహిరంగ వేలం నిర్వహించి అద్దెలను సవరిస్తాం. బకాయి పడ్డ అద్దెలను సంబంధిత దుకాణాల నిర్వాహకుల నుంచి వసూలు చేయడానికి త్వరలో నోటీసులు జారీ చేస్తాం. చెల్లించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. -
గంజ్ షట్టర్ల లీజుపై ఆరా!
వ్యాపారులతో సమావేశమైన మేయర్, డీఈవో అద్దెలు విద్యాశాఖకు చెల్లించాలని ఆదేశం మళ్లీ వేలం లేకుండా చేసుకునేందుకు పన్నాగం శిథిలమైన గంజ్‌ైెహ స్కూల్ కూల్చివేతకు నిర్ణయం 24 గంటల నల్లా కనెక్షన్ బిగింపు కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నడిబొడ్డున పురాతన గంజ్ హైస్కూల్ షట్టర్ల వ్యవహారంపై మేయర్ రవీందర్‌సింగ్, డీఈవో పి.రాజీవ్ గురువారం ఆరా తీశారు. ఈనెల 1న ‘కదలరు.. వదలరు..’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. సర్కారు బడి ఆస్తులకు సంబంధించి అద్దెలు విద్యాశాఖకు రాకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాపారులతో సమావేశమై అద్దెలపై చర్చించారు. 2008తో ఆర్‌అండ్‌బీతో లీజు ముగిసినప్పటికీ గంజ్ హైస్కూల్‌కు ఒక్క రూపాయి చెల్లించకపోవడంపై ప్రశ్నించారు. విద్యాశాఖకు అద్దెలు చెల్లించాలని తమకు ఎవరూ చెప్పలేదని, ఇకనుంచి ఎంత అంటే అంత అద్దె చెల్లిస్తామని వ్యాపారులు తెలిపారు. గంజ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అకౌంట్లో జమచేయాలని డీఈవో సూచించారు. వేలం అడ్డుకునే పన్నాగం గంజ్ హైస్కూల్‌కు సంబంధించిన 21 షట్టర్లకు వేలం వేయకుండా మళ్లీ సదరు వ్యాపారులే దక్కించుకునేలా పన్నాగం నడుస్తోంది. అందుకు ప్రజాప్రతినిధులు సై అంటున్నట్లు తెలుస్తోంది. వేలం వేస్తే ఒక్కో షట్టర్‌కు రూ.20వేలు అద్దెతో పాటు సుమారు రూ.2 లక్షల వరకు డిపాజిట్ల రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఇంత ఆదాయం వస్తే పాత భవనం కూల్చి వేసి అదే స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించొచ్చు. అరుుతే సదరు వ్యాపారులు ఒక్కో షట్టర్‌కు రూ.3వేలు అద్దె ఇస్తామనడం గమనార్హం. ఇదే జరిగితే మరో ఐదేళ్ల వరకు ఒక్క రూపాయి కూడా అద్దె పెరగకుండా తిష్టవేయవచ్చనేది వ్యాపారుల పన్నాగం. శిథిల భవనం తొలగిస్తాం గంజ్ హైస్కూల్ పాత పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైందని వెంటనే తొలగించాలని కోఆప్షన్ సభ్యుడు కన్న కృష్ణ మేయర్‌కు విన్నవించారు. స్పందించిన ఆయన పరిశీలించి తొలగించాల్సిందిగా అదనపు కమిషనర్ వెంకటేశంకు సూచించారు. 24 గంటల నల్లా బిగింపు గంజ్ హైస్కూల్లో విద్యార్థులకు తాగునీటి సౌకర్య కల్పించేందుకు 24 గంటల నల్లా కనెక్షన్ బిగింపునకు మేయర్ రవీందర్‌సింగ్ హామీ ఇచ్చారు. వెంటనే భూమి పూజ చేశారు. స్క్రాప్‌నకు వేలం వేయండి శిథిలమైన పాత పాఠశాల భవనాన్ని కూల్చివేస్తే విలువైన టేకు కర్రతోపాటు ఇనుపరాడ్లు వెలువడుతాయని వాటికి వేలం వేయూలని పాఠశాల ఉపాధ్యాయులను డీఈవో కోరారు. వేలం ఆలస్యమైతే కర్రను ఒక గదిలో భద్రపరచాలని సూచించారు. వేలం ద్వారా వచ్చే నిధులను పాఠశాల అభివృద్ధి కేటాయిస్తామన్నారు. హైస్కూల్ అభివృద్ధికి సహకరిస్తాం గంజ్ హైస్కూల్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులకు పూర్వ విద్యార్థులుగా సహకరిస్తాం. అత్యవసరంగా వాటర్ ప్యూరిఫైడ్‌ను ఏర్పాటు చేస్తాం. భవన నిర్మాణం చేపడితే నిధులు సేకరించి ఇస్తాం. - రవీందర్‌సింగ్, మేయర్