విజయవాడ బస్టాండ్‌లోని షాపులు
సాక్షి, అమరావతి బ్యూరో: బస్‌స్టేషన్లలో ఉన్న షాపులకు అద్దెల భారం నుంచి ఉపశమనం కలిగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో బస్‌స్టేషన్లలో షాపులను మూసివేశారు. దీంతో నిర్వాహకులు ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన మార్చి 23 నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తిరిగి మే 21 నుంచి పాక్షికంగా తిరుగుతున్నాయి. బస్సులు తిరగకపోవడంతో బస్ స్టేషన్లకు వచ్చే వారే లేకుండా పోయారు. ఫలితంగా అక్కడ ఉండే షాపులను తెరవలేదు. వ్యాపారం సాగకపోవడంతో అద్దె బకాయిలను రద్దు చేయాలని సంబంధిత షాపుల నిర్వాహకులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏప్రిల్, మే, జూన్‌లకు వారు చెల్లించాల్సిన షాపుల అద్దెలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే.
రీజియన్‌లో పరిస్థితి..
♦ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో 14 డిపోలున్నాయి. వీటిలో 414 అద్దె స్టాళ్లు(షాపులు) ఉండగా, 320 వరకు నడుస్తున్నాయి.
♦అందులో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్‌బీఎస్)లో 141 షాపులకు గాను దాదాపు వంద స్టాళ్లు రన్నింగ్‌లో ఉన్నాయి.
♦ఒక్కో షాపునకు నెలకు కనీసం రూ.11 వేల నుంచి 4 లక్షల వరకు అద్దె♦ చెల్లిస్తున్నారు.
♦బస్‌స్టేషన్లలో బ్యాంకు ఏటీఎంలకు మాత్రమే అత్యల్పంగా రూ.11 వేల అద్దె ఉంది.
♦మిగిలిన షాపులకు అద్దె రూ.20 వేల నుంచి లక్షల్లో ఉంది. ఇలా భారీ మొత్తంలో అద్దె చెల్లిస్తున్న వాటిలో డారి్మటరీలు, హోటళ్లు వంటివి ఉన్నాయి.
♦ఈ రీజియన్‌లోని బస్‌స్టేషన్లలో నడుస్తున్న అద్దె షాపుల నుంచి నెలకు రూ.1.62 కోట్ల అద్దె వస్తోంది.
♦ఈ లెక్కన ఆర్టీసీ యాజమాన్యం తాజా నిర్ణయం ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకు దాదాపు రూ.5 కోట్ల వరకు అద్దె మాఫీ కానుంది.
ఖాళీ షాపులకు త్వరలో టెండర్లు..
వివిధ బస్‌స్టేషన్లలో ఖాళీగా ఉన్న షాపులకు త్వరలో టెండర్లు పిలవడానికి ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. వీటికి టెండర్లు ఖరారు చేస్తే ఈ షాపుల నుంచి కూడా ఆర్టీసీకి అద్దెల రూపంలో మరింత ఆదాయం సమకూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment