తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: గమ్యానికి వెళుతూ ఓ వలస కూలీ మృతి చెందాడు. ఒడిశాలోని బరంపురం సమీపంలో పాశియా గ్రామానికి చెందిన కరుణం దులై (50), అతడి భార్య ఉళ్లిదులై గుంటూరు సమీపంలోని స్పిన్నింగ్ మిల్లులో కార్మికులుగా పని చేస్తున్నారు. లాక్‌డౌన్ అనంతరం బస్సులు తిరుగుతుండడంతో ఒడిశాకు చెందిన పది మందితో కలిసి వారు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విజయవాడ బస్ కాంప్లెక్స్‌కు వచ్చారు. రాజమహేంద్రవరం డిపో బస్సు ఎక్కి రాజమహేంద్రవరం వరకూ టిక్కెట్లు తీసుకున్నారు. హనుమాన్ జంక్షన్ వద్దకు వచ్చేసరికీ కరుణం దులై కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సును ఆపాడు. భార్య సాయంతో కిందకు దిగి మళ్లీ బస్సు ఎక్కాడు.
సాయంత్రం 6.10 గంటల సమయంలో రాజమహేంద్రవరం బస్సు చేరుకుంది. బస్సులో ఉన్న కరుణం దులై అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తోటి ప్రయాణికుల సహాయంతో మృతదేహాన్ని కిందకు దించారు. కరుణం దులై బస్సు ఎక్కే సమయంలో జ్వరంతో బాధ పడుతున్నట్టు అతడి భార్య, తోటి ప్రయాణికులు చెబుతున్నారు. అనారోగ్యం కారణంగా గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. హనుమాన్ జంక్షన్‌లో కాలకృత్యాలు తీర్చుకుని, బస్సు ఎక్కిన అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కరుణం దులై మృతి చెందాడని అతడి భార్య పోలీసులకు తెలిపింది. ప్రకాశం నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని అంబులెన్స్‌లో వారి సొంతూరుకు తరలించే ఏర్పాట్లు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment