కోవిడ్ 19 భయంతో ఇళ్లకు వెళ్లేందుకు జలంధర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వలస కూలీలు
సాక్షి, న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది క్రితం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో, అలాంటి సన్నివేశాలే మళ్లీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. గతేడాది కోవిడ్ సంక్రమణ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో నగరాలు, పట్టణాల్లో ఉన్న బడుగుజీవులు గత్యంతరం లేని పరిస్థితుల్లో సొంతూళ్లకు ఏదో ఒక రకంగా చేరుకోవాలనే తపనతో కష్టాలకోర్చి ప్రయాణాలు చేశారు. కాలినడకన, సైకిళ్లు, సొంత వాహనాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు, స్పెషల్ రైళ్లలో ఎలాగోలా చేరుకున్నారు. పరిస్థితి దాదాపుగా చక్కబడిందనుకొని నాలుగైదు నెలల క్రితం మళ్లీ నగరబాట పట్టిన వారికి తాజా పరిణామాలు ఏమాత్రం మింగుడుపడట్లేదు.
కొన్ని రోజులుగా కోవిడ్–19 పాజిటివ్ కేసుల్లో పురోగతి ఒక్కసారిగా రికార్డు స్థాయిలో ఉండడం, సంక్రమణ రేటు రెట్టింపు కావడంతో రాష్ట్రాలు ఇప్పటికే పలు నగరాల్లో ఆంక్షలు విధించాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందనే స్పష్టత కొరవడింది. నాలుగైదు రోజులుగా రోజుకు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఏరకంగా మారుతుందనే అంశంపై అంచనా వేయడం కష్టమౌతోంది.
ఒకవైపు కేసులు పెరుగుతుండడం, మరోవైపు వ్యాక్సినేషన్ చేసేందుకు తమ వద్ద అవసరానికి ఉండాల్సిన స్టాక్ లేదని పలు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకువచ్చాయి. మహారాష్ట్రలో స్టాక్ అందుబాటులో లేని కారణంగా పలుచోట్లు వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. మరోవైపు తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ శుక్రవారం ప్రధాని రాసిన లేఖలో మరో రెండు రోజుల వ్యాక్సిన్ స్టాక్ మాత్రమే ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరాల్లో జీవించడం కంటే తమ సొంత ఊరుని నమ్ముకుంటేనే మేలని అనేకమంది భావిస్తున్నారు.
అందుకే ప్రజలు ప్రయాణాలకు సిద్ధపడడంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఢిల్లీ , ముంబై, బెంగళూరు, పూణే సహా నగరాల్లోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని అనధికారిక వర్గాలు ప్రకటించాయి. సంక్రమణ భయంతో వలస కార్మికులు అనేకమంది స్వగ్రామాలకు వెళుతున్న నేపథ్యంలో రైలు సర్వీసుల కొనసాగింపుపై శుక్రవారం రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. రైలు సేవలను తగ్గించడానికి కానీ ఆపడానికి ఎటువంటి ప్రణాళిక లేదని, అవసరమైతే పెంచుతామని రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ చెప్పారు.
దేశరాజధాని ఢిల్లీ
దేశ రాజధానిలో ఈనెల 6వ తేదీన ప్రారంభమైన నైట్ కర్ఫ్యూ ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే, గర్భిణీ స్త్రీలు, రోగులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్సు టెర్మినస్ నుండి టిక్కెట్లు చూపించి ప్రయాణించే వారికి మాత్రం ప్రభుత్వం పరిమితుల నుంచి మినహాయింపు ఇచ్చింది. అయినప్పటికీ ఢిల్లీలో పెరుగుతున్న పాజిటివ్ కేసుల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించకుండా, సామాజిక దూరాన్ని పాటించని వారిపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. మాస్క్ ధరించని వారికి రూ.2వేలు జరిమానా విధిస్తున్నారు.
మహారాష్ట్ర
ముంబై, పూణే, నాగ్‌పూర్ సహా మహారాష్ట్రలోని అన్ని నగరాలు, జిల్లాల్లో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు కఠినమైన లాక్డౌన్ జరుగనుంది. కోవిడ్ –19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బీఎంసీ ముంబై నగరంలో వీకెండ్ లాక్డౌన్ విధించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు కల్పించారు. ముంబై అధికారులు నగరానికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. పూణే మునిసిపల్ కార్పొరేషన్ నగరంలో ఈనెల 30వ తేదీ వరకు అన్ని మార్కెట్లు, దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్, అలహాబాద్, మీరట్, ఘజియాబాద్, బరేలీ జిల్లాల్లో ప్రారంభమైన నైట్ కర్ఫ్యూ ఈనెల 17వరకు అమలులో ఉండనుంది. కాన్పూర్, లక్నో ల్లోనూ ఆంక్షలు విధించారు.
జమ్మూకశ్మీర్
శుక్రవారం రాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోని 8 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ మొదలైంది. జమ్మూ, ఉధంపూర్, కథువా, శ్రీనగర్, బారాముల్లా, బుద్గాం, అనంతనాగ్, కుప్వారా జిల్లాల్లోని పట్టణప్రాంతాల్లో ఆంక్షలు అమలులో ఉంటాయి.
ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం దుర్గ్ జిల్లాలో లాక్‌డౌన్ ప్రకటించింది. ఈనెల 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పూర్తి లాక్డౌన్ విధించారు. రాయ్‌పూర్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి, జిల్లా సరిహద్దులను శుక్రవారం నుంచి ఈనెల 19వ తేదీ ఉదయం 6 గంటల వరకు సీలు చేశారు. ఈ 10 రోజుల్లో అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తారు.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని అన్ని పట్టణ ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్ ప్రక్రియ సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈనెల 8 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు.
రాజస్తాన్
రాత్రి కర్ఫ్యూతో పాటు అనేక ఆంక్షలను జైపూర్ సహా రాజస్తాన్‌లోని అన్ని నగరాలు, జిల్లాల్లో ఈనెల 5 నుంచి 19వ తేదీ వరకు కొనసాగించనున్నారు. నైట్ కర్ఫ్యూని రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు విధించారు.
పంజాబ్
ఈ నెల 30వ తేదీ వరకు పంజాబ్ అంతటా రాత్రి కర్ఫ్యూను పొడిగించినట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. చంఢీగఢ్‌లోనూ 7వ తేదీ నుంచి నైట్ కర్ఫ్యూ ప్రారంభమైంది.
తమిళనాడు
రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అధికారయంత్రాంగం కఠినమైన నిర్ణయాలను అమలులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి అమలులోకి వచ్చిన నిబంధనలతోనైనా వ్యాప్తి రేటు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment