సాక్షి, ముంబై: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు మరోమారు లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ దిశగా ఆలోచిస్తోందన్న వార్తలు చాలామందిని కలవరపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ధనవంతుల ఇళ్లలో పనిచేసుకుంటూ జీవనం సాగించే ఎందరో పేదింటి మహిళలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
గతేడాది అమలుచేసిన లాక్‌డౌన్ వల్ల వారు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారు. ఉన్న ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లి గవ్వ లేక పస్తులుండాల్సిన పరిస్ధితి వచ్చింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు కొంత అదుపులోకి రావడంతో గత ఆరు నెలలుగా వారికి ఏదో ఒక ఉపాధి దొరికింది. దీంతో వారి కుటుంబాలకు కొంత ఆధారం లభించినట్లు అయింది. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ అంటుండటంతో వారు ఉన్న ఆధారం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ మరోసారి లాక్‌డౌన్ విధిస్తే తమ కుటుంబ పరిస్ధితి ఏంటని తలచుకుంటూ వారు బాధపడుతున్నారు.
35 లక్షల మంది మహిళా కార్మికులు
ముంబై, థానే, నవీ ముంబై పరిసర ప్రాంతాల్లో ఇళ్లలో పనిచేసే మహిళా కార్మికులు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. వీరిలో కొంత మంది ఇటుక బట్టీలలో పనులు చేసుకుంటుండగా.. మరికొందరు ఇతర కూలీ పనులు చేసుకుంటున్నారు. కానీ, ఎక్కువ మంది మాత్రం ధనవంతుల ఇళ్లలో ఇంటి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. అయితే, గత కొంతకాలంగా ముంబైతో పాటు తూర్పు, పశ్చిమ ఉప నగరాలలో, శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడైనా లాక్‌డౌన్ అమలు చేసే ఆస్కారముందని ప్రచారం సాగుతోంది. దీంతో గతేడాది పరిస్ధితులు మళ్లీ పునరావృతం అయ్యే ప్రమాదముందని వారు బెంబేలెత్తిపోతున్నారు.
తమకు వచ్చే కొద్దిపాటి వేతనంతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చే మహిళలు అధిక శాతం ఉన్నారు. వీరికి సొంత ఇళ్లు కూడా లేకపోవడంతో అద్దె ఇళ్లలో ఉంటూ పనులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ లాక్‌డౌన్ విధించి వీళ్లు ఉపాధి కోల్పోతే ఇంటి అద్దె కూడా చెల్లించేందుకు డబ్బులు లేని దయనీయ పరిస్థితి వస్తుంది. గతంలో విధించిన లాక్‌డౌన్ ఇప్పటికే పిల్లల చదువు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలామందికి ఉపాధి పోయింది. అప్పుడు పోగొట్టుకున్న పని ఇంతవరకు దొరకలేదు. ఇక ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ పెడితే తాముంటున్న అద్దె ఇళ్లు ఖాళీ చేసి సొంతూళ్లకు వెళ్లిపోవాల్సిందేనని పేద మహిళలు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment