సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కరోనా వైరస్ విజృంభణ, దాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో బతుకీడుస్తున్న వలస కార్మికులు, కూలీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మళ్లీ లాక్‌డౌన్ అమలుచేస్తే ముంబై మహానగరంలో ఎలా బతకాలో తెలియక చాలామంది కూలీలు, కార్మికులు మళ్లీ సొంతూళ్ల బాట పట్టారు. ఉపాధి కోసం నగరానికి రావాలనుకున్న వాళ్లు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. పరిస్థితులు అదుపులోకి వచ్చాకే నగరానికి రావాలని భావిస్తున్నారు.
తగ్గినట్టే తగ్గి..
డిసెంబర్, జనవరి మాసాల్లో కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాల్లో కూలీలు, కార్మికులకు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రతీరోజు వేలాది మంది ఉపాధి కోసం ముంబై నగరానికి వచ్చారు. అయితే, ఫిబ్రవరి చివరి వారం నుంచి కరోనా మళ్లీ విజృంభించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు ఆంక్షలు విధించింది. అయినప్పటికీ కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో మరింత కఠినంగా వ్యవహరించింది. రాత్రి పూట కర్ఫ్యూ, 144 సెక్షన్ అమలు చేసింది.
రాష్ట్రంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రజల్లో మార్పు రావాలని, లేని పక్షంలో మరోసారి లాక్‌డౌన్ విధించక తప్పదని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది. దీంతో లాక్‌డౌన్ విధిస్తే తమకు ఉపాధి లభించకపోవచ్చని ముందుగానే గ్రహించిన అనేక మంది పేదలు, కూలీలు, కార్మికులు, అసంఘటిత రంగాల్లో పనిచేసే వారు స్వగ్రామాలకు వెళ్లిపోవడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఒకవేళ మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే ముంబైలోనే చిక్కుకుంటామని వారిలో భయం నాటుకుపోయింది. దీంతో చాలామంది స్వగ్రామాలకు పయనం అవుతున్నారు. పెట్టే బేడ, పిల్లా పాపలతో దొరికిన వాహనంలో బయలుదేరుతున్నారు.
అర్ధంతరంగా పనులు వదిలేసి..
రెడీమేడ్ దుస్తులు తయారుచేసే గార్మెంట్లలో, చిన్నా చితకా పరిశ్రమలలో పనిచేసే కూలీలు, కార్మికులు చేతిలో ఉన్న పనిని అర్ధంతరంగా వదిలేసి గ్రామాలకు వెళ్లిపోతున్నారు. దీంతో వారిని నమ్ముకుని ముందస్తుగా ఆర్డర్లు తీసుకున్న చిన్న, బడా వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సమయానికి ఆర్డర్లు వినియోగదారులకు అందించకపోతే మరింత నష్టం వస్తుంది. దీంతో ఏం చేయాలో తెలియక వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. మరోపక్క భవన నిర్మాణ రంగంలో కూలీలకు, కార్మికులకు నిత్యం మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో బిల్డర్లు అయోమయంలో పడిపోయారు.
వాహనాల కోసం పడిగాపులు
ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారులు, హైవేలపై ట్రక్కులు, టెంపోలు, ప్రైవేటు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు అన్నీ స్వగ్రామాలకు వెళ్లే కూలీలు, కార్మికులతో నిండిపోతున్నాయి. కొందరైతే ఎలాగైనా ఇంటికి వెళ్లాలన్న తపనతో వాహనాల వారు అడిగినంత చార్జీలు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అదునుగా కొందరు చార్జీలు కూడా భారీగా పెంచారు. ఇంకా కొందరు దూరప్రాంతాలకు వెళ్లేవాళ్లు తమ ప్రాంతానికి వెళ్లే వాహనాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు వడిగాపులు కాస్తున్నారు. మరికొందరు ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలోనైనా వెళ్లిపోయేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment