vijayawada bus stand
-
గుడి తాళం తెరవక ముందే హడావుడి!
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/కృష్ణలంక(విజయవాడ తూర్పు): టీడీపీ రాజకీయ కుట్రల్లో భాగంగానే ఆలయాల్లో విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సీతారామ ఆలయం వద్ద టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పూజారి వచ్చి గుడి తలుపులు కూడా తెరవక ముందే ఆ ఆలయంలో సీతమ్మ మట్టి విగ్రహం ధ్వంసమైందంటూ టీడీపీ రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఓ నేత.. కొంత మంది ఆటో డ్రైవర్లను వెంటబెట్టుకుని వచ్చి అక్కడ హడావుడి చేశాడు. పూజారి రాకముందే.. అంటే ఉదయం 9.30 గంటలకు పూజారి రాజశేఖర్‌శర్మ తాళం తీయడానికి రాగా, అప్పటికి అరగంట ముందు నుంచే అక్కడ టీడీపీ నాయకులు గుమికూడి హడావుడి మొదలెట్టారు. టీడీపీ నేతల హడావుడి తర్వాతే ఆర్టీసీ అధికారులకు ఆ సమాచారం తెలిసింది. వెంటనే ఆర్టీసీ సిబ్బంది ఫోన్ ద్వారా ఆలయ పూజారికి సమాచారం ఇచ్చారు. అంతేగాకుండా విగ్రహం ధ్వంసమైందన్న సమాచారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకు చేరిందని, టీడీపీ శ్రేణులిచ్చిన సమాచారాన్ని ఓ టీవీ కెమేరామేన్ ఇతర మీడియా సభ్యులుండే గ్రూపులో పోస్టు చేసినట్టు తమ పరిశీలనలో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. దేవదాయ శాఖ పరిధిలో లేని ఆ చిన్న ఆలయానికి మూడు వైపులా పూర్తిగా మూసివేసి ఉంటుంది. ముందు వైపు చెక్క తలుపులు, ఇనుప గేట్ ఉంటుంది. పూజారి రోజుకోసారి నైవేద్యం పెట్టి వెళుతుంటారు. ఆలయ ప్రాంగణాన్ని ఊడ్చే మహిళ కూడా గత కొద్ది రోజులుగా రావడం లేదు. నేను వెళ్లేసరికే వారు అక్కడున్నారు: ఆలయ పూజారి ఆర్టీసీ సిబ్బంది తనకు ఉదయం 9 గంటల సమయంలో ఫోన్ చేసి విషయం చెప్పగా, తాను 9.30 గంటల సమయంలో వచ్చి గుడి తాళం తెరిచినట్టు ఆలయ పూజారి రాజశేఖర్‌శర్మ చెప్పారు. అయితే అప్పటికే అక్కడ టీడీపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు, పోలీసులున్నట్టు తెలిపారు. టీడీపీ నేతలు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే తాము అక్కడకు చేరుకున్నట్టు బీజేపీ కండువాలున్న గోసంరక్షణ సంఘం ప్రతినిధులు చెప్పారు. హడావుడి చేద్దామని వెళ్లి.. అభాసుపాలు కృష్ణా జిల్లా ఉయ్యూరు శివాలయంలో కేతువు విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆదివారం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టీడీపీ కార్యకర్తలను పోగేసి ఆలయానికి వెళ్లారు. తీరా ఆ విగ్రహం చేతి భాగంలో రెండు నెలల కిందటే చిన్నపాటి పెచ్చులూడాయని పూజారి సత్యనారాయణశర్మ చెప్పడంతో టీడీపీ నేతల ఉత్సాహం నీరుగారిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి వాస్తవాలు ధ్రువీకరించడంతో ఎమ్మెల్సీ అక్కడ నుంచి జారుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ సమీపంలో ఉన్న సీతారామాలయంలో ఆదివారం మట్టి విగ్రహం ఒరిగిపోవడంతో పగిలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఉదయం 5.50 సమయంలో తాను దండం పెట్టుకునేందుకు వెళ్లినప్పుడు విగ్రహాలు బాగానే ఉన్నాయని దుర్గాపురం సుందరయ్య కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ మోహన్ కనకదుర్గావర ప్రసాద్ పోలీసులతో చెప్పారు. ఘటనపై డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ గుడి గేట్‌కు తాళం వేసి ఉందని, లోపలకు వెళ్లేందుకు అవకాశం లేదని, అయినా విగ్రహం ముందుకు పడిందని, ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. -
అద్దె మాఫీ.. వారికి ఉపశమనం..
సాక్షి, అమరావతి బ్యూరో: బస్స్టేషన్లలో ఉన్న షాపులకు అద్దెల భారం నుంచి ఉపశమనం కలిగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో బస్స్టేషన్లలో షాపులను మూసివేశారు. దీంతో నిర్వాహకులు ఆర్టీసీ యాజమాన్యానికి అద్దె చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. లాక్డౌన్ అమలులోకి వచ్చిన మార్చి 23 నుంచి ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తిరిగి మే 21 నుంచి పాక్షికంగా తిరుగుతున్నాయి. బస్సులు తిరగకపోవడంతో బస్ స్టేషన్లకు వచ్చే వారే లేకుండా పోయారు. ఫలితంగా అక్కడ ఉండే షాపులను తెరవలేదు. వ్యాపారం సాగకపోవడంతో అద్దె బకాయిలను రద్దు చేయాలని సంబంధిత షాపుల నిర్వాహకులు యాజమాన్యాన్ని కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఏప్రిల్, మే, జూన్లకు వారు చెల్లించాల్సిన షాపుల అద్దెలను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించిన సంగతి తెలిసిందే. రీజియన్‌లో పరిస్థితి.. ♦ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో 14 డిపోలున్నాయి. వీటిలో 414 అద్దె స్టాళ్లు(షాపులు) ఉండగా, 320 వరకు నడుస్తున్నాయి. ♦అందులో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్)లో 141 షాపులకు గాను దాదాపు వంద స్టాళ్లు రన్నింగ్‌లో ఉన్నాయి. ♦ఒక్కో షాపునకు నెలకు కనీసం రూ.11 వేల నుంచి 4 లక్షల వరకు అద్దె♦ చెల్లిస్తున్నారు. ♦బస్స్టేషన్లలో బ్యాంకు ఏటీఎంలకు మాత్రమే అత్యల్పంగా రూ.11 వేల అద్దె ఉంది. ♦మిగిలిన షాపులకు అద్దె రూ.20 వేల నుంచి లక్షల్లో ఉంది. ఇలా భారీ మొత్తంలో అద్దె చెల్లిస్తున్న వాటిలో డారి్మటరీలు, హోటళ్లు వంటివి ఉన్నాయి. ♦ఈ రీజియన్‌లోని బస్స్టేషన్లలో నడుస్తున్న అద్దె షాపుల నుంచి నెలకు రూ.1.62 కోట్ల అద్దె వస్తోంది. ♦ఈ లెక్కన ఆర్టీసీ యాజమాన్యం తాజా నిర్ణయం ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలకు దాదాపు రూ.5 కోట్ల వరకు అద్దె మాఫీ కానుంది. ఖాళీ షాపులకు త్వరలో టెండర్లు.. వివిధ బస్స్టేషన్లలో ఖాళీగా ఉన్న షాపులకు త్వరలో టెండర్లు పిలవడానికి ఆర్టీసీ అధికారులు సమాయత్తమవుతున్నారు. వీటికి టెండర్లు ఖరారు చేస్తే ఈ షాపుల నుంచి కూడా ఆర్టీసీకి అద్దెల రూపంలో మరింత ఆదాయం సమకూరనుంది. -
ప్రయాణికులతో కిక్కిరిసిన బెజవాడ బస్టాండ్
విజయవాడ : సంక్రాంతి పండగ సెలవులు పూర్తి కావడంతో గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు వెల్లడించారు. అందుకోసం విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు 500 సాధారణ బస్సులు... అలాగే 250 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మరో 300 సర్వీసులు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. విజయవాడ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ప్రత్యేక సర్వీసులను ఎండీ సాంబశివరావు పర్యవేక్షించారు. అయితే ఆదివారం సాయంత్రం విజయవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. -
కండక్టర్ల కస్సు‘బస్సు’
- ఆంధ్ర- తెలంగాణల మధ్య చార్జీల చిచ్చు - ఏపీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపు.. - తెలంగాణ బస్సుల వైపు ప్రయాణికుల మొగ్గు సాక్షి, హైదరాబాద్: అది విజయవాడ బస్టాండ్.. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్లాట్ఫారం వద్దకు వస్తోంది. వెంటనే ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్లు వచ్చి దానిని అడ్డుకున్నారు. రెండు ఏపీ బస్సులు బయలుదేరాకే ఫ్లాట్‌ఫారం వద్దకు రావాలని ఆర్డర్ వేశారు. రోజూ నిలిపే సమయమే కదా అడ్డుకోవడమేంటని టీఎస్ ఆర్టీసీ కండక్టర్ ప్రశ్నించారు. ‘మీ బస్సు వస్తే ప్రయాణికులు ఎగబడి ఎక్కేస్తారు, మా బస్సుల ప్రయాణికుల సంఖ్య పడిపోతుంది.’ అంటూ ఏపీ కండక్టర్లు ఎదురుదాడికి దిగారు. ఇది ఒక్క విజయవాడలోనే కాదు. ఏపీలోని పలు ప్రధాన బస్టాండ్లలో ఏపీ, తెలంగాణ కండక్టర్లు కస్సుబుస్సులాడుకుంటున్నారు. ఇదీ సంగతి... ఇటీవల ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచింది. కానీ, తెలంగాణ ఆర్టీసీ చార్జీలు యధాతథంగా ఉన్నాయి. విజయవాడ-హైదరాబాద్ మధ్య ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ బస్సు టికెట్ ధరల్లో భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఏపీ-తెలంగాణ మధ్య ప్రయాణించే అన్ని రూట్లల్లోనూ ఇదే తీరు. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులు ఎక్కేందుకే ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ బస్సు నడిచే సమయానికి ముందు- వెనక తిరిగే ఏపీ బస్సుల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతోంది. దీంతో కీలక వేళల్లో తెలంగాణ బస్సులను ప్లాట్‌ఫాం వద్దకు రాకుండా కొన్నిచోట్ల ఏపీ కండక్టర్లు అడ్డుకుంటున్నారు. దీంతో గత్యంతరం లేక వెనక నిలుపుతున్న తెలంగాణ బస్సు కండక్టర్లు ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లి..‘తెలంగాణ బస్సు వెనక ఉంది... వచ్చి కూర్చోండి... టికెట్ ధర కూడా తక్కువ’ అంటూ కేకలు వేస్తూ ప్రయాణికులను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఏపీ ఆర్టీసీ కండక్టర్లు వారితో వాదనకు దిగుతున్నారు. ఒకే రూట్లో ప్రయాణించే వేర్వేరు రాష్ట్రాల బస్సుచార్జీలు ఒకేలా ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని, తెలంగాణలో కూడా బస్సు చార్జీలు సవరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఏపీ అధికారులు తెలంగాణ అధికారులను కోరుతున్నారు. లేని పక్షంలో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఒప్పందం ఉంటే ఏ ఆర్టీసీ బస్సులోనైనా, ఏ రాష్ట్ర భాగంలో ఆ రాష్ట్ర చార్జీని అమలు చేస్తారు. తెలంగాణ భూభాగంలో రెండు ఆర్టీసీలు తెలంగాణ చార్జీని, ఏపీ భూభాగంలో రెండు ఆర్టీసీ బస్సుల్లో ఏపీ చార్జీలను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, సాంకేతికంగా ఇంకా రెండు ఆర్టీసీలు విడిపోకపోవటం ఈ ఒప్పందానికి అడ్డొస్తోంది. -
బెజవాడ బస్టాండ్‌లో 18.లక్షల బంగారం చోరీ
విజయవాడ : విజయవాడ బస్టాండ్‌లో సుమారు రూ.18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. గత రాత్రి ఈ సంఘటన జరిగింది. స్నేహితురాలి పెళ్లికి వచ్చిన మహిళ సూట్‌కేసులో 450 గ్రాముల బంగారు నగలున్న పెట్టెను అహరించారు. పోలీసుల కథనం ప్రకారం.... నిజామాబాద్‌కు చెందిన ప్రియాంక అమెరికాలో ఉంటుంది. ఆమె స్నేహితురాలు అనూష వివాహం బుధవారం రాత్రి విజయవాడలో జరిగింది. ఈ పెళ్లి కోసం ప్రియాంక తన తల్లి జానకితో కలిసి విజయవాడ వచ్చింది. నిజామాబాద్ వెళ్లేందుకు గురువారం రాత్రి పెళ్లివారు ఏర్పాటు చేసిన కారులో బస్టాండుకు వచ్చారు. అంతలో గుర్తు తెలియని వ్యక్తి చొరవగా వచ్చి ఆమె లగేజీని బస్సు దగ్గరకు మోసుకొచ్చాడు. ఆ వ్యక్తి పెళ్లివారికి సంబంధించివాడని భావించి వారు అతడి వెంట నడిచారు. లగేజిని హైదరాబాద్ రూట్లో వెళ్లే బోధన్ బస్సులో పెట్టాడు. అంతలో తల్లి కింద ఉండగా ప్రియాంక టికెట్లు తీసుకునేందుకు వెళ్లింది. అంతే...తర్వాత లగేజి తెచ్చి బస్సులో పెట్టిన వ్యక్తి కనిపించలేదు. ఆ తర్వాత లగేజిని చూసుకోగా, రూ.18 లక్షల విలువైన బంగారు నగలున్న పెట్టె కనిపించలేదు. దీంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. లగేజీ తెచ్చిన వ్యక్తే నగల్ని అపహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు.