బెజవాడ బస్టాండ్లో 18.లక్షల బంగారం చోరీ
విజయవాడ : విజయవాడ బస్టాండ్లో సుమారు రూ.18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. గత రాత్రి ఈ సంఘటన జరిగింది. స్నేహితురాలి పెళ్లికి వచ్చిన మహిళ సూట్కేసులో 450 గ్రాముల బంగారు నగలున్న పెట్టెను అహరించారు. పోలీసుల కథనం ప్రకారం.... నిజామాబాద్కు చెందిన ప్రియాంక అమెరికాలో ఉంటుంది. ఆమె స్నేహితురాలు అనూష వివాహం బుధవారం రాత్రి విజయవాడలో జరిగింది. ఈ పెళ్లి కోసం ప్రియాంక తన తల్లి జానకితో కలిసి విజయవాడ వచ్చింది. నిజామాబాద్ వెళ్లేందుకు గురువారం రాత్రి పెళ్లివారు ఏర్పాటు చేసిన కారులో బస్టాండుకు వచ్చారు.
అంతలో గుర్తు తెలియని వ్యక్తి చొరవగా వచ్చి ఆమె లగేజీని బస్సు దగ్గరకు మోసుకొచ్చాడు. ఆ వ్యక్తి పెళ్లివారికి సంబంధించివాడని భావించి వారు అతడి వెంట నడిచారు. లగేజిని హైదరాబాద్ రూట్లో వెళ్లే బోధన్ బస్సులో పెట్టాడు. అంతలో తల్లి కింద ఉండగా ప్రియాంక టికెట్లు తీసుకునేందుకు వెళ్లింది. అంతే...తర్వాత లగేజి తెచ్చి బస్సులో పెట్టిన వ్యక్తి కనిపించలేదు. ఆ తర్వాత లగేజిని చూసుకోగా, రూ.18 లక్షల విలువైన బంగారు నగలున్న పెట్టె కనిపించలేదు. దీంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. లగేజీ తెచ్చిన వ్యక్తే నగల్ని అపహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు.