హైదరాబాద్: తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) హైదరాబాద్‌లోని టీ హబ్ 2.0లో ఏర్పాటు చేసిన అసిస్టివ్ టెక్నాలజీ సమ్మిట్ 4.0 (ATS 4.0) నాలుగో ఎడిషన్ ముగిసింది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘టీఎస్‌ఐసీ ఇన్‌క్లూషన్ టాక్స్’ పేరుతో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని టీఎస్‌ఐసీ నిర్వహించింది.
దివ్యాంగులు, అంధులు, ప్రత్యేక అవసరాలవారు, విభిన్న ప్రతిభావంతులు ఇలా ప్రతిఒక్కరూ ఇతరులతో సమానంగా ముందుకు సాగడం, అభివృద్ధి సాధించడంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాత్రపై వివిధ సంస్థలు, ఎన్‌జీవోలకు చెందిన పలువురు తమ ప్రసంగాలను వినిపించారు. దీంతోపాటు దివ్యాంగులు, ప్రత్యేక అవసరాల వ్యక్తుల కోసం రూపొందించిన అబ్బురపరిచే పలు ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించారు.
అసిస్టెక్ ఫౌండేషన్ (ATF) కోఫౌండర్, సీఈవో ప్రతీక్ మాధవ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత, ఎన్‌ఐఈపీఐడీలో స్పెషల్ ఎడ్యుకేషన్ లెక్చరర్ డా. అంబాడి, ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ కౌన్సెలర్ టి.వి. ఐశ్వర్య, భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ మహేందర్ వైష్ణవ్, ఐటీఈ&సీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, యూత్4జాబ్స్ వ్యవస్థాపకురాలు మీరా షెనాయ్ తదితరులు ప్రసంగించారు. సమగ్ర సమాజాన్ని రూపొందించడంలో ఆవిష్కరణల కీలక పాత్రపై తాము ప్రత్యేక దృష్టి పెట్టినట్లు టీఎస్‌ఐసీ చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ శాంతా తౌటం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment