ఆర్థిక వ్యవస్థకు దన్నుగా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ ప్రతిపాదిస్తున్న 2.2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీపై కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బుధవారం యూఎస్ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూశాయి. చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. డోజోన్స్ 98 పాయింట్లు(0.35 శాతం) నీరసించి 28,211 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 8 పాయింట్లు(0.2 శాతం) బలహీనపడి 3,436 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్ సైతం 32 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి 11,485 వద్ద స్థిరపడింది.
నెట్‌ఫ్లిక్స్ పతనం
ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో పెయిడ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య అంచనాలను చేరకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ షేరు 7 శాతం పతనమైంది. ప్రత్యర్థి సంస్థల నుంచి పెరిగిన పోటీ, క్రీడా ప్రసారాలు ప్రారంభంకావడం వంటి అంశాలు ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ మార్కెట్లు ముగిశాక క్యూ3(జులై- సెప్టెంబర్)లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. దీంతో ఫ్యూచర్స్‌లో టెస్లా ఇంక్ షేరు 4 శాతం జంప్‌చేసింది.
హైజంప్..
కోవిడ్-19 లాక్‌డవున్‌లలో వినియోగదారుల సంఖ్య పెరగడం, పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలు ఆకట్టుకోవడం వంటి అంశాలు స్నాప్‌చాట్ కౌంటర్‌కు డిమాండ్ పెంచాయి. దీంతో స్నాప్‌చాట్ మాతృ సంస్థ స్నాప్ ఇంక్ షేరు 28 శాతం దూసుకెళ్లింది. ఈ ప్రభావంతో ఇతర సోషల్ మీడియా కౌంటర్లు సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. దీంతో ట్విటర్ 8 శాతం జంప్‌చేయగా.. ఫేస్‌బుక్ 4 శాతం ఎగసింది. ఇదేవిధంగా పింట్‌రెస్ట్ ఇంక్ 9 శాతం దూసుకెళ్లింది!
మోడార్నా డౌన్
కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను రూపొందిస్తున్న ఫార్మా దిగ్గజాలలో మోడర్నా ఇంక్ 4.2 శాతం పతనంకాగా.. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ 1.2 శాతం చొప్పున డీలాపడ్డాయి. ఇతర కౌంటర్లలో అల్ఫాబెట్ 2.4 శాతం పుంజుకోగా.. బోయింగ్ 2 శాతం నష్టపోయింది.
Comments
Please login to add a commentAdd a comment