న్యూయార్క్: అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ కు అవకాశాలు పెరిగిన నేపథ్యంలో వారాంతాన యూఎస్ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ధోరణిలో ముగిశాయి. శుక్రవారం డోజోన్స్ 61 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 28,329కు చేరగా.. ఎస్‌అండ్‌పీ నామమాత్ర లాభంతో 3,512 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్ 16 పాయింట్లు(0.15 శాతం) పుంజుకుని 11,907 వద్ద స్థిరపడింది. వెరసి ఈ వారం నాస్ డాక్ 9 శాతం జంప్ చేయగా.. డోజోన్స్, ఎస్‌అండ్‌పీ 7 శాతం చొప్పున ఎగశాయి. తద్వారా ఏప్రిల్ తదుపరి ఒకే వారంలో అత్యధిక లాభాలు ఆర్జించాయి. పెన్సిల్వేనియా, జార్జియాలలో నమోదైన స్వల్ప ఆధిక్యాలను బైడెన్ పెంచుకోవడం ద్వారా విజయానికి మరింత చేరువైనట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. వరుసగా నాలుగు రోజులపాటు ర్యాలీ చేసిన మార్కెట్లలో వారాంతాన ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగినట్లు తెలియజేశారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలలో అస్పష్టత నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించినట్లు వివరించారు.
రికవరీ బాటలో
కోవిడ్-19 కారణంగా మాంద్య పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థ తిరిగి రికవరీ బాట పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం అక్టోబర్లో నిరుద్యోగిత 6.9 శాతానికి పరిమితంకావడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. సెప్టెంబర్లో 7.7 శాతంగా నమోదైంది. అక్టోబర్లో 6.38 లక్షల మందికి ఉపాధి లభించినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. అయితే సెకండ్ వేవ్ లో భాగంగా మళ్లీ అమెరికాసహా యూరోపియన్ దేశాలలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ప్రభుత్వం మరోసారి సహాయక ప్యాకేజీలను ప్రకటించవలసి ఉంటుందని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. తాజా పాలసీ సమీక్షలో కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. కాగా.. కోవిడ్-19కు ముందు నమోదైన 3.5 శాతం గణాంకాలతో పోలిస్తే నిరుద్యోగిత అధికంగానే నమోదైనట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం స్టిములస్ కు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని తెలియజేశారు. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అమలు చేస్తున్న ప్యాకేజీని 190 బిలియన్ డాలర్లమేర పెంచిన విషయం విదితమే.
షేర్ల తీరిలా
నిపుణుల అంచనాలను మించి త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో కాస్మెటిక్స్ కంపెనీ కొటీ ఇంక్ దాదాపు 18 శాతం దూసుకెళ్లింది. మూడో క్వార్టర్(జులై- సెప్టెంబర్)లో అంచనాలకు మించి వినియోగదారులు జత కావడంతో టీ మొబైల్ దాదాపు 6 శాతం జంప్ చేసింది. ఇతర బ్లూచిప్స్‌లో మోడర్నా ఇంక్ 1.4 శాతం, ఆస్ట్రాజెనెకా 0.65 శాతం, బోయింగ్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. అయితే క్యూ3 పనితీరులో విశ్లేషకులను నిరాశపరచడంతో వీడియో గేమ్ తయారీ కంపెనీ ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ షేరు 6.5 శాతం పతనమైంది. అమెజాన్ 0.3 శాతం, ఫేస్‌బుక్ 0.4 శాతం మధ్య డీలాపడగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఇంక్ 2 శాతం నీరసించింది.
Comments
Please login to add a commentAdd a comment