న్యూయార్క్: ప్రపంచ సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్.. తిరిగి ఈక్విటీలవైపు దృష్టి సారించారు. ఈ ఏడాది(2020) మూడో త్రైమాసికంలో పలు ఫార్మా దిగ్గజాలలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. బఫెట్ ప్రధాన కంపెనీ బెర్క్‌షైర్ హాథవే.. క్యూ3(జులై- సెప్టెంబర్)లో వివిధ కంపెనీలలో 4.8 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇదే కాలంలో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కి సైతం మరో 9 బిలియన్ డాలర్లను వెచ్చించడం గమనార్హం! ఈ అంశాలను బెర్క్‌షైర్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తాజాగా వెల్లడించింది.
యూటర్న్..
దాదాపు ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను కోవిడ్-19 వణికిస్తున్న నేపథ్యంలో తొలి రెండు త్రైమాసికాలలోనూ బఫెట్ సంస్ధ బెర్క్‌షైర్ 13 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా పలు ఎయిర్‌లైన్స్ కంపెనీలలో గల వాటాలను దాదాపు అమ్మివేసింది. కాగా.. కోవిడ్-19 కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్లు 90 శాతం విజయవంతమైనట్లు ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా ఇంక్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో బఫెట్ రూటు మార్చుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో షేర్ల విక్రయాలకు బదులుగా కొనుగోళ్ల యూటర్న్ తీసుకున్నట్లు వ్యాఖ్యానించారు.
ఫార్మాకు ప్రాధాన్యం
బెర్క్‌షైర్ క్యూ3లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీలలో ఫార్మాకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. జాబితాలో యాబ్‌వీ ఇంక్, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, మెర్క్ అండ్ కో చోటు చేసుకున్నాయి. వీటిలో ఫైజర్‌లో 13.8 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. కేవలం కోవిడ్-19 వ్యాక్సిన్లపై దృష్టితో కాకుండా భవిష్యత్‌లో ఫార్మా రంగానికున్న అవకాశాలపై అంచనాలతో బఫెట్ కంపెనీ ఇన్వెస్ట్ చేసినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో బ్యాంకింగ్ దిగ్గజాలు జేపీ మోర్గాన్ చేజ్, వెల్స్ ఫార్గో, పీఎన్‌సీ ఫైనాన్సియల్ సర్వీసెస్‌తోపాటు.. రిటైల్ దిగ్గజం కాస్ట్‌కో హోల్‌సేల్ కార్ప్‌లలో వాటాలు తగ్గించుకుంది. క్యూ2లో పలు ఎయిర్‌లైన్స్ కంపెనీలలో భారీగా వాటాలు విక్రయించిన సంగతి తెలిసిందే.
టీ మొబైల్‌లో..
స్టాక్ ఎక్స్ఛేంజీల వివరాల ప్రకారం ఈ ఏడాది క్యూ3లో టెలికం సేవల దిగ్గజం టీ మొబైల్ యూఎస్‌లో బెర్క్‌షైర్ అదనపు వాటాలను సొంతం చేసుకుంది. అతిపెద్ద వైర్‌లెస్ నెట్‌వర్క్ కలిగిన టీ మొబైల్ 5జీ సేవలవైపు దృష్టి సారించిన నేపథ్యంలో బఫెట్ తాజా పెట్టుబడులు చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెక్నాలజీ రంగ ఐపీవో స్నోఫ్లేక్ ఇంక్‌లోనూ బెర్క్‌షైర్ ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. ఇదే సమయంలో 2.5 బిలియన్ డాలర్లతో క్లాస్ ఏ షేర్లను, 6.7 బిలియన్ డాలర్లతో క్లాస్ బీ షేర్లనూ బైబ్యాక్ చేసింది. వెరసి 2020లో బెర్క్‌షైర్ హాథవే షేర్ల బైబ్యాక్‌కు సెప్టెంబర్ చివరికల్లా 15.7 బిలియన్ డాలర్లను వెచ్చించినట్లయ్యింది. అయినప్పటికీ కంపెనీ వద్ద దాదాపు 146 బిలియన్ డాలర్ల నగదు నిల్వలుండటం విశేషం!
Comments
Please login to add a commentAdd a comment