కేంద్ర బడ్జెట్ ప్రకటించిన రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు తెగ సంబరపడిపోయారు. గోల్డ్ రేట్లు ఇక తగ్గుముఖం పడతాయని చాలామంది భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అనుకున్నదొకటి.. అయినది ఒకటి మాదిరిగా అయిపోయింది. ఆగష్టు ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం రూ. 70వేలు దాటేసింది.
బంగారం కొనుగోలు సురక్షితమైన పెట్టుబడిగా భావించి చాలామంది ఇన్వెస్టర్లు గోల్డ్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆగష్టు 9 నుంచి 13 వరకు బంగారం ధరలు గరిష్టంగా రూ. 2350 (10 గ్రా) పెరిగింది. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు మళ్ళీ భారీగా పెరిగే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది.
కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుఎస్‌లో వడ్డీ రేట్ల తగ్గింపుపై పెరుగుతున్న అంచనాలు, డాలర్ ఇండెక్స్‌లో మృదుత్వం, బంగారానికి దేశంలో పెరుగుతున్న డిమాండ్ వంటివన్నీ గోల్డ్ రేట్లు పెరగటానికి కారణమవుతున్నాయని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా అన్నారు.
గంటల వ్యవధిలోనే బంగారం ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. గోల్డ్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. వారంలో రెండు రోజులు స్వల్ప తగ్గుదలను నమోదు చేస్తున్న బంగారం ధరలు.. మిగిలిన రోజులు పెరుగుదల వైపే అడుగులు వేస్తున్నాయి. కాబట్టి బంగారం కొనాలనుకునే వారు కొంత తగ్గుముఖం పట్టినప్పుడు కొనుగోలు చేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment