న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2021 డిసెంబర్‌లో 13.56 శాతంగా (2020 ఇదే నెలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. నిజానికి నాలుగు నెలల ఎగువముఖ ధోరణి నుంచి వెనుకడుగువేసినా, 13.56 శాతం స్థాయి కూడా తీవ్రమైనదే కావడం గమనార్హం. కాగా నవంబర్‌లో 14.23%గా నమోదయింది. 2021 ఏప్రిల్ నుంచి తొమ్మిది నెలల పాటు టోకు ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి ఎగువనే కొనసాగడం గమనార్హం. సమీక్ష నెల్లో సామాన్యునికి సంబంధించి ఆహార ధరలు తీవ్రంగానే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది.
మొత్తం సూచీలో దాదాపు 20 శాతం వెయిటేజ్ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్‌లో ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 9.56 శాతంగా ఉంది. నవంబర్‌లో ఇది 4.88 శాతమే. కూరగాయల ధరలు ఏకంగా 31.56 శాతం ఎగశాయి. నవంబర్‌లో ఈ రేటు 3.91 శాతంగా ఉంది. ఈ విభాగంలో పప్పులు, గోధుమలు, తృణ ధాన్యాలు, ధాన్యం ధరలు పెరగ్గా, ఆలూ, ఉల్లి, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల ధరలు తగ్గాయి. మరోవైపుప వంట నూనె ధరలు కూడా గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే టోకు ధరల పెరుగుదల సూచీ ఇంకా రెండు అంకెల స్థాయిలో కొనసాగుతుండటం ధరల అదుపుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment