మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐదు కంపెనీలకు సంబంధించి 15 ప్రాపర్టీలకు (భూములు/ భవనాలు) నవంబర్ 19న వేలం నిర్వహించనుంది. మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్, సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్ ఇండియా, రవికిరణ్ రియల్టీ ఇండియా, పురుషోత్తమ్ ఇన్ఫోటెక్ ఇండస్ట్రీస్ కంపెనీలకు సంబంధించిన ఆస్తులు ఇందులో ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీలు వసూలు చేసిన డబ్బులను వేలం ద్వారా రాబట్టబోతున్నట్లు సెబీ తెలిపింది. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని ఈ కంపెనీలకు సంబంధించి ప్రాపర్టీలు, ఫ్లాట్లు, భూములు, ప్లాంట్ మెషినరీ వేలం వేయనున్నారు. ఆ ప్రాపర్టీలకు సంబంధించి బిడ్లను సెబీ ఆహ్వానించింది. 15 ప్రాపర్టీల్లో ఏడు మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. సుమంగళ్ ఇండస్ట్రీస్, ఫాల్కన్ ఇండస్ట్రీస్‌కు సంబంధించి చెరో మూడు ప్రాపర్టీలు ఉన్నాయి.
ఇదీ చదవండి: మొబైల్ తయారీ రంగంలో వేగంగా విస్తరణ
మంగళం ఆగ్రో ప్రొడక్ట్స్ నిబంధనలకు విరుద్ధంగా సెక్యూర్డ్ ఎన్‌సీడీ(నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్-కంపెనీ అప్పు చెల్లించడంలో డిఫాల్ట్ అయితే దాని ఆస్తులు అమ్ముకోవచ్చు)లను జారీ చేసి రూ.11 కోట్లు సమీకరించినట్టు సెబీ తేల్చింది. అలాగే సుమంగళ్ ఇండస్ట్రీస్ కలెక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ల(వ్యక్తుల నుంచి డబ్బు తీసుకుని విభిన్న మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం) ద్వారా రూ.85 కోట్లు, ఫాల్కన్ ఇండస్ట్రీస్ రెడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్ల(రెడీమ్ చేసేకునేందుకు వీలుగా ఉన్న షేర్లు) జారీ ద్వారా రూ.48.58 కోట్ల చొప్పున సమీకరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment