ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం త్వరలో జరుగనుంది. వివాహానికి ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ మూడురోజుల సంబరాలకు అంతర్జాతీయ అతిథులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జరుగనుంది. అయితే ఎందుకు అక్కడే జరుపుకుంటున్నారనే దానిపై అనంత్ వివరణ ఇచ్చారు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం.
జామ్‌నగర్‌లోనే..
అనంత్ అంబానీ గుజరాత్‌లోనే పుట్టాడని చెప్పారు. అక్కడ వేడుక జరుగుతుండటం తన అదృష్టమన్నారు. అందుకే జామ్‌నగర్‌ను ఎంచుకున్నామని చెప్పారు. భారత్‌లోనే వివాహాలు జరుపుకోవాలని మోదీ పిలుపునిచ్చినప్పుడు ఎంతో గర్వంగా అనిపించిందంటూ అనంత్ చెప్పారు.
మోదీ పిలుపుతో..
గొప్పింటివారు వివాహాలు అంటే వెంటనే విదేశాలకు వెళ్లిపోతారు. అక్కడే గుట్టుచప్పుడు కాకుండా క్రతువు జరుపుకుంటారు. విదేశాల్లో వివాహ వేడుకలు చేసుకుంటున్న భారతీయ యువ జంటలకు కొద్దినెలల క్రితం మోదీ సూచన చేసిన సంగతి తెలిసిందే. ‘మేకిన్ ఇండియా తరహాలో దేశంలో ‘వెడ్ ఇన్ ఇండియా’ ప్రారంభం కావాలి. భారత్‌లో పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతాడని విశ్వసిస్తారు. అలాంటప్పుడు దేవుడు కలిపిన జంటలు తమ జీవితంలో నూతన ప్రయాణాన్ని (పెళ్లి) విదేశాలకు వెళ్లి ఎందుకు ప్రారంభిస్తున్నాయి? యువ జంటలు వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి ఆలోచించాలి’ అని పిలుపిచ్చారు.
ఇదీ చదవండి: మరో గ్లోబల్ బ్రాండ్‌ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ
అండగా ఉంది..
అనంత్ తాను ఆరోగ్యసమస్యలతో బాధపడుతున్న సమయంలో రాధికా మర్చంట్ అండగా నిలిచిందని వెల్లడించారు. తన జీవితంలో ఆమె ఉండటం అదృష్టమన్నారు. తన కలలరాణి రాధికేనన్నారు. ఎప్పుడూ మూగజీవాల సంరక్షణ గురించి ఆలోచించే అనంత్ వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని అనుకోలేదన్నారు. కానీ రాధికను కలిసిన తర్వాత మొత్తం మారిందని చెప్పారు. అనంత్ చిన్నప్పటి నుంచి ఊబకాయంతో బాధపడుతున్నారు. తన కుమారుడికి ఆస్థమా ఉండటంతో, బరువు తగ్గడం చాలా కష్టంగా మారిందని గతంలో నీతా అంబానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment