
RBI Rs 2,000 Notes Withdrawn: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నిన్న సాయంత్రం రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి గురించి ఒక సంచలన వార్త ప్రకటించింది. ప్రజల వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చని ఈ ప్రకటన సారాంశం. దీనికి నిర్దిష్ట సమయాన్ని కూడా కేటాయించింది. కావున ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కావున ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా లావాదేవీల కోసం ప్రస్తుతానికి ఉపయోగించుకోవచ్చు. కానీ 2023 సెప్టెంబర్ 30 లోపల ఈ నోట్లను ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని కోరింది. ఈ నోట్ల ఉపసంహరణ అనేది పెద్దగా సామాన్య ప్రజలపైన ప్రభావం చూపే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి కొంత సమయం కూడా కల్పించింది. అయితే డిపాజిట్ చేసుకోవడానికి కొన్ని పరిమితులను విధించింది. దీని ప్రకారం, ఒక వ్యక్తి ఒక రోజుకి కేవలం పది నోట్లను మాత్రమే డిపాజిట్/మార్చుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి రోజుకి రూ. 20,000 డిపాజిట్ చేసుకోవచ్చని RBI ప్రకటించింది.
ప్రజల అవసరాలను మాత్రమే కాకుండా బ్యాంకు కార్యకలాపాలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ ప్రక్రియ 2023 మే 23 నుంచి మొదలవుతుంది. కావున ఈ నోట్లను కలిగిన వ్యక్తులు ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత సమయం పెంచుతుందా అనే విషయం ప్రస్తుతానికి ఖచ్చితంగా తెలియదు.
(ఇదీ చదవండి: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..)
నిజానికి 2016లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ.. రూ. 2000 నోట్లను పరిచయం చేసింది. ఈ నోట్ల పరిచయంతో వినియోగదారునికి కరెన్సీ తీసుకెళ్లడం కూడా మరింత సులభమైపోయింది. అప్పట్లో కూడా ప్రాథమికంగా చెలామణిలో ఉన్న పాత నోట్లను చట్టబద్ధమైన టెండర్‌గా ఉపసంహరించుకోవడం జరిగింది.
(ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!)
2016లో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఇతర డినామినేషన్లలో తగిన పరిమాణంలో నోట్లు అందుబాటులోకి రావడంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. రెండు వేల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అప్పటికే 2017లో ఈ నోట్ల (రూ. 2000) చెలామణి పెద్ద ఎత్తున జరిగింది. అయితే త్వరలో డినామినేషన్ విధానం ప్రారంభం కానుంది. ఇతర డినామినేషన్లలోని బ్యాంకు నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయేలా కొనసాగుతోంది. కావున ఎవరు దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.