Rs 2000 Note Ban
-
ఆందోళన వద్దు.. ఆర్టీసీ బస్సుల్లో రూ. 2 వేల నోట్లకు ఓకే
కర్ణాటక: ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించడంతో ప్రజలు తమ వద్దనున్న నోట్లను ఖర్చు చేయడం, లేదా బ్యాంకుల్లో మార్పిడి చేస్తున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను ఇస్తుంటే కండక్టర్లు తీసుకోవడం లేదు. దీంతో అనేకచోట్ల వాగ్వాదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను తీసుకోవాలని ఆ కండక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. బస్సుల్లో ఈ నోట్లను తీసుకుంటారని ఆదివారం స్పష్టం చేశారు. 2 వేల నోట్లను తీసుకోరాదని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. హోసకోటేలో మాత్రమే ఇటువంటి తప్పుడు ఆదేశాలు జారీ అయినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరికీ ఆందోళన వద్దని అన్నారు. -
‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!
సాక్షి, ముంబై: రూ.2 వేల నోటు ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రకటన తరువాత బడా బాబులతోపాటు, సామాన్య ప్రజలు దాకా తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వదిలించుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు తమ తమ స్థాయిల్లో రూ.2 వేల నోట్ల మార్పిడికి నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లలో పెద్ద నోటుదే ప్రస్తుత హవా. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. రోజువారీ నిత్యావసరాలు మొదలు ప్రీమియం బ్రాండెడ్ వస్తువుల కొనుగోళ్లదాకా.. మామిడిపండ్ల నుంచి ఖరీదైన వాచీల దాకా రూ.2 వేల నోటుతోనే కొనుగోలు చేస్తున్నారట. రూ.2 వేల నోటు చలామణికి మరో నాలుగు నెలల్లో (సెప్టెంబరు 30) గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్లో ఏది కొన్నా చెల్లింపులు మాత్రం రూ.2 వేల నోటుతోనే. దీనికి తోడు డిజిటల్ పేమెంట్స్‌లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇపుడు కస్టమర్లు ది బెస్ట్‌గా భావిస్తున్నారట. ఆన్లైన్లో వేసవి సీజన్లో అత్యధికంగా లభించే మామిడిపళ్ల దగ్గరనుంచి ఖరీదైన వాచీలను, ఇతరత్రా వస్తువులను కొనుగోలు చేస్తూ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రోజూ 8 నుంచి 10 పెద్ద నోట్లు వస్తున్నాయని ముంబైలోని ఓ మామిడి పళ్ల వ్యాపారి చెప్పారు. (సింపుల్ వన్: లాంగెస్ట్ రేంజ్ స్కూటర్ వచ్చేసింది, ధర ఎంతో తెలుసా?) సెంట్రల్ ముంబైలోని రాడో స్టోర్‌లో స్టోర్ మేనేజర్ మైఖేల్ మార్టిస్ మాట్లాడుతూ తమ స్టోర్‌లో 2000 రూపాయల నోట్లు 60-70 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు తమ వాచ్ అమ్మకాలు గతంలో 1-2 నుండి రోజుకు 3-4కు పెరిగిందని మార్టిస్ చెప్పారు. పెట్రోల్ బంకుల్లో కూడా ఎక్కువగా రూ.2 వేల నోటే ఇస్తున్నారని, దీంతో చిల్లర సమస్య ఎదుర్కొంటున్నామని బంకు యజమానులు చెబుతున్నారు. రూ.2 వేల నోటుపై ఆర్బీఐ ప్రకటించింది మొదలు తమకు క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు పెరిగాయని జొమాటో ప్రతినిధి తెలిపారు. బంగారం షాపులకు కూడా రద్దీ పుంజుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రైన్ రిజర్వేషన్లకు, బస్ టికెట్లకు ఇలా ఒకటేమిటి.. దాదాపు ప్రతీ లావాదేవీ పెద్ద నోటుతోనే. (ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు) కాగా దేశంలోనే అతిపెద్ద డినామినేషన్ నోటు రూ.2 వేల నోటును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన ఆర్బీఐ ఈ కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు, ఖాతాల్లో జమ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ దెబ్బకు పెట్రోల్ బంకులపై పడిన జనం.. భారీగా తగ్గిన డిజిటల్ పేమెంట్స్
న్యూఢిల్లీ: రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇంధనం కొనుగోళ్లకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో రోజువారీ నగదు అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 90 శాతానికి చేరింది. ఆఖరికి రూ. 100, రూ. 200 కొనుగోళ్లకు కూడా కస్టమర్లు రూ. 2,000 నోట్లను తీసుకొచ్చి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పెట్రోల్ బంకు డీలర్లు వెల్లడించారు. దీనితో తమ దగ్గర నగదు కొరత ఏర్పడుతోందని, తక్కువ విలువ చేసే నోట్లను తగినంతగా తమకు లభించేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్‌ను కోరుతున్నామని వివరించారు. ‘రూ. 2,000 ఉపసంహరణకు ముందు నగదు అమ్మకాల్లో ఈ నోట్ల వాటా 10 శాతమే ఉండేది. కానీ ఇప్పుడు మాకొచ్చే నగదులో 90 శాతం అవే ఉంటున్నాయి. చిన్న కొనుగోళ్లకు కూడా రూ. 2,000 నోట్లు ఇచ్చి మార్చుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా మా దగ్గర నగదు కొరత సమస్య ఏర్పడుతోంది. దీంతో కార్డులు లేదా డిజిటల్ పేమెంట్ విధానాలు వాడాలంటూ అడగాల్సి వస్తోంది. కస్టమర్లకు సజావుగా సేవలు అందించడం కోసం పెట్రోల్ బంకులకు రూ. 2,000 నోట్లకు ప్రతిగా తక్కువ విలువ నోట్లను సమకూర్చాలని బ్యాంకులకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆర్బీఐని కోరుతున్నాం‘ అని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 2016లోలాగే మళ్లీ తిప్పలు.. మళ్లీ తమకు 2016 నవంబర్ 8 డీమానిటైజేషన్ నాటి సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయని బన్సల్ తెలిపారు. ప్రభుత్వం వెసులుబాటునివ్వడంతో అప్పట్లో పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ ఇలాగే అంతా వచ్చి వాటిని బంకుల్లో మార్చుకునేవారని, తీరా చూస్తే తమ తప్పేమీ లేకున్నా ఆదాయపు పన్ను శాఖ నుంచి తమకు నోటీసులు వచ్చేవని పేర్కొన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే కనిపిస్తోందన్నారు. ‘మా రోజువారీ అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపుల వాటా 40 శాతంగా ఉండేది. కానీ అకస్మాత్తుగా అది 10 శాతానికి పడిపోయి నగదు లావాదేవీలు పెరిగిపోయాయి. కస్టమర్లు ఎలాగోలా రూ. 2,000 నోట్లను వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిని మేము రోజువారీగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మళ్లీ ఇన్‌కం ట్యాక్స్ అధికారుల నుంచి మాకు సమస్యలు సృష్టించేలా ఉంది‘ అని బన్సల్ పేర్కొన్నారు. 2016లో మెజారిటీ నోట్లను రద్దు చేసినా, పెట్రోల్ బంకుల్లాంటి కొన్ని చోట్ల కాస్త మినహాయింపులు ఉండేవి. దీంతో నల్లధనం మార్పిడికి అవి వేదికలుగా మారుతున్నాయని ఆ సదుపాయాన్ని ప్రభుత్వం తొలగించింది. -
హైదరాబాద్‌లో షురూ!.. ‘రూ.2 వేల నోటా.. బాబోయ్ మాకొద్దు..’
సాక్షి, సిటీబ్యూరో: ‘రూ.2 వేల నోటా.. బాబోయ్ మాకొద్దు’ గ్రేటర్లో ఇప్పుడు ఎక్కడికెళ్లినా ఇదే మాట వినిపిస్తోంది. ఇప్పుడు రూ.2 వేల నోటుతో ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. చిల్లర వర్తకుల నుంచి బడా వ్యాపార సంస్థల వరకు రూ.2వేల నోటుపై లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ నోటును చలామణిలోంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన కొద్ది క్షణాల్లోనే రూ.2 వేల నోటుపై అన్ని రకాల లావాదేవీలు స్తంభించాయి. వాస్తవానికి సెప్టెంబర్ 30 వరకు లీగల్‌గా చలామణి చేసుకొనే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ నెల 23 నుంచి ఈ నోట్ల మార్పిడికి వెసులుబాటు కల్పించింది. నిబంధనల మేరకు అన్ని రకాల వస్తుసేవల కొనుగోళ్లలో ఈ నోట్లను వినియోగించవచ్చు. కానీ మార్కెట్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. శనివారం సాయంత్రం నుంచే రూ.2 వేల నోటు స్తంభించింది. దీంతో షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్, పెట్రోలు బంకుల్లో నోటును తీసుకోడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు నేరుగా తీసుకునే వెసులుబాటు ఉన్నా చాలా వరకు వెనుకంజ వేస్తున్నారు. కూరగాయల దుకాణం నుంచి మాల్స్ వరకు... ‘రిజర్వ్‌బ్యాంకు ఉన్నపళంగా రెండు వేల నోట్లను చెల్లుబాటు నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పెద్ద నోట్ల రద్దు నాటి కాలం గుర్తుకొస్తోంది. ఈ నోటు తీసుకొని ఎక్కడికి వెళ్లినా వెనుదిరిగా రావాల్సివస్తోంది’ అని కుషాయిగూడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. కూరగాయల దుకాణం నుంచి షాపింగ్‌మాల్స్, సూపర్మార్కెట్లు వంటి అన్ని చోట్ల ఇదే పరిస్థితి. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఎలాంటి చిక్కులెదురవుతాయోనన్న భయంతో వ్యాపారులు వెనుకంజ వేస్తుండగా నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయడం తమ వల్ల కాదంటూ చిరువర్తకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ నోటుకు లీగల్‌గా ఇంకా చెల్లుబాటు ఉన్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. ‘చాలా వరకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ కరెన్సీనే వినియోగిస్తున్నాం. ఈ నోట్ల చలామణికి ఇంకా అవకాశం ఉంది కదా అని వెళితే మాత్రం చుక్కెదురవుతోంది’ అని ఉప్పల్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి తెలిపారు. గడువు ఉందన్నా వద్దంటున్నారు సెప్టెంబర్ 30 వరకు లీగల్‌గా చలామణి చేసుకొనేందుకు అవకాశం ఉందన్నా వ్యాపారులు వినిపించుకోవడం లేదు. రెండు వేల నోటు ఇస్తే వద్దంటూ వెంటనే తిరిగి చేతిలో పెట్టేస్తున్నారు. – రాఘవాచారి, దమ్మాయిగూడ బ్యాంకుల వద్ద పడిగాపులు అకస్మాత్తుగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు. అందుకోసం ఇంట్లో కొద్దో గొప్పో దాచుకుంటాం కదా. వాటిని మార్పిడి చేసుకొనేందుకు ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.పెద్దనోట్ల రద్దు నాటి కాలం గుర్తుకొస్తోంది. – టి.బాలాచారి, కుషాయిగూడ మార్పిడి కోసం ఎదురు చూపులు... మరోవైపు ఇంటి అవసరాల కోసం కొద్దిమొత్తంలో దాచుకున్న జనం రూ.2 వేల నోట్లను మార్పిడి చేసుకొనేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రతి రోజు రూ.20 వేల చొప్పున మార్చుకొనేందుకు ఈ నెల 23 నుంచి వెసులుబాటు ఉండడంతో బ్యాంకుల వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరే అవకాశం ఉంది, తమ బ్యాంకు ఖాతాల్లో మాత్రం రెండు వేల నోట్లను జమ చేసుకొనేందుకు ఎలాంటి పరిమితుల్లేవు. కానీ ఖాతాలతో సంబంధం లేకుండా ఏ బ్యాంకు నుంచైనా మార్చుకొనేందుకు మాత్రం రూ.20 వేల వరకే అవకాశం ఉంది. -
నోట్ల ఉపసంహరణ సామాన్యులపైనా ప్రభావం చూపుతుందా? ఆర్బీఐ సమాధానం ఏంటంటే?
RBI Rs 2,000 Notes Withdrawn: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిన్న సాయంత్రం రూ. 2,000 కరెన్సీ నోట్లను చెలామణి గురించి ఒక సంచలన వార్త ప్రకటించింది. ప్రజల వద్ద ఉన్న రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చని ఈ ప్రకటన సారాంశం. దీనికి నిర్దిష్ట సమయాన్ని కూడా కేటాయించింది. కావున ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. కావున ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా లావాదేవీల కోసం ప్రస్తుతానికి ఉపయోగించుకోవచ్చు. కానీ 2023 సెప్టెంబర్ 30 లోపల ఈ నోట్లను ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలని కోరింది. ఈ నోట్ల ఉపసంహరణ అనేది పెద్దగా సామాన్య ప్రజలపైన ప్రభావం చూపే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ప్రజల వద్ద ఉన్న నోట్లను మార్చుకోవడానికి కొంత సమయం కూడా కల్పించింది. అయితే డిపాజిట్ చేసుకోవడానికి కొన్ని పరిమితులను విధించింది. దీని ప్రకారం, ఒక వ్యక్తి ఒక రోజుకి కేవలం పది నోట్లను మాత్రమే డిపాజిట్/మార్చుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి రోజుకి రూ. 20,000 డిపాజిట్ చేసుకోవచ్చని RBI ప్రకటించింది. ప్రజల అవసరాలను మాత్రమే కాకుండా బ్యాంకు కార్యకలాపాలకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ ప్రక్రియ 2023 మే 23 నుంచి మొదలవుతుంది. కావున ఈ నోట్లను కలిగిన వ్యక్తులు ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఆ తరువాత సమయం పెంచుతుందా అనే విషయం ప్రస్తుతానికి ఖచ్చితంగా తెలియదు. (ఇదీ చదవండి: ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..) నిజానికి 2016లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ.. రూ. 2000 నోట్లను పరిచయం చేసింది. ఈ నోట్ల పరిచయంతో వినియోగదారునికి కరెన్సీ తీసుకెళ్లడం కూడా మరింత సులభమైపోయింది. అప్పట్లో కూడా ప్రాథమికంగా చెలామణిలో ఉన్న పాత నోట్లను చట్టబద్ధమైన టెండర్‌గా ఉపసంహరించుకోవడం జరిగింది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) 2016లో ఈ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో ఇతర డినామినేషన్లలో తగిన పరిమాణంలో నోట్లు అందుబాటులోకి రావడంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. రెండు వేల నోట్ల ముద్రణ నిలిచిపోయింది. అప్పటికే 2017లో ఈ నోట్ల (రూ. 2000) చెలామణి పెద్ద ఎత్తున జరిగింది. అయితే త్వరలో డినామినేషన్ విధానం ప్రారంభం కానుంది. ఇతర డినామినేషన్లలోని బ్యాంకు నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలకు సరిపోయేలా కొనసాగుతోంది. కావున ఎవరు దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
Rs 2000 notes withdraw: బ్యాంకులు ఈ నోట్లను తిరస్కరిస్తే ఏం చేయాలో తెలుసా?
సాక్షి,ముంబై: 2 వేల రూపాయల నోటును రీకాల్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోటును అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్పిడి చేసుకోవచ్చని, డిపాజిట్ చేసుకోవచ్చని కూడా ఆర్బీఐ శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 2 వేల రూపాయల నోటు 2023 అక్టోబరు ఒకటి నుంచి చెల్లుబాటులో ఉండవు. మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకుల్లో ఈ రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక రోజులో ఒకవ్యక్తి గరిష్టంగా రూ. 20 వేల విలువైన నోట్ల వరకు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది. అయితే డిపాజిట్ల విషయంలో ఎలాంటి పరిమితి లేదు. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు బ్యాంకులకు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: జేబులోనే పేలిన మొబైల్: షాకింగ్ వీడియో వైరల్ రూ. 2000 నోటు మార్పిడికి డిపాజిట్లకు బ్యాంకులు నిరాకరిస్తే? ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారంరూ. 2 వేల నోట్లను గడుపు లోపల తీసుకునేందుకు నిరాకరించవు. ఒక వేళ బ్యాంకులు నిరాకరిస్తే ఏంచేయాలనేది వినియోగదారులకుపెద్ద ప్రశ్న. రూ. 2వేల నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి బ్యాంకు నిరాకరించినట్లయితే, సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయవచ్చు. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) అలాంటి అనుభవం ఎదురైతే కొత్త వన్ నేషన్, వన్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద నాలుగు మార్గాల్లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 14448కి ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:15 గంటల మధ్య కాల్ చేయవచ్చు. అలాగే ఆర్బీఐకి ఈ ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే సెంట్రలైజ్డ్ రసీదు అండ్ ప్రాసెసింగ్ సెంటర్', రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4వ అంతస్తు, సెక్టార్ 17, చండీగఢ్ - 160017 అనే చిరునామాకు పోస్ట్ ద్వారా భౌతిక ఫిర్యాదును పంపవచ్చు. -
2 వేల నోట్ల రద్దు నిర్ణయం.. సరైనదా.. కాదా?
అయ్యగారు ఏమి చేస్తున్నారు అంటే కింద పారబోసినదానిని ఎత్తిపోస్తున్నారని ఒక నానుడి. కేంద్ర ప్రభుత్వం తీరు కొన్ని విషయాలలో అలాగే ఉంది. దేశంలో గతంలో 500 రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ సడన్‌గా ప్రకటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. రద్దైన నోట్ల స్థానే కొత్త 500 రూపాయలను నోట్లను అందుబాటులోకి తెచ్చారు. వెయ్యి రూపాయల నోట్లను మాత్రం తిరిగి ముద్రించలేదు. కాని రెండువేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టి ప్రజలను అయోమయంలోకి నెట్టారు. చేసిన తప్పును సరిదిద్దుకోవడమో, లేక బ్లాక్ మనీ రెండు వేల రూపాయల నోట్ల రూపంలో మరింత పెరిగిందన్న భావనవల్లో తెలియదు కాని మొత్తం మీద ఇప్పుడు ఆ నోట్లను ఉపసంహరించుకున్నారు. ఒక రకంగా చూస్తే ఇది మంచి నిర్ణయమే. కాని ఇది కూడా సరైన టైమ్ లో సరైన తీరుగా తీసుకున్నదేనా అన్న చర్చ వస్తోంది. ఈ కొత్త విధానం వల్ల రియల్ ఎస్టేట్ రంగంపై విశేష ప్రభావం చూపవచ్చన్న సందేహం వస్తోంది. అలాగే రాజకీయ నేతలకు ఎన్నికలలో ఖర్చు చేయడానికి ఇప్పుడు ఉన్న వెసులుబాటు కొంత తగ్గవచ్చు. ఆరేళ్ల క్రితం నోట్ల రద్దును ప్రదాని మోదీ ప్రకటించినప్పుడు ఆయన దానిని చాలా ప్రతిష్టాత్మకంగా భావించారు. దానివల్ల దేశంలోని నల్లధనం అంతా ఖతం అయిపోతుందని చెప్పారు. అదే క్రమంలో తను చేసిన ఈ నిర్ణయం నేపధ్యంలో తనపై హత్యకు కుట్ర జరుగుతోందని కూడా ఆయన వెల్లడించి దేశాన్ని దిగ్భ్రమకు గురి చేశారు. నోట్ల రద్దువల్ల దేశానికి చాలా మేలు జరిగిందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు కాని, బీజేపీ నేతలు కాని ప్రచారం చేసేవారు. నిజంగానే నల్లధనం లేకుండా చేయాలంటే 500, వెయ్యి నోట్లను మించి రెండువేల రూపాయల నోట్లను తీసుకు రావడం ఏమటని అనేక మంది మేదావులు ప్రశ్నించినా సమాధానం వచ్చేది కాదు. నల్లదనం పోతుందని అనుకుంటే , సుమారు 16 లక్షల కోట్ల మేర నోట్లను జనం నగదుగా మార్చుకున్నారు. ఈ క్రమంలో కొందరు ధనికులు చేసిన విన్యాసాలు కథలు,కథలుగా వచ్చాయి. ఇందులో కొన్ని బ్యాంకులు కూడా కుమ్మక్కయ్యాయి. ఏమైతేనేమి.. నోట్ల రద్దు వల్ల ఆశించిన లక్ష్యం నెరవేరలేదన్నది నిజం. చాలామంది పెద్దవాళ్లు తమ వద్ద ఉన్న నల్లడబ్బును వివిధ రూట్లలో సురక్షితంగా తెల్లధనంగా చేసుకోగలిగారు. సామాన్యులు మాత్రం నోట్ల మార్పిడి కోసం క్యూలలో నిలబడి నానా పాట్లు పడ్డారు. కొందరైతే తమ ప్రాణాలు కూడా కోల్పోయారు. కొందరు తెలివైన వారు తమకు సన్నిహితులనో, లేక కమిషన్ బేసిస్ మీద కొంతమందిని క్యూలలో నిలబెట్టి తమ డబ్బును విజయవంతంగా మార్చుకోగలిగారు. అదంతా చరిత్ర. నోట్ల రద్దుతో ఉగ్రవాదం అంతరించిపోతుందని మోదీ చెప్పేవారు. కాని జమ్ము-కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదం తగ్గలేదని గత కొన్ని సంవత్సరాలలో జరిగిన ఘటనలు తెలియచేస్తున్నాయి. అయితే నోట్ల రద్దులో మోదీ చిత్తశుద్దిని జనం పెద్దగా శంకించలేదు.అందువల్లే వారు ఇబ్బందులు పడ్డా, ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో దాని ప్రభావం పడకుండానే ఆయన మరోసారి విజయం సాధించారు. రెండువేల రూపాయల నోట్లను తీసుకు రావడం వల్ల ఎన్నికలలో ఓటు రేటు ఆ మేరకు పెరిగిందన్నది వాస్తవం. రాజకీయులకు నోట్లను దాయడం మరింత సులువైంది. ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ వంటివారు ఈ నోట్ల రద్దు తీరును తప్పు పట్టారు. అయినా కేంద్రం పట్టించుకోలేదు. కాని క్రమేపీ వాస్తవ పరిస్థితి అర్ధం చేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ రెండువేల రూపాయల నోట్లను ముద్రించడం నిలుపుదల చేసింది.బ్యాంకులు కూడా ఆ నోట్లను ప్రజలకు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేసింది. తద్వారా రెండువేల రూపాయల నోట్ల సర్కులేషన్ ను తగ్గిస్తూ వచ్చి, ప్రస్తుతం పూర్తిగా ఉపసంహరించుకుంది. దీనివల్ల ప్రజలపై పెద్ద ప్రభావం పడకపోవచ్చని నిపుణుల అభిప్రాయంగా ఉంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై కొంత ప్రభావం కనిపించవచ్చు. ఎందుకంటే ఎంత కాదన్నా ఈ రంగంలో నల్లధనం పాత్ర గణనీయంగా ఉందన్నది వాస్తవం.ఇప్పుడు ఆయా సంస్థల వద్ద ఉన్న ఆ నోట్లను ఎలా మార్చుకుంటారన్నది ఆసక్తికరమైన విషయం. కేవలం ఇరవైవేల రూపాయల వరకే ఒకధపా నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చన్న కండిషన్ సహజంగానే ఇబ్బంది కలిగిస్తుంది. యధా ప్రకారం ఈ రెండువేల రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్న సంస్థలు, వ్యక్తులు కూలికి జనాన్ని తెచ్చి క్యూలలో నిలబెట్టి ఆ డబ్బును మార్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఒకేఖాతాలో మార్చుకుంటే ఆదాయ పన్నుశాఖకు పట్టుబడే అవకాశం ఉంటుంది.ఆ తలనొప్పిని ఎవరూ కోరుకోరు.డిజిటల్ కరెన్సీ వినియోగం బాగా పెరిగినా, నల్లధనం పాత్ర పూర్తిగా పోలేదు. చదవండి: 2 వేల నోటుపై వేటు.. సందేహాలొద్దు.. సమాధానాలివిగో! భూముల వాస్తవ మార్కెట్ విలువకు, రిజిస్ట్రేషన్ విలువకు అధిక తేడా ఉండడమే దీనికి కారణం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని తగు పరిష్కారం కనిపెట్టనంతవరకు ఏదో రకంగా ఈ నల్లధనం సమస్య దేశాన్ని వెంటాడుతూనే ఉంటుంది.ఇక భవిష్యత్తులో జరగనున్న శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఈ రెండువేల నోట్లను వాడే అవకాశం ఉండదు. అందువల్ల ఆ నోట్లను పోగుచేసుకుని ఉన్న పక్షంలో ఆయా రాజకీయ నేతలు ముందుగానే తమ నియోజకవర్గ ఓటర్లకు రెండువేల రూపాయల నోట్లను ఈ సెప్టెంబర్ లోగానే పంపిణీ చేసే అవకాశం లేకపోలేదు. రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ వల్ల ఓటు ధర తగ్గుతుందా?లేదా? అన్నది ఇంకా అప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఏదో రూపంలో 500 రూపాయల నోట్లను స్టాక్ చేసి ఉండవచ్చు. ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి రెండువేల రూపాయల నోట్ల ఉపసంహరణ అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాని ఆ మాట నేరుగా చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ చర్యల వల్ల నల్లధనం నిర్మూలన పూర్తిగా లేకుండా చేయగలిగితే కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించవచ్చు. కాని ఇందులో అదికారంలో ఉన్న బీజేపీ చిత్తశుద్దిని శంకించే పరిస్థితులు ఉన్నాయి. తనతో అంటకాగని రాజకీయ పార్టీలు, నేతలకు సంబంధించి దాడులు చేయించి, తమకు మద్దతు ఇచ్చేవారి జోలికి వెళ్లకపోతే పెద్ద ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ ఇంటిలో సోదాలు జరిపిన ఆదాయపన్ను శాఖ రెండువేల కోట్ల రూపాయల అక్రమాలను గుర్తించినట్లు ప్రకటించింది. ఇది జరిగి నాలుగేళ్లు అయినా ఆ కేసు ముందుకు వెళ్లలేదు. చదవండి: సీఎం జగన్ ‘సూత్రం’.. వారికి గుణపాఠం అవుతుందా? ఎన్నికల వ్యయం పెరగడంలో ప్రముఖ పాత్ర పోషించారన్న విమర్శలు ఎదుర్కునే చంద్రబాబు నాయుడు విలువల గురించి నోట్ల రద్దు గురించి సుద్దులు చెబుతుంటారు. నోట్ల రద్దును తొలుత పొగిడిన ఆయన ఆ తర్వాతకాలంలో బీజేపీకి దూరం అయ్యాక, నోట్ల రద్దుతో దేశాన్ని మోదీ నాశనం చేశారని అన్నారు. ఇప్పుడేమో 2 వేల రూపాయల నోట్లను రద్దు చేయడం తనవల్లేనని చెప్పుకుంటున్నారు. దేశంలో ఏమి జరిగినా అదంతా తన గొప్పే అని చెప్పుకోవడం ఆయనకు అలవాటే. తద్వారా ఆయన అపహాస్యం పాలవుతుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తొలుత నోట్ల రద్దును స్వాగతించారు. కాని తదుపరి ఆయన కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు రెండువేల నోట్ల రద్దు కూడా తిరోగమన చర్యేనని, కుట్రపూరితం అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ రిజర్వుబ్యాంక్ చర్యను తుగ్లక్ చర్యగా అభివర్ణించింది. సహజంగానే విపక్షాలు కేంద్రాన్ని ఈ విషయంలో విమర్శిస్తాయి. నోట్లను రద్దు చేయడం ఏమిటి? 2 వేల రూపాయల నోట్లు తేవడం ఏమిటి? ఇప్పుడు వాటిని ఉపసంహరించడం ఏమిటి? వీటన్నిటిని స్థూలంగా పరిశీలిస్తే కేంద్రం అనండి, రిజర్వు బ్యాంక్ అనండి గతంలో తప్పు చేసినట్లు అర్దం అవుతుంది. కాకపోతే ఆ విషయాన్ని చెప్పుకోవడం అవమానం కనుక, ప్రజలలో పలచన అవుతారు కనుక కామ్ గా తమ పని తాము చేసుకుపోయారని అనుకోవచ్చు. లేకుంటే ప్రధాని మోదీ మళ్లీ ప్రజల ముందుకు వచ్చి దీనిని గొప్పగా ప్రకటించుకుని ఉండేవారేమో! -కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
2 వేల నోటుపై వేటు.. సందేహాలొద్దు.. సమాధానాలివిగో!
సాక్షి, ముంబై: నల్లధనం కట్టడి పేరిట పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2,000 నోటును తెచ్చిన మోదీ సర్కారు.. అనూహ్యంగా దానికి కూడా చెక్ చెప్పింది. రూ.2,000 నోటును చెలామణీ నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. ‘వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ’క్లీన్ నోట్ పాలసీ’ (డిజిటల్ విధాన ప్రోత్సాహం) ప్రకారం రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం జరిగింది..’ అని ప్రకటనలో పేర్కొంది. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు) తక్షణమే రూ.2,000 నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాల్సిందిగా బ్యాంకులను కోరినట్లు తెలిపింది. అయితే ఈ నోట్లను ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడానికి లేదా బ్యాంకుల్లో మార్చుకోవడానికి మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. ఒకదఫా రూ.20,000 పరిమితి వరకూ (అంటే రూ.2,000 నోట్లు 10) ఇతర డినామినేషన్లలోకి మార్చుకోవచ్చని తెలిపింది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?) అలాగే మే 23 నుంచి ఇష్యూ డిపార్ట్మెంట్లను కలిగి ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో (ఆర్వో) కూడా ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా నల్లధనం నిల్వలను పెంచుకునేందుకు అత్యధిక విలువ కలిగిన నోట్లను ఉపయోగిస్తున్నారనే ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ ఈ అనూహ్య చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: 2 వేల నోటు తీసుకురావడమే తప్పు’ 2018–19లోనే ముద్రణ నిలిపివేత పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు సమయంలోనే రూ.2,000 నోటును ప్రవేశ పెట్టడం జరిగింది. అప్పట్లో చెలామణీలో ఉన్న రూ. 500, రూ.1,000 నోట్ల చట్టబద్ధమైన చెల్లుబాటును ఉపసంహరించుకున్న తర్వాత, ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాన్ని త్వరితగతిన తీర్చడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 2018–19లోనే ఆర్బీఐ రూ.2,000నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఈ నోట్లు ఇప్పటికే అరుదుగా చెలామణీలో ఉన్నాయి. ఈ నోట్లు చెల్లుతాయా? 2016 నవంబర్‌లో పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు చేసిన సందర్భంలో ఆ నోట్లు తక్షణమే చెల్లకుండా పోయాయి. దీంతో చాలా మందిలో దీనిపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, ఈసారి సెప్టెంబర్ 30 వరకూ రూ.2,000 నోటు లీగల్ టెండర్ కొనసాగనుంది. అంటే ఈ నోటు సాంకేతికంగా అప్పటివరకూ చెల్లుబాటులోనే ఉంటుందని అర్థం. సాధారణ లావాదేవీలకు రూ.2 వేల నోట్లను వినియోగించవచ్చని ఆర్బీఐ తెలిపింది. అలాగే వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే, 2023 సెప్టెంబర్ 30లోగా మీ వద్ద ఉన్న ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలి లేదా మార్చుకోవాలి. అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్చుకోవచ్చు. అవసరాలకు ప్రస్తుత కరెన్సీ స్టాక్ ఓకే.. రూ. 2,000 నోటును ప్రస్తుతం సాధారణ లావాదేవీలకు వినియోగించడం లేదని తాము గమనించినట్లు ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఇతర డినామినేషన్లలో చెలామణీలో ఉన్న నోట్ల నిల్వ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపోతుందని స్పష్టం చేసింది. రూ.2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెపె్టంబర్ 30 వరకు ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించింది. చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా? వివాదాలకు దూరంగా కేంద్రం! 2016 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు, ఆయా వ్యవహారాలను చూసే ఆర్బీఐని కేంద్రం తక్కువచేసిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈసారి దీనికి దూరంగా ఉందని, రిజర్వ్ బ్యాంకే కీలక నిర్ణయాన్ని ప్రకటించిందని అంటున్నారు. చెలామణీలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు ఆర్బీఐ వెలువరించిన వివరాల ప్రకారం.. రూ.2,000 డినామినేషన్ బ్యాంక్ నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017కు ముందు జారీ అయ్యాయి. వాటి జీవిత కాలం 4–5 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో వీటి విలువ 37.3 శాతం. ఇక 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. అంటే ఈ మొత్తమే ప్రజల నుంచి బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావాలన్నమాట. -
రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్ చేసుకోవచ్చా?
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించు కుంటున్నట్టు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. 2018 నుంచి రూ. 2 వేల నోట్లను ముద్రణను నిలిపివేసిన నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ నోట్ల రద్దుపై భారీ ఊహాగానాలున్నాయి. అయితే తాజాగా రూ. 2000 నోట్లను చలామణి నుంచి విత్ డ్రా చేస్తున్నట్టు, అయితే సెప్టెంబరు 30 వరకు చట్టబద్ధంగా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. తక్షణమే 2,000 నోట్ల జారీ నిలిపివేయాలని కూడా బ్యాంకులకు ఆదేశించింది. అలాగే డిపాజిట్ /లేదా మార్పిడి సదుపాయాన్ని అందించాలని బ్యాంకులను కోరింది. ('క్లీన్ నోట్ పాలసీ' అంటే? ఆర్బీఐ బ్యాంకులకిచ్చిన కీలక ఆదేశాలు తెలుసుకోండి!) అయితే దీనిపై ప్రముఖ ఎనలిస్ట్ లతా వెంకటేశ్ దీనిపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 2000రూపాయి నోట్లు చలామణి నుండి ఉపసంహరణ తప్ప నోట్ల డీమోనిటైజేషన్ కాదని దయచేసి గమనించాలని ఆమె పేర్కొన్నారు. అవి చట్టపరమైన టెండర్‌గా ఉంటాయి. అంటే మీరు దుకాణానికి వెళ్లి దానితో వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ప్రజలు భయాందోళన చెందకముందే దయచేసి ఈ విషయంపై అవగాహన కల్పించాలంటూ ట్వీట్ చేశారు. అంతేకాదుఆర్బీఐ ప్రకటన తరువాత ఏ దుకాణదారుడు ఇప్పటి నుండి అంగీకరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30, 2023 లోపు బ్యాంకుకు వెళ్లి మార్పిడి లేదా డిపాజిట్ చేయవచ్చు అని ఆమె వివరించారు. ఏ షాప్ ఓనర్ అంగీకరిస్తాడు అయితే కొనుగోలు సమయంలో ఏ దుకాణ దారుడు వీటిని అంగీకరిస్తాడు అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఈనోట్లను సెప్టెంబర్ 30 వరకు మాత్రమే. ఆ తర్వాత అది ఉనికిలో ఉండదు. అంటే రిస్క్ అతని చేతిలో ఉంటుంది. ఎందుకంటే షాప్ ఓనరే ఆయా నోట్లను డిపాజిట్ చేయాలి. లేదా మార్పిడి చేసుకోవాలి. అయితే డిపాజిట్ల విషయంలో పరిమితి ఏదీ లేనప్పటికీ, మార్పిడి మాత్రం ఒకసారి 20000 (అంటే 10 నోట్లు) మాత్రమే అవకాశం. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు) వెన్నాడుతున్న డీమానిటైజేషన్ భయాలు 2016 లో డీమానిటైజేషన్ దేశవ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు రేపింది. ఇచ్చిన గడువులోగా తమ దగ్గర ఉన్న రూ. 500, 1000 నోట్లమార్పిడి కోసం బ్యాంకుల వద్ద వినియోగదారులు క్యూలైన్లలో బారులు తీరారు. కొంతమంది క్యూలైన్లలోనే ప్రాణాలు విడిచిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన అనేక దృశ్యాలు, విషాద ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. Once again, no need to panic. Old notes with lower safety features were withdrawn even in the past. But they remain valid currency. Deadline given, I think, only to encourage people to exchange their notes by Sept. But rest assured, they are valid currency And will remain so. — Latha Venkatesh (@latha_venkatesh) May 19, 2023 2016: New note is coming! This will totally eliminate black money. What a Masterstroke! 2023: New note is going away! This will totally eliminate black money. What a Masterstroke! — Dhruv Rathee (@dhruv_rathee) May 19, 2023 -
RBI: దెబ్బకు ఆర్బీఐ వెబ్సైట్ క్రాష్.. కారణం ఇదే!
Reserve Bank of India: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్ల చాలామని ఉండదని తాజాగా ప్రకటించిన కొంత సమయంలో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ క్రాష్ అయింది. ఈ ప్రకటనలో ఎంత వరకు నిజముంది అని తెలుసుకోవడంలో భాగంగా చాలా మంది ఒక్కసారిగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లడంతో ఈ అంతరాయం ఏర్పడింది. 2016లో ప్రధానమంత్రి రూ. 500, రూ. 1000 నోట్ల రద్దు ప్రకటించినప్పుడు కూడా ఇలాంటి అంతరాయమే ఏర్పడింది. ఎవరూ ఊహించని విధంగా రాత్రి సమయంలో ఈ ప్రకటన చేసినప్పుడు చాలా మంది ప్రజలు దీని గురించి తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించారు. ఎక్కువ మంది ఒక్కసారిగా ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడంలో క్రాష్ అయింది. మళ్ళీ అలాంటి సంఘటనే ఇప్పుడు పునరావృతమైంది. దేశంలో బ్లాక్ మనీ తగ్గించడానికి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి కొత్తగా రూ. 2000 నోట్లు తీసుకువచ్చారు. అయితే వాటి ముద్రణ కూడా 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయింది. 2018 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న రెండువేల రూపాయల మొత్తం విలువ సుమారు రూ. 6.73 లక్షల కోట్లని సమాచారం. ప్రస్తుతం RBI వెల్లడించిన సమాచారం ప్రకారం 2023 మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక సారికి కేవలం 10 నోట్లను మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోట్లను మార్చుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30. కావున రెండు వేల రూపాయలు కలిగి ఉన్న ప్రజలు ఏ మాత్రం భయపడాల్సిన పనిలేదు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
'క్లీన్ నోట్ పాలసీ' అంటే? ఆర్బీఐ బ్యాంకులకిచ్చిన కీలక ఆదేశాలు తెలుసుకోండి!
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2వేల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకుని మరోసారి షాకిచ్చింది. అయితే ఇది చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతుందని తెలిపింది. 'క్లీన్ నోట్ పాలసీ' లో భాగంగానే ఈనిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ శుక్రవారం నాటి ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు కస్టమర్లకు రూ. 2వేల నోట్లను జారీని తక్షణమే నిలిపివేయాలని బ్యాంకులకు ఆదేశించింది.అలాగే అన్ని బ్యాంకులు సెప్టెంబర్ 30, 2023 వరకు 2,000 నోట్లకు డిపాజిట్ /లేదా మార్పిడిని అవకాశాన్ని కల్పించాలని కూడా ఆదేశించింది. అలాగే మే 23, 2023 నుండి ఏ బ్యాంక్‌లోనైనా రూ. 2000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లలోకి మార్చుకోవచ్చని ఆర్బీఐ స్పష్టం చేసింది. 'క్లీన్ నోట్ పాలసీ' అంటే ఏమిటి? ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ. 2016 నోట్లు రద్దు తరువాత రూ.2 వేల నోటునుతీసుకొచ్చింది ఆర్బీఐ. అయితే ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చిన తర్వాత , 2018-19లో 2,000 నోట్ల ముద్రణ నిలిపివేసినట్టు ఆర్బీఐ పేర్కొంది. 2017 మార్చిలో 89 శాతం జారీ చేయగా వాటి జీవిత కాలం 4-5 సంవత్సరాల అంచనా వేసింది. 2018 మార్చి 31, నాటికి గరిష్టంగా ఉన్న రూ. 6.73 లక్షల కోట్ల (చెలామణీలో ఉన్న నోట్లలో 37.3 శాతం) మొత్తం విలువ రూ. 6.73 లక్షల కోట్ల నుంచి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గింది, ఇది కేవలం 10.8 శాతం మాత్రమే. 2016 నవంబరులో అప్పటిదాకా చలామణిలో ఉన్న పెద్ద నోట్లు రూ. 500, 1,000 నోట్లను రద్దు చేసింది. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు) మరోవైపు రూ. 2వేల నోటు వితడడ్రా ప్రకటించిన వెంటనే ఆర్బీఐ వెబ్సైట్ క్రాష్ కావడం గమనార్హం. భారీ ట్రాఫిక్ కారణంగా ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ క్రాష్ అవడంతో యూజర్లు ఇబ్బందులు పడ్డారు. -
ముగిసిన రూ.2 వేల నోటు శకం.. ఆరేళ్ల ప్రస్థానం..
దేశంలో ఇప్పటివరకూ చలామణిలో రూ.2 వేల నోటు శకం ముగిసింది. రూ.2 వేల నోటును భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా చలామణి నుంచి ఉపసంహరించింది. అంటే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2 వేల నోట్లన్నీ ఆర్బీఐకి తిరిగిచ్చేయాలి. ఇందుకు సెప్టెంబర్ 30ని తుది గడువుగా ప్రకటించింది. ఆరేళ్ల ప్రస్థానం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సందర్భంగా 2016 నవంబర్ 8న ఆర్బీఐ ఈ రూ.2 వేల నోటును ప్రవేశపెట్టింది. మహాత్మ గాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా దీంతో పాటు రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లను కొత్త డిజైన్‌తో విడుదల చేసింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇప్పుడు రూ.2 వేల నోటును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది ఆర్బీఐ. ఆకర్షణీయ డిజైన్ రూ. 1000 నోట్లను రద్దు చేశాక దానికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రూ.2 వేల నోటును ఆర్బీఐ ప్రవేశపెట్టింది. రంగు, డిజైన్ ఆకట్టుకునేలా తీర్చిదిద్దింది. ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయం మంగళ్యాన్ ఉపగ్రహ ప్రయోగం. దీనికి సంబంధించిన చిత్రాన్ని రూ.2 వేల నోటుపై ముద్రించింది. మైసూరులో ప్రింటింగ్ రూ.2 వేల నోట్లను ఆర్బీఐ మైసూరులో ప్రింట్ చేసింది. మైసూరులోని ఆర్బీఐ ముద్రణా కార్యాలయంలో ఈ నోటు తయారైంది. ఆర్బీఐ డేటా ప్రకారం.. 2017 మార్చి ఆఖరు నాటికి 3,285 మిలియన్ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత ఏడాది వీటి సంఖ్య కేవలం 3,365. అప్పటి నుంచి ముద్రణను క్రమంగా తగ్గించేసింది ఆర్బీఐ. 2018 మార్చి చివరి నాటికి చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్ల విలువ రూ.18,037 కోట్లు. 2020 మార్చి ఆఖరు నాటికి చలామణిలో ఉన్న అన్ని నోట్లలో రూ.20 వేల నోట్లు కేవలం 22.6 శాతం. ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రెడిట్ కార్డులపై ఆర్బీఐ గురి.. పరిమితికి మించితే అనుమతి తప్పనిసరి -
Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు
సాక్షి, ముంబై: కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో అతిపెద్ద 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. అయితే, ఈనోట్లు చట్టబద్ధమైన టెండర్‌గా కొనసాగుతాయని సెంట్రల్ బ్యాంక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కండిషన్స్ అప్లయ్ ♦ మే 23 నుంచి ఏ జాతీయ బ్యాంకులోనైనా రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు. ♦ ఏ విత్ డ్రా అయినా, ఎంత డబ్బు ఇవ్వాలన్నా అందులో రూ. 2 వేల నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులను ఆదేశించిన ఆర్బీఐ ♦ సెప్టెంబరు 30 లోగా ప్రజలు తమ దగ్గరున్న 2 వేల నోట్లను ఏ బ్యాంకులోనయినా డిపాజిట్ చేయొచ్చు ♦ ఒక వ్యక్తి ఒక విడతలో గరిష్టంగా పది రూ. 2 వేల నోట్లను మాత్రమే మార్చుకోవచ్చు. ♦ ఈ నెల 23 నుంచి రూ.2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉంది ♦ మార్చుకోడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 ♦ 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే నిలిచిపోయిన రూ.2 వేల నోటు ముద్రణ “క్లీన్ నోట్ పాలసీ” లో భాగంగానే ఈ నిర్ణయం : ఆర్బీఐ రూ.2000 డినామినేషన్ నోట్లలో దాదాపు 89శాతం మార్చి 2017కి ముందు జారీ చేసినవి. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలుగా అంచనా వేయబడింది. మార్చి 31, 2018 నాటికి (చెలామణిలో ఉన్న నోట్లలో 37.3శాతం) గరిష్టంగా ఉన్న రూ.6.73 లక్షల కోట్ల నుండి చెలామణిలో ఉన్న ఈ నోట్ల మొత్తం విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది, మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8శాతం మాత్రమే ఉన్నాయి. ఈ విలువ సాధారణ లావాదేవీలకు ఉపయోగించడం లేదని గమనించినట్టు ఆర్బీఐ పేర్కొంది. అలాగే ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా 2016లో నవంబరులో చలామణిలో ఉన్న రూ.1,000 రూ.500 నోట్ల రద్దు చేసిన తరువాత రూ.2వేల కరెన్సీ నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. RBI to withdraw Rs 2000 currency note from circulation but it will continue to be legal tender. pic.twitter.com/p7xCcpuV9G — ANI (@ANI) May 19, 2023