RBI Withdraws Rs 2000 Notes From Circulation: Answers All Your Queries - Sakshi
Sakshi News home page

Rs 2000 Notes: 2 వేల నోటుపై వేటు.. సందేహాలొద్దు.. సమాధానాలివిగో..

Published Sat, May 20 2023 10:27 AM | Last Updated on Sat, May 20 2023 12:10 PM

RBI withdraws Rs 2000 Notes From Circulation: Answers All Your Queries - Sakshi

సాక్షి, ముంబై: నల్లధనం కట్టడి పేరిట పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2,000 నోటును తెచ్చిన మోదీ సర్కారు.. అనూహ్యంగా దానికి కూడా చెక్‌ చెప్పింది. రూ.2,000 నోటును చెలామణీ నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం ప్రకటించింది.  ‘వివిధ అంశాలను దృష్టిలో ఉంచుకుని, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  ’క్లీన్‌ నోట్‌ పాలసీ’ (డిజిటల్‌ విధాన ప్రోత్సాహం) ప్రకారం రూ.2,000 డినామినేషన్‌ నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం జరిగింది..’ అని ప్రకటనలో పేర్కొంది. (Rs 2000 Note Ban: రూ. 2 వేల నోట్లు రద్దు)

తక్షణమే రూ.2,000 నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాల్సిందిగా బ్యాంకులను కోరినట్లు తెలిపింది. అయితే ఈ నోట్లను ఖాతాల్లో డిపాజిట్‌ చేసుకోవడానికి లేదా బ్యాంకుల్లో మార్చుకోవడానికి మే 23వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30 వరకు ప్రజలకు సమయం ఇచ్చింది. ఒకదఫా రూ.20,000 పరిమితి వరకూ (అంటే రూ.2,000 నోట్లు 10) ఇతర డినామినేషన్లలోకి మార్చుకోవచ్చని తెలిపింది. (రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్‌ చేసుకోవచ్చా?)

అలాగే మే 23 నుంచి ఇష్యూ డిపార్ట్‌మెంట్‌లను కలిగి ఉన్న 19 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో (ఆర్‌వో) కూడా ఒకేసారి రూ.20,000 పరిమితి వరకు మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొంది. కాగా నల్లధనం నిల్వలను పెంచుకునేందుకు అత్యధిక విలువ కలిగిన నోట్లను ఉపయోగిస్తున్నారనే ఆందోళనల నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ అనూహ్య చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. 

చదవండి: 2 వేల నోటు తీసుకురావడమే తప్పు’

2018–19లోనే ముద్రణ నిలిపివేత
పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు సమయంలోనే రూ.2,000 నోటును ప్రవేశ పెట్టడం జరిగింది. అప్పట్లో చెలామణీలో ఉన్న రూ. 500, రూ.1,000 నోట్ల చట్టబద్ధమైన చెల్లుబాటును ఉపసంహరించుకున్న తర్వాత, ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ అవసరాన్ని త్వరితగతిన తీర్చడానికి ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 2018–19లోనే ఆర్‌బీఐ రూ.2,000నోట్ల ముద్రణను నిలిపివేసింది. ఈ నోట్లు ఇప్పటికే అరుదుగా చెలామణీలో ఉన్నాయి.

ఈ నోట్లు చెల్లుతాయా? 
2016 నవంబర్‌లో పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు చేసిన సందర్భంలో ఆ నోట్లు తక్షణమే చెల్లకుండా పోయాయి. దీంతో చాలా మందిలో దీనిపై సందేహాలు నెలకొన్నాయి. అయితే, ఈసారి సెప్టెంబర్‌ 30 వరకూ రూ.2,000 నోటు లీగల్‌ టెండర్‌ కొనసాగనుంది. అంటే ఈ నోటు సాంకేతికంగా అప్పటివరకూ చెల్లుబాటులోనే ఉంటుందని అర్థం.   సాధారణ లావాదేవీలకు రూ.2 వేల నోట్లను వినియోగించవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే, 2023 సెప్టెంబర్‌ 30లోగా మీ వద్ద ఉన్న ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయాలి లేదా మార్చుకోవాలి. అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్చుకోవచ్చు.  

అవసరాలకు ప్రస్తుత కరెన్సీ స్టాక్‌ ఓకే.. 
రూ. 2,000 నోటును ప్రస్తుతం సాధారణ లావాదేవీలకు వినియోగించడం లేదని తాము గమనించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం ఇతర డినామినేషన్లలో చెలామణీలో ఉన్న నోట్ల నిల్వ ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపోతుందని స్పష్టం చేసింది. రూ.2,000 నోట్లను డిపాజిట్‌ చేయడానికి లేదా మార్చుకోవడానికి సెపె్టంబర్‌ 30 వరకు ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించింది.
చదవండి: రూ. 2000 నోట్ల రద్దు: షాపింగ్‌ చేసుకోవచ్చా?

వివాదాలకు దూరంగా కేంద్రం! 
2016 నవంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసినప్పుడు, ఆయా వ్యవహారాలను చూసే ఆర్‌బీఐని కేంద్రం తక్కువచేసిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈసారి దీనికి దూరంగా ఉందని, రిజర్వ్‌ బ్యాంకే కీలక నిర్ణయాన్ని ప్రకటించిందని అంటున్నారు. 

చెలామణీలో రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు 
ఆర్‌బీఐ వెలువరించిన వివరాల ప్రకారం.. రూ.2,000 డినామినేషన్‌ బ్యాంక్‌ నోట్లలో దాదాపు 89 శాతం మార్చి 2017కు ముందు జారీ అయ్యాయి. వాటి జీవిత కాలం 4–5 సంవత్సరాలుగా అంచనా వేయడం జరిగింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల గరిష్ట చెలామణీ విలువ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో వీటి విలువ 37.3 శాతం. ఇక 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ.2,000 నోట్ల చెలామణీ విలువ రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. ప్రస్తుతం చెలామణీలో ఉన్న మొత్తం నోట్లలో ఈ విలువ 10.8 శాతం మాత్రమే. అంటే ఈ మొత్తమే ప్రజల నుంచి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రావాలన్నమాట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement