సాక్షి, సిటీబ్యూరో: ‘రూ.2 వేల నోటా.. బాబోయ్ మాకొద్దు’ గ్రేటర్‌లో ఇప్పుడు ఎక్కడికెళ్లినా ఇదే మాట వినిపిస్తోంది. ఇప్పుడు రూ.2 వేల నోటుతో ఎలాంటి వస్తువులను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. చిల్లర వర్తకుల నుంచి బడా వ్యాపార సంస్థల వరకు రూ.2వేల నోటుపై లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ నోటును చలామణిలోంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన కొద్ది క్షణాల్లోనే రూ.2 వేల నోటుపై అన్ని రకాల లావాదేవీలు స్తంభించాయి.
వాస్తవానికి సెప్టెంబర్ 30 వరకు లీగల్‌గా చలామణి చేసుకొనే అవకాశం ఉన్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. అదే సమయంలో ఈ నెల 23 నుంచి ఈ నోట్ల మార్పిడికి వెసులుబాటు కల్పించింది. నిబంధనల మేరకు అన్ని రకాల వస్తుసేవల కొనుగోళ్లలో ఈ నోట్లను వినియోగించవచ్చు.
కానీ మార్కెట్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. శనివారం సాయంత్రం నుంచే రూ.2 వేల నోటు స్తంభించింది. దీంతో షాపింగ్ మాల్స్, వైన్ షాప్స్, పెట్రోలు బంకుల్లో నోటును తీసుకోడానికి సిబ్బంది నిరాకరిస్తున్నారు. ఈ నెల 22 వరకు నేరుగా తీసుకునే వెసులుబాటు ఉన్నా చాలా వరకు వెనుకంజ వేస్తున్నారు.
కూరగాయల దుకాణం నుంచి మాల్స్ వరకు...
‘రిజర్వ్‌బ్యాంకు ఉన్నపళంగా రెండు వేల నోట్లను చెల్లుబాటు నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో పెద్ద నోట్ల రద్దు నాటి కాలం గుర్తుకొస్తోంది. ఈ నోటు తీసుకొని ఎక్కడికి వెళ్లినా వెనుదిరిగా రావాల్సివస్తోంది’ అని కుషాయిగూడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒకరు విస్మయం వ్యక్తం చేశారు.
కూరగాయల దుకాణం నుంచి షాపింగ్‌మాల్స్, సూపర్‌మార్కెట్‌లు వంటి అన్ని చోట్ల ఇదే పరిస్థితి. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఎలాంటి చిక్కులెదురవుతాయోనన్న భయంతో వ్యాపారులు వెనుకంజ వేస్తుండగా నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయడం తమ వల్ల కాదంటూ చిరువర్తకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ఈ నోటుకు లీగల్‌గా ఇంకా చెల్లుబాటు ఉన్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు.
‘చాలా వరకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ కరెన్సీనే వినియోగిస్తున్నాం. ఈ నోట్ల చలామణికి ఇంకా అవకాశం ఉంది కదా అని వెళితే మాత్రం చుక్కెదురవుతోంది’ అని ఉప్పల్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి తెలిపారు.
గడువు ఉందన్నా వద్దంటున్నారు
సెప్టెంబర్ 30 వరకు లీగల్‌గా చలామణి చేసుకొనేందుకు అవకాశం ఉందన్నా వ్యాపారులు వినిపించుకోవడం లేదు. రెండు వేల నోటు ఇస్తే వద్దంటూ వెంటనే తిరిగి చేతిలో పెట్టేస్తున్నారు.
– రాఘవాచారి, దమ్మాయిగూడ
బ్యాంకుల వద్ద పడిగాపులు
అకస్మాత్తుగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు. అందుకోసం ఇంట్లో కొద్దో గొప్పో దాచుకుంటాం కదా. వాటిని మార్పిడి చేసుకొనేందుకు ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.పెద్దనోట్ల రద్దు నాటి కాలం గుర్తుకొస్తోంది.
– టి.బాలాచారి, కుషాయిగూడ
మార్పిడి కోసం ఎదురు చూపులు...
మరోవైపు ఇంటి అవసరాల కోసం కొద్దిమొత్తంలో దాచుకున్న జనం రూ.2 వేల నోట్లను మార్పిడి చేసుకొనేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రతి రోజు రూ.20 వేల చొప్పున మార్చుకొనేందుకు ఈ నెల 23 నుంచి వెసులుబాటు ఉండడంతో బ్యాంకుల వద్ద పెద్దఎత్తున జనం బారులు తీరే అవకాశం ఉంది, తమ బ్యాంకు ఖాతాల్లో మాత్రం రెండు వేల నోట్లను జమ చేసుకొనేందుకు ఎలాంటి పరిమితుల్లేవు. కానీ ఖాతాలతో సంబంధం లేకుండా ఏ బ్యాంకు నుంచైనా మార్చుకొనేందుకు మాత్రం రూ.20 వేల వరకే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment