న్యూఢిల్లీ: రూ. 2,000 నోట్ల ఉపసంహరణ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు ఒక్కసారిగా ఎగిశాయి. ఇంధనం కొనుగోళ్లకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో రోజువారీ నగదు అమ్మకాల్లో వీటి వాటా దాదాపు 90 శాతానికి చేరింది. ఆఖరికి రూ. 100, రూ. 200 కొనుగోళ్లకు కూడా కస్టమర్లు రూ. 2,000 నోట్లను తీసుకొచ్చి, మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పెట్రోల్ బంకు డీలర్లు వెల్లడించారు. దీనితో తమ దగ్గర నగదు కొరత ఏర్పడుతోందని, తక్కువ విలువ చేసే నోట్లను తగినంతగా తమకు లభించేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్‌ను కోరుతున్నామని వివరించారు.
‘రూ. 2,000 ఉపసంహరణకు ముందు నగదు అమ్మకాల్లో ఈ నోట్ల వాటా 10 శాతమే ఉండేది. కానీ ఇప్పుడు మాకొచ్చే నగదులో 90 శాతం అవే ఉంటున్నాయి. చిన్న కొనుగోళ్లకు కూడా రూ. 2,000 నోట్లు ఇచ్చి మార్చుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా మా దగ్గర నగదు కొరత సమస్య ఏర్పడుతోంది. దీంతో కార్డులు లేదా డిజిటల్ పేమెంట్ విధానాలు వాడాలంటూ అడగాల్సి వస్తోంది. కస్టమర్లకు సజావుగా సేవలు అందించడం కోసం పెట్రోల్ బంకులకు రూ. 2,000 నోట్లకు ప్రతిగా తక్కువ విలువ నోట్లను సమకూర్చాలని బ్యాంకులకు మార్గదర్శకాలు ఇవ్వాలని ఆర్‌బీఐని కోరుతున్నాం‘ అని ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
2016లోలాగే మళ్లీ తిప్పలు..
మళ్లీ తమకు 2016 నవంబర్ 8 డీమానిటైజేషన్ నాటి సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయని బన్సల్ తెలిపారు. ప్రభుత్వం వెసులుబాటునివ్వడంతో అప్పట్లో పెద్ద నోట్ల రద్దు సమయంలోనూ ఇలాగే అంతా వచ్చి వాటిని బంకుల్లో మార్చుకునేవారని, తీరా చూస్తే తమ తప్పేమీ లేకున్నా ఆదాయపు పన్ను శాఖ నుంచి తమకు నోటీసులు వచ్చేవని పేర్కొన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితే కనిపిస్తోందన్నారు. ‘మా రోజువారీ అమ్మకాల్లో డిజిటల్ చెల్లింపుల వాటా 40 శాతంగా ఉండేది. కానీ అకస్మాత్తుగా అది 10 శాతానికి పడిపోయి నగదు లావాదేవీలు పెరిగిపోయాయి.
కస్టమర్లు ఎలాగోలా రూ. 2,000 నోట్లను వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిని మేము రోజువారీగా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది మళ్లీ ఇన్‌కం ట్యాక్స్ అధికారుల నుంచి మాకు సమస్యలు సృష్టించేలా ఉంది‘ అని బన్సల్ పేర్కొన్నారు. 2016లో మెజారిటీ నోట్లను రద్దు చేసినా, పెట్రోల్ బంకుల్లాంటి కొన్ని చోట్ల కాస్త మినహాయింపులు ఉండేవి. దీంతో నల్లధనం మార్పిడికి అవి వేదికలుగా మారుతున్నాయని ఆ సదుపాయాన్ని ప్రభుత్వం తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment